ఉచిత ప్రయాణానికి బస్సుల కొరత
ABN , Publish Date - Aug 08 , 2025 | 12:57 AM
రాష్ట్ర ప్రభుత్వం ‘స్ర్తీ శక్తి’ పేరుతో ఆర్టీసీ బస్సుల్లో మహిళలకు మరో వారం రోజుల్లో కల్పించనున్న ఉచిత ప్రయాణ సదుపాయం జిల్లాలోని మహిళలు పూర్తిస్థాయిలో వినియోగించుకునే పరిస్థితి లేకపోయింది. ఐదు రకాల బస్సుల్లో ఉచితంగా ప్రయాణం చేయవచ్చని ప్రభుత్వం చెప్పగా, అనకాపల్లి మహిళలకు మూడు రకాల బస్సులు మాత్రమే అందుబాటులో వున్నాయి.
అనకాపల్లి డిపోలో రెండు సర్వీసులే ఎక్స్‌ప్రెస్‌లు
95 శాతం పల్లె వెలుగు, సిటీ ఆర్డినరీ, మెట్రో ఎక్స్‌ప్రెస్‌లు
ఇవి ఉమ్మడి విశాఖ జిల్లాతోపాటు విజయనగరం వరకే పరిమితం
అనకాపల్లి ఆర్టీసీ కాంప్లెక్స్‌కు రాని ఇతర డిపోల ఎక్స్‌ప్రెస్ బస్సులు
అనకాపల్లి టౌన్, ఆగస్టు 7 (ఆంధ్రజ్యోతి): రాష్ట్ర ప్రభుత్వం ‘స్ర్తీ శక్తి’ పేరుతో ఆర్టీసీ బస్సుల్లో మహిళలకు మరో వారం రోజుల్లో కల్పించనున్న ఉచిత ప్రయాణ సదుపాయం జిల్లాలోని మహిళలు పూర్తిస్థాయిలో వినియోగించుకునే పరిస్థితి లేకపోయింది. ఐదు రకాల బస్సుల్లో ఉచితంగా ప్రయాణం చేయవచ్చని ప్రభుత్వం చెప్పగా, అనకాపల్లి మహిళలకు మూడు రకాల బస్సులు మాత్రమే అందుబాటులో వున్నాయి.
రాష్ట్ర ప్రభుత్వం సూపర్ సిక్స్ హామీల్లో ఒకటైన ‘ఆర్టీసీ బస్సులల్లో మహిళలకు ఉచిత ప్రయాణం’ పథకాన్ని ఈ నెల 15వ తేదీ నుంచి అమలు చేయనున్నట్టు ప్రకటించిన విషయం తెలిసిందే. పల్లె వెలుగు, అల్ర్టా పల్లెవెలుగు, సిటీ ఆర్డినరీ, ఎక్స్‌ప్రెస్, మెట్రో ఎక్స్‌ప్రెస్ బస్సుల్లో రాష్ట్రంలో ఎక్కడి నుంచి ఎక్కడికైనా ఉచితంగా ప్రయాణం చేయవచ్చు. కండక్టర్‌కు రేషన్‌కార్డు/ ఓటర్ ఐడీ/ ఆధార్‌కార్డుల్లో ఏదో ఒకదానిని చూపితే చాలు. కండక్టర్ ‘జోరో’ టికెట్ జారీ చేస్తారు. ఈ పథకాన్ని పక్కాగా అమలు చేయడానికి అధికారులు ముందస్తు చర్యలు చేపట్టారు. అయితే జిల్లా కేంద్రమైన అనకాపల్లి డిపోకు చెందిన బస్సులు అనకాపల్లి, అలూరి సీతారామరాజు, విశాఖ, విజయనగరం జిల్లాలకు మాత్రమే నడుస్తున్నాయి. అనకాపల్లి డిపోలో మొత్తం 98 బస్సులు ఉన్నాయి. వీటిలో 56 బస్సులు సంస్థకు చెందినవి కాగా 42 బస్సులు అద్దెవి. సంస్థ బస్సుల్లో ఐదు మాత్రమే ఎక్స్‌ప్రెస్ సర్వీసులు ఉన్నాయి. 