Share News

కంకరరాళ్ల కింద సమాధి అయిన కూలీ

ABN , Publish Date - Jun 08 , 2025 | 12:45 AM

అలసిపోయి కంకరరాళ్లపై నిద్రించిన ఓ కూలీ ఆ రాళ్ల కిందనే సమాధి అయ్యాడు. మూడు రోజుల ఆలస్యంగా వెలుగు చూసిన ఈ దుర్ఘటన మండలంలోని ముదపాక జగనన్న లేఅవుట్‌ వద్ద చోటుచేసుకుంది.

కంకరరాళ్ల కింద సమాధి అయిన కూలీ
7 పెన్‌2 మృతుడు సూరన్నదొర (ఫైల్‌)

మూడు రోజులు ఆలస్యంగా వెలుగులోకి..

పెందుర్తి, జూన్‌ 7 (ఆంరఽధజ్యోతి): అలసిపోయి కంకరరాళ్లపై నిద్రించిన ఓ కూలీ ఆ రాళ్ల కిందనే సమాధి అయ్యాడు. మూడు రోజుల ఆలస్యంగా వెలుగు చూసిన ఈ దుర్ఘటన మండలంలోని ముదపాక జగనన్న లేఅవుట్‌ వద్ద చోటుచేసుకుంది. వివరాలిలా ఉన్నాయి. విజయనగరం జిల్లా తెర్లాం మండలం నందబలక గ్రామానికి చెందిన పక్కి సూరన్నదొర (57) కొంతకాలంగా ముదపాకలోని జగనన్న లేఅవుట్‌ వద్ద దినసర కూలీగా పనిచేస్తున్నాడు. ఈ నెల 4న పనులు పూర్తయ్యాక అలిసిపోవడంతో తమకు కేటాయించిన షెడ్డు వద్దకు వెళ్లకుండా సమీపంలోని కంకరరాళ్ల కుప్పపై నిద్రపోయాడు. అదేరోజు రాత్రి కంకరరాళ్ల (బ్లాక్‌ మెటల్‌) లోడు వచ్చింది. అక్కడ నిద్రిస్తున్న కూలీని చూడకుండా డ్రైవర్‌ యథావిధిగా టిప్పర్‌తో కంకరరాళ్లను డంప్‌ చేసి వెళ్లిపోయాడు. కంకరరాళ్లు మీద పడడంతో ఆ కుప్ప కింద ఆయన కురుకుపోయాడు. రాత్రయినా సూరన్నదొర రాకపోవడంతో సహచరులు ఆందోళన చెందారు. ఈ క్రమంలో శనివారం కంకరరాళ్ల కుప్ప వద్ద దుర్వాసన రావడం... అక్కడకు కుక్కలు చేరడంతో కార్మికులు అనుమానంతో పరిశీలించారు. రాళ్ల కుప్ప మధ్యలో చెయ్యి కనిపించడంతో వారు పోలీసులకు సమాచారం అందించారు. సీఐ కేవీ సతీశ్‌కుమార్‌ ఘటనా స్థలికి చేరుకుని, క్లూస్‌ టీమ్‌ని రప్పించి ఆఽధారాలు సేకరించారు. మృతుడు సూరన్నదొరగా గుర్తించి కుటుంబ సభ్యులకు సమాచారం అందించారు. కాంట్రాక్టరు నిర్లక్ష్యంతోనే సూరన్నదొర మృతి చెందాడని సహచర కూలీలు ఆరోపిస్తున్నారు. మృతుడి కుటుంబానికి నష్టపరిహారం చెల్లించాలని వారు డిమాండ్‌ చేస్తున్నారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం కేజీహెచ్‌కు తరలించి, కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్టు సీఐ తెలిపారు. ప్రమాదానికి కారణమైన లారీ డ్రైవర్‌ పరారీలో ఉండడంతో ఆయన కోసం గాలిస్తున్నామన్నారు. సూరన్నదొరకు భార్య గంగమ్మ ఉన్నారు. వీరి కుమారుడు ఏడాది కిందట జరిగిన రైలు ప్రమాదంలో మృతి చెందాడు.

Updated Date - Jun 08 , 2025 | 12:46 AM