Share News

ఇళ్ల నిర్మాణంలో నాణ్యత లేదు

ABN , Publish Date - Jun 28 , 2025 | 12:43 AM

రాష్ట్ర గృహ నిర్మాణ, సమాచార శాఖల మంత్రి కొలుసు పార్థసారథి శుక్రవారం మండలంలోని పైడివాడఅగ్రహారంలో ఎన్టీఆర్‌ గృహ నిర్మాణ లే-అవుట్‌ను, నిర్మించిన ఇళ్లను పరిశీలించారు. వినియోగిస్తున్న మెటీరియల్‌, నిర్మాణ పనుల్లో నాణ్యతను పరిశీలించి అసంతృప్తి వ్యక్తం చేశారు.

ఇళ్ల నిర్మాణంలో నాణ్యత లేదు
ఇళ్ల నిర్మాణానికి తీసుకువచ్చిన ఇనుమును పరిశీలిస్తున్న మంత్రి పార్థసారథి, ఎమ్మెల్యే పంచకర్ల

నాసిరకం మెటీరియల్‌ వినియోగం

గృహ నిర్మాణ శాఖ మంత్రి పార్థసారథి

పైడివాడఅగ్రహారంలో ఎన్టీఆర్‌ కాలనీ పరిశీలన.

సబ్బవరం, జూన్‌ 27 (ఆంధ్రజ్యోతి) : రాష్ట్ర గృహ నిర్మాణ, సమాచార శాఖల మంత్రి కొలుసు పార్థసారథి శుక్రవారం మండలంలోని పైడివాడఅగ్రహారంలో ఎన్టీఆర్‌ గృహ నిర్మాణ లే-అవుట్‌ను, నిర్మించిన ఇళ్లను పరిశీలించారు. వినియోగిస్తున్న మెటీరియల్‌, నిర్మాణ పనుల్లో నాణ్యతను పరిశీలించి అసంతృప్తి వ్యక్తం చేశారు. నాణ్యత లేని మెటీరియల్‌ను వినియోగించవద్దని గృహనిర్మాణ శాఖ అధికారులను ఆదేశించారు. అనంతరం ఇళ్ల లబ్ధిదారులతో ఏర్పాటు చేసిన సమావేశంలో మంత్రి మాట్లాడుతూ, గత ప్రభుత్వ నిర్వాకం కారణంగా ఇళ్ల నిర్మాణాల్లో నాణ్యత లోపించిందని ఆరోపించారు. ఇళ్ల నిర్మాణంలో ఒక పద్ధతి పాటించకుండా ఇష్టానుసారం పనులు చేపట్టి, పూర్తి చేయకుండానే నిధులు డ్రా చేసుకున్నారని విమర్శించారు. లేఅవుట్ల అభివృద్ధి, ఇళ్ల నిర్మాణాల్లో జరిగిన అవకతవకపై విచారణ చేయిస్తామన్నారు. ఇక్కడి లేఅవుట్లలో మిగిలి ప్లాట్లను స్థానిక లబ్ధిదారులకు పంపిణీ చేస్తామని మంత్రి హామీ ఇచ్చారు. ఎమ్మెల్యే పంచకర్ల రమేశ్‌బాబు మాట్లాడుతూ, పేదలకు ఇళ్ల స్థలాల కోసం గత ప్రభుత్వ హయాంలో చేపట్టిన భూ సేకరణలో అవకతవకలు జరిగాయని ఆరోపించారు. ఇళ్లు నిర్మించకుండానే బిల్లులు డ్రా చేసిన కాంట్రాక్టర్‌పై చర్యలు తీసుకోవాలని మంత్రిని కోరారు. ఈ కార్యక్రమంలో టీడీపీ పెందుర్తి నియోజకవర్గం ఇన్‌చార్జి గండి బాబ్జీ, రాష్ట్ర గృహనిర్మాణ సంస్థ చైర్మన్‌ బత్తుల తాతయ్యబాబు, హౌసింగ్‌ పీడీ సత్తిబాబు, సీఈ కృష్ణయ్య, ఈఈ శ్రీనివాసరావు, డీఈఈ సూర్యారావు, అధికారులు, కూటమి నేతలు పాల్గొన్నారు.

Updated Date - Jun 28 , 2025 | 12:43 AM