13 మెట్రో సర్వీసులు, ఐదు సిటీ ఆర్డనరీ, 33 పల్లె వెలుగు బస్సులు ఉన్నాయి. అద్దె బస్సుల విషయానికి వస్తే తొమ్మిది మెట్రో సర్వీసులు, రెండు సిటీ ఆర్డినరీ, 31 పల్లె వెలుగు బస్సులు ఉన్నాయి. అనకాపల్లి నుంచి పలాస, పర్లాకిమిడికి నడిచే ఎక్స్‌ప్రెస్‌లు మినహాయిస్తే మిగిలిన బస్సులు ఉమ్మడి విశాఖ జిల్లాతోపాటు పక్కనే వున్న విజయనగరానికి నడుస్తున్నాయి. ఇవి కూడా మెట్రో ఎక్స్‌ప్రెస్, పల్లెవెలుగు, సిటీ ఆర్డనరీ బస్సులే కావడం గమనార్హం. అనకాపల్లి నుంచి పార్వతీపురం, సాలూరు, బొబ్బిలి, గజపతినగరం, పాలకొండ, రాజాం, ఇచ్చాపురం, తదితర ప్రాంతాలకు వెళ్లడానికి అనకాపల్లి నుంచి నేరుగా బస్సు సదుపాయం లేదు. ఇక్కడి నుంచి విశాఖపట్నం వెళ్లి, అక్కడి నుంచి అందుబాటలో వున్న ఎక్స్‌ప్రెస్ బస్సులను ఆశ్రయించాలి.
కాగా ఇతర జిల్లాలు/ డిపోలకు చెందిన ఎక్స్‌ప్రెస్ సర్వీసుల్లో అత్యధిక శాతం జాతీయ రహదారి మీదుగా రాకపోకలు సాగిస్తున్నాయే తప్ప అనకాపల్లి కాంప్లెక్స్‌లోకి రావడంలేదు. దూర ప్రాంతాలకు ప్రయాణించాలంటే జాతీయ రహదారిలోని పూడిమడక జంక్షన్‌కు వెళ్లి ఎక్స్‌ప్రెస్ బస్సులు ఎక్కాలి. పట్టణంలో నుంచి పూడిమడక జంక్షన్‌కు రాకపోకలకు పగటిపూట ఇబ్బంది లేకనప్పటికీ, రాత్రిపూట ఇక్కడ బస్సు దిగిన ప్రయాణికులు ఇంటికి చేరుకోవడానికి ఇబ్బంది పడాల్సి వస్తున్నది. ఇక కాకినాడ, అమలాపురం, భీమవరం, ఏలూరు, విజయవాడ, ఆపై ప్రాంతాలకు అనకాపల్లి మీదుగా (పూడిమడక హైవే జంక్షన్) రాకపోకలు సాగించే ఎక్స్‌ప్రెస్ సర్వీసులు లేవు. ఈ ప్రాంతాలకు మహిళలు ప్రయాణించాలంటే హైవే జంక్షన్‌కు వెళ్లి ఇతర ఉన్నతశ్రేణి బస్సుల్లో పూర్తి చార్జీ చెల్లించాల్సిందే. ఇతర డిపోల నుంచి దూర ప్రాంతాలకు రాకపోకలు సాగించే ఎక్స్‌ప్రెస్ సర్వీసుల్లో కొన్ని అయినా అనకాపల్లి ఆర్టీసీ కాంప్లెక్స్‌లోకి వచ్చే విధంగా అధికారులు చర్యలు తీసుకుంటే ఉచిత ప్రయాణ సదుపాయాన్ని మహిళలు పూర్తిస్థాయిలో వినియోగించుకునే వీలుంటుంది.