ఎంఐజీ లేఅవుట్లకు కొరవడిన ఆదరణ
ABN , Publish Date - Aug 02 , 2025 | 12:43 AM
మధ్య తరగతి ప్రజల పేరు చెప్పి రాష్ట్ర ప్రభుత్వాలు లేఅవుట్లు వేయడం, వాటికి ఆదరణ కొరవడి మధ్యలో ఆగిపోవడం, ఆ తరువాత వాటిని అధిక రేట్లకు అమ్ముకొని ప్రభుత్వం లాభపడడం ఆనవాయితీగా వస్తోంది.
ఆరు లేఅవుట్లలో అమ్మకానికి 2,468 ప్లాట్లు
ఇప్పటివరకూ అమ్ముడైనవి కేవలం 468 మాత్రమే
మిగిలిన 2,000 ప్లాట్లు వేలం ద్వారా విక్రయం
ప్రభుత్వ కొత్త మార్గదర్శకాలు జారీ
ప్రజా సంఘాల అభ్యంతరం
(విశాఖపట్నం-ఆంధ్రజ్యోతి)
మధ్య తరగతి ప్రజల పేరు చెప్పి రాష్ట్ర ప్రభుత్వాలు లేఅవుట్లు వేయడం, వాటికి ఆదరణ కొరవడి మధ్యలో ఆగిపోవడం, ఆ తరువాత వాటిని అధిక రేట్లకు అమ్ముకొని ప్రభుత్వం లాభపడడం ఆనవాయితీగా వస్తోంది. వైఎస్ రాజశేఖర్‌రెడ్డి సీఎంగా ఉన్నప్పుడు ‘రాజీవ్ స్వగృహ’ పేరుతో మధ్య తరగతికి ఫ్లాట్లు నిర్మిస్తామంటూ ఎండాడలో పనులు మొదలెట్టారు. అది మధ్యలో ఆగిపోయింది. ఆ భూములను ఆయన కుమారుడు జగన్మోహన్‌రెడ్డి ప్లాట్లుగా విభజించి వేలం ద్వారా కోట్ల రూపాయలకు అమ్ముకొని ఖజానా నింపుకొన్నారు. జగన్ హయాంలో మళ్లీ మధ్య తరగతి ప్రజల కోసం అంటూ వీఎంఆర్‌డీఏతో ‘ఎంఐజీ లేఅవుట్లు’ వేయించారు. వాటికీ ఆశించిన ఆదరణ లభించలేదు. ఇప్పుడు వాటిని వేలం ద్వారా విక్రయించాలని కూటమి ప్రభుత్వం నిర్ణయించింది.
వైసీపీ హయాంలో నాలుగేళ్ల క్రితం మధ్య తరగతి ప్రజల కోసం వీఎంఆర్‌డీఏ ద్వారా ఆరు లేఅవుట్లు వేయించారు. ఆనందపురం మండలం పాలవలస, రామవరం, గంగసాని అగ్రహారం-1, గంగసాని అగ్రహారం-2, విజయనగరం జిల్లా గరివిడి, అనకాపల్లి జిల్లా అడ్డూరుల్లో వీటిని వేశారు. వాటిలో 150 గజాలు, 200 గజాలు, 240 గజాలు ప్లాట్లు వేశారు. వాటిని అమ్మకానికి పెట్టారు. ఏడాదికి రూ.18 లక్షల ఆదాయం దాటని వారు మాత్రమే దరఖాస్తు చేయాలనే నిబంధన పెట్టారు. ఒక కుటుంబానికి ఒకటి మాత్రమే కేటాయిస్తామని స్పష్టంచేశారు. దరఖాస్తుదారులకు నచ్చిన ప్లాటు ఎంపిక చేసుకునే అవకాశం ఇవ్వలేదు. దరఖాస్తులన్నీ స్వీకరించి లాటరీ వేస్తామని, అందులో ఏది వస్తే అదే తీసుకోవాలని పేర్కొన్నారు. దాంతో చాలామంది ఆసక్తి చూపించలేదు. లక్షల రూపాయలు పెట్టి కొనే ప్లాటు వాస్తు ప్రకారం నచ్చింది ఇవ్వకపోతే ఎలా? అంటూ ముందుకురాలేదు. పైగా ఆయా లేఅవుట్లలో అన్ని ప్లాట్లకు ఒకటే ధర నిర్ణయించారు. అంటే రహదారి పక్కన ఉన్నవాటికి, దూరంగా ఉన్నవాటికి ఒకటే ధర పెట్టారు. అది కూడా చాలామందికి నచ్చలేదు. అంతేకాకుండా లేఅవుట్ల అభివృద్ధి పనులు కూడా ఆశించినంత వేగంగా సాగలేదు. దరఖాస్తుదారులు కట్టిన సొమ్ముతో దశల వారీగా మౌలిక వసతులు కల్పిస్తామని అధికారులు చెప్పడంతో చాలామంది వెనక్కి తగ్గారు. చివరికి వాటిని ఆదరణ కరవైంది. కేవలం పాలవలస లేఅవుట్‌లో ప్లాట్లు తీసుకునేందుకు మాత్రమే అత్యధికులు మొగ్గు చూపారు. అది కూడా అనకాపల్లి-ఆనందపురం జాతీయ రహదారికి పక్కన ఉండడంతో ప్రభుత్వ ఉద్యోగులు అంతా అక్కడ స్థలం కోసం దరఖాస్తు చేశారు. అందులో 472 ప్లాట్లు ఉండగా 435 కేటాయించేశారు. ఇంకా 37 ఉన్నాయి. రామవరం, గంగసాని అగ్రహారం-1, 2లలో బోణీ పడలేదు. అంటే ఒక్క దరఖాస్తు కూడా రాలేదు. గరివిడిలో 211 ప్లాట్లకు ముగ్గురు మాత్రమే తీసుకున్నారు. అడ్డూరులోని 146 ప్లాట్లలో 30 మంది తీసుకున్నారు. ఇంకా 116 ఉన్నాయి. మొత్తం ఆరు లేఅవుట్లలో 2,468 ప్లాట్లు వేయగా, 468 అమ్ముడుపోయాయి. ఇంకా 2వేలు ఖాళీగా ఉన్నాయి.
కొత్త మార్గదర్శకాలు
రాష్ట్ర ప్రభుత్వం ఈ ఎంఐజీ లేఅవుట్లపై కొత్త మార్గదర్శకాలు ఇచ్చింది. ఈ లేఅవుట్లకు మళ్లీ కొత్తగా దరఖాస్తులు స్వీకరించవద్దని స్పష్టం చేసింది. పాత దరఖాస్తులనే బయటకు తీసి, ఆసక్తి చూపిన వారికి లాటరీ ద్వారా కేటాయించాలని పేర్కొంది. అవి పోను ఇంకా మిగిలితే వేలం ద్వారా విక్రయించాలని ఆదేశించింది.
ఇకపై ఎవరైనా కొనుక్కోవచ్చు
ఇకపై ఎంఐజీ ప్లాట్లను వేలంలో విక్రయిస్తారు. ఎవరైనా పాల్గొనవచ్చు. వాటికి నిబంధనలు వర్తించవు. అంటే వార్షిక ఆదాయంపై పరిమితి ఉండదు. పాలవలసలో గజం ధర రూ.14 వేలు పెట్టారు. దాదాపు అన్నీ అయిపోనట్టే. రామవరం, జీఎస్ అగ్రహారం లేఅవుట్లకు ఇంకా ధరలు నిర్ణయించలేదు. రఘుమండలో గజం రూ.6,500 కాగా అడ్డూరులో రూ.4 వేలు పెట్టారు. గరివిడిలో మొదట గజం ధర రూ.7,700 పెట్టి అధికంగా ఉందని ఎవరూ ముందుకు రాకపోవడంతో దానిని రూ.2 వేలు తగ్గించి రూ.5,700 చేశారు.
లాటరీ ద్వారా కేటాయించాలని డిమాండ్
మధ్య తరగతి ప్రజలకు తక్కువ ధర అని ప్రకటించడం, ఆ తరువాత వేలం పెట్టడం వల్ల ఆ పరిసర ప్రాంత రియల్ ఎస్టేట్ సంస్థలు వాటి ధరలను కావాలనే పెంచేస్తున్నాయి. దాంతో ఎవరికీ అవి అందుబాటులో ఉండడం లేదు. వీఎంఆర్‌డీఏ తన ఖర్చులు, లాభం వేసుకొని లాటరీ ద్వారానే వాటిని విక్రయిస్తే రేట్లు పెరగవు. నచ్చిన వారు కొనుక్కుంటారు. ఇప్పుడు కూడా ఎన్‌టీఆర్ ఎంఐజీ లేఅవుట్లలో మిగిలిన రెండు వేల ప్లాట్లను కొత్తగా దరఖాస్తులు ఆహ్వానించి లాటరీ ద్వారానే కేటాయించాలని ప్రజా సంఘాలు డిమాండ్ చేస్తున్నాయి. వీఎంఆర్‌డీఏ వేలం పాటలు పెట్టి భూముల ధరలు పెంచడం మానుకోవాలని కోరుతున్నాయి. దీనికి ప్రభుత్వం సహకరించడం విచారకరమని పలువురు ఆందోళన వ్యక్తంచేస్తున్నారు.