ఐసీడీఎస్‌కు కేపీఎల్ లక్ష్యాలు
ABN , Publish Date - Aug 25 , 2025 | 12:34 AM
అంగన్‌వాడీ కేంద్రాల్లో గర్భిణులు, బాలింతలు, చిన్నపిల్లకు పౌష్టిహారం అందించడానికి ప్రభుత్వం ప్రత్యేక ఉత్తర్వులు జారీ చేసింది స్వర్ణాంధ్ర-2047లో భాగంగా ప్రభుత్వం ఐసీడీఎస్‌కి ఏడు కేపీఎల్ (కీ పెర్ఫామెన్స్ ఇండికేటర్) పెట్టడం ద్వారా 2025-26 సంవత్సరానికి కీలక పనితీరు లక్ష్యాలను నిర్దేశించింది. గర్భిణులు, బాలింతలతోపాటు వయస్సుకితగ్గ బరువు, ఎత్తు లేని పిల్లలకు నూరు శాతం పౌష్టిహారం అందించాలని ఆదేశించింది. జిల్లాలో 1,908 అంగన్‌వాడీ కేంద్రాలు ఉన్నాయి.
అంగన్‌వాడీ కేంద్రాల్లో పౌష్టికాహారానికి పెద్దపీట
తక్కువ బరువు, వయస్సుకి తగ్గ ఎత్తు లేని పిల్లలు రెండు శాతం తగ్గించాలని లక్ష్యం
నర్సీపట్నం, ఆగస్టు 24 (ఆంధ్రజ్యోతి): అంగన్‌వాడీ కేంద్రాల్లో గర్భిణులు, బాలింతలు, చిన్నపిల్లకు పౌష్టిహారం అందించడానికి ప్రభుత్వం ప్రత్యేక ఉత్తర్వులు జారీ చేసింది స్వర్ణాంధ్ర-2047లో భాగంగా ప్రభుత్వం ఐసీడీఎస్‌కి ఏడు కేపీఎల్ (కీ పెర్ఫామెన్స్ ఇండికేటర్) పెట్టడం ద్వారా 2025-26 సంవత్సరానికి కీలక పనితీరు లక్ష్యాలను నిర్దేశించింది. గర్భిణులు, బాలింతలతోపాటు వయస్సుకితగ్గ బరువు, ఎత్తు లేని పిల్లలకు నూరు శాతం పౌష్టిహారం అందించాలని ఆదేశించింది. జిల్లాలో 1,908 అంగన్‌వాడీ కేంద్రాలు ఉన్నాయి. ప్రస్తుతం వీటిద్వారా 8,240 మంది గర్భిణులు, 7,051 మంది బాలింతలు, ఏడు నెలల నుంచి మూడు సంత్సరాలలోపు చిన్నారులు 42,430 మంది, మూడు నుంచి ఐదు సంవత్సరాలలోపు పిల్లలు 15,896 మంది పౌష్టికాహారాన్ని పొందుతున్నారు. గర్భిణులు, బాలింతల రేషన్ సరుకులను ఇళ్లకు తీసుకెళ్లవచ్చు. వీరికి ప్రతి నెలా మూడు కిలోల బియ్యం, కిలో కందిపప్పు, అర లీటరు వంటనూనె, 25 కోడిగడ్లు సరఫరా చేస్తారు. ఇక రాష్ట్ర బడ్జెట్ నుంచి బాలసంజీవని, ఐదు లీటర్లు పాలు, నూట్రిషన్ కిట్, ఒక కిలో అటుకులు, రెండు కిలోలు రాగి పిండి, 250 గ్రాముల బెల్లం, వేరుశనగ చిక్కీలు, 250 గ్రాముల ఎండు ఖర్జూరం అందజేయాలి. ఆరు నెలల నుంచి మూడు సంవత్సరాలు చిన్నారులకు బాలామృతం, 30 గుడ్లు, 2.5 లీటర్ల పాలు ఇవ్వాలి. మూడు నుంచి ఐదు సంవత్సరాల పిల్లలకు అంగన్‌వాడీ కేంద్రాల్లో రోజువారీ పెట్టే ఆహారంలో 75 గ్రాముల బియ్యం, 15 గ్రాముల కంది పప్పు, ఐదు మిల్లీలీటర్ల మంచినూనె, కోడి గుడ్డు వుండాలి. రోజూ 100 మిల్లీలీటర్ల పాలు ఇవ్వాలి. కాగా జిల్లాలోని ఐసీడీఎస్‌ల పరిధిలో ఉన్న పిల్లల్లో బరువు తక్కువ ఉన్న వారు 18.29 శాతం మంది, వయస్సుకి తగ్గ ఎత్తు లేని పిల్లలు 7.8 శాతం వున్నట్టు అధికారులు గుర్తించారు. పౌష్టికాహారం అందించడం ద్వారా ఈ ఏడాది తక్కువ బరువు, తక్కువ ఎత్తు ఉన్న పిల్లలను రెండు శాతం చొప్పున తగ్గించాలని ప్రభుత్వం లక్ష్యంగా పెట్టింది.
కేపీఎల్ లక్ష్యాలు ఇవే
గర్భిణులు, బాలింతలకు వంద శాతం టీహెచ్‌ఆర