శతాబ్ది ఉత్సవాలకు నిధుల కొరత!
ABN , Publish Date - Oct 19 , 2025 | 12:58 AM
ఆంధ్ర విశ్వవిద్యాలయం శతాబ్ది ఉత్సవాలకు నిధుల కొరత ఏర్పడింది. వాస్తవానికి పాలకులు ముందుగానే నిధులను సమీకరించుకోవాలి.
ముందుచూపు లేని ఏయూ పాలకులు
ప్రభుత్వానికి అసలు ప్రతిపాదనలు పంపలేదని సమాచారం
అనుబంధ కాలేజీలు ముందుకు వచ్చినా ససేమిరా అన్న వర్సిటీ పెద్దలు
వేడుకలు ప్రారంభమై ఆరు నెలలు దాటుతున్నా ఎక్కడా కనిపించని సందడి
సెమినార్లు, కాన్ఫరెన్స్‌ల నిర్వహణ బిల్లులు కూడా చెల్లించని వైనం
విశాఖపట్నం, అక్టోబరు 18 (ఆంధ్రజ్యోతి):
ఆంధ్ర విశ్వవిద్యాలయం శతాబ్ది ఉత్సవాలకు నిధుల కొరత ఏర్పడింది. వాస్తవానికి పాలకులు ముందుగానే నిధులను సమీకరించుకోవాలి. అందుకు విరుద్ధంగా వేడుకలు ప్రారంభమై ఆరు నెలలు దాటుతున్నా ఇప్పటివరకూ నిధులను సిద్ధం చేసుకోకపోవడంతో ఇబ్బందులు తలెత్తుతున్నాయి.
ఆంధ్ర విశ్వవిద్యాలయం ఏర్పాటై వచ్చే ఏడాది ఏప్రిల్ 26వ తేదీ నాటికి వందేళ్లు అవుతోంది. ఈ నేపథ్యంలో ఈ ఏడాది ఏప్రిల్ 26 నుంచి వచ్చే ఏడాది ఏప్రిల్ 26 వరకు ఏడాదిపాటు ఉత్సవాలను నిర్వహించాలని నిర్ణయించారు. ఇందులో భాగంగా క్రీడా, సాంస్కృతిక కార్యక్రమాలతోపాటు వివిధ విభాగాల్లో సెమినార్లు, కాన్ఫరెన్స్‌లు, అకడమిక్ ప్రోగ్రామ్స్ నిర్వహించాలని నిర్ణయించారు. ఈ మేరకు కొన్ని నెలల కిందట షెడ్యూల్ విడుదల చేశారు. అయితే, ఆయా కార్యక్రమాలు నిర్వహించాలంటే నిధులు కావాలి. ఇందుకోసం ప్రభుత్వం నుంచి కొంత మొత్తాన్ని పొందేందుకు విశ్వవిద్యాలయం అధికారులు యత్నించాలి. రాష్ట్రంలో వందేళ్లు పూర్తి చేసుకుంటున్న ఏకైక విశ్వవిద్యాలయం ఏయూ. ఇదే విషయాన్ని ప్రభుత్వ పెద్దల దృష్టికి తీసుకువెళ్లి నిధులను తీసుకువస్తే వేడుకలను అట్టహాసంగా నిర్వహించేందుకు అవకాశం ఉండేది. అయితే, ఇప్పటివరకూ ప్రభుత్వం నుంచి రూపాయి కూడా వర్సిటీ అధికారులు తెచ్చుకోలేకపోయారు. అసలు శతాబ్ది వేడుకలకు నిధులు కావాలన్న ప్రతిపాదనలు వెళ్లాయో.? లేదో.? కూడా తెలియడం లేదని పలువురు అధికారులు పేర్కొంటున్నారు. సాధారణంగా శతాబ్ది వేడుకలకు నిర్వహణ ఇంత బడ్జెట్ కావాలన్న ప్రతిపాదనలు పెట్టి ఉంటే ఆ మేరకు ప్రభుత్వ వర్గాలు విడుదల చేస్తాయి. కానీ, అధికారుల నుంచి ప్రతిపాదనలు లేకపోవడంతోనే ప్రభుత్వం కూడా పట్టనట్టు ఉందన్న వ్యాఖ్యలు వినిపిస్తున్నాయి.
అనుబంధ కాలేజీలు ముందుకు వచ్చినా...
ఏయూ పరిధిలో సుమారు 200 వరకు డిగ్రీ, మరో 60 బీఈడీ, మరో 50 వరకు లా కాలేజీలు ఉన్నాయి. ఆయా కాలేజీల్లో వేలాది మంది విద్యార్థులు చదువుతున్నారు. శతాబ్ది ఉత్సవాలు జరుపుకుంటుండడంతో అనుబంధ కాలేజీలకు చెందిన ప్రతినిధులు కొద్దిరోజులు కిందట వర్సిటీ ఉన్నతాధికారులను కలిశారు. తమ వంతుగా వేడుకలకు అవసరమైన నిధులను అందిస్తామని ముందుకువచ్చారు. అయితే, వర్సిటీ ఉన్నతాధికారులు అందుకు ససేమిరా అనడంతో వారంతా ఆశ్చర్యపోయారు. సాధారణంగా దాతలు, పూర్వ విద్యార్థులు, అనుబంధ కాలేజీల నుంచి నిధులను సమీకరించి పెద్దఎత్తున ఉత్సవాలను నిర్వహించాలని ఎవరైనా భావిస్తారు. అందుకు విరుద్ధంగా అనుబంధ కాలేజీలకు చెందిన ప్రతినిధులు ముందుకు వచ్చి సహకారాన్ని అందిస్తామని చెప్పినా..అధికారులు కాదనడంతో ఏమీ చేయలేక వారంతా వెనుతిరిగారు.
మౌన ముద్రలో ఏఏఏ
ఏయూ పూర్వ విద్యార్థి అయిన గ్రంథి మల్లికార్జునరావు నేతృత్వంలోని ఆంధ్ర యూనివర్సిటీ అలూమ్నీ అసోసియేషన్ (ఏఏఏ) గత కొన్నాళ్లుగా పూర్వ విద్యార్థుల సమ్మేళనాన్ని ఘనంగా నిర్వహించడంలో కీలకపాత్ర పోషించింది. శతాబ్ది ఉత్సవాలను ఘనంగా నిర్వహించేందుకు ఏఏఏ తొలుత భారీ ప్రణాళికలను వేసింది. దేశ, విదేశాలకు చెందిన పూర్వ విద్యార్థుల నుంచి భారీగా నిధులు సమీకరించాలని యోచించింది. అవసరమైతే శతాబ్ది వేడుకలకు గుర్తుగా ఏదైనా నిర్మాణం చేపట్టాలని భావించింది. అయితే, వర్సిటీ అధికారుల నుంచి స్పందన లేకుపోవడంతో మిన్నకున్నట్టు తెలిసింది.
ఇప్పుడెలా మరి..
శతాబ్ది ఉత్సవాల్లో భాగంగా ఈ ఏడాది ఏప్రిల్ నుంచి వర్సిటీలోని అనేక విభాగాల్లో సెమినార్లు, కాన్ఫరెన్స్‌లు, ఇతర కార్యక్రమాలను నిర్వహించారు. ఒక్కో కాన్ఫరెన్స్ నిర్వహణకు కనీసం రూ.లక్ష నుంచి రూ.5 లక్షల వరకు ఖర్చు అవుతుంది. ప్రాథమికంగా సదరు విభాగాధిపతులు తమకు ఉన్న పరిచయాల అవసరమైనవి సమకూర్చుకున్నారు. నిర్వహణకు అయిన ఖర్చులు ఇవ్వడం లేదంటూ పలువురు విభాగాధిపతులు వాపోతున్నారు. ఇకపోతే, వేడుకల్లో భాగంగా భారీఎత్తున క్రికెట్ టోర్నమెంట్ నిర్వహణకు వర్సిటీ అధికారులు శ్రీకారం చుట్టారు. అయితే, నిధులు లేకపోవడంతో ఏం చేయాలో తెలియక నిర్వహణ బాధ్యత తీసుకున్నవారు తలలు పట్టుకున్నట్టు తెలిసింది. ఇప్పటికైనా ఏయూ అధికారులు శతాబ్ది వేడుకల నిర్వహణ, ఖర్చులపై దృష్టి సారించి నిధుల సమీకరించుకోవడంపై దృష్టిసారిస్తే బాగుంటుందని సీనియర్ ప్రొఫెసర్లు సూచిస్తున్నారు. ఇప్పటికే ఆరు నెలలు పూర్తయిందని, మిగిలిన ఆరు నెలలైనా వేడుకలు గ్రాండ్‌గా నిర్వహించేలా చూడాలని పూర్వ విద్యార్థులు, విద్యార్థులు కోరుతున్నారు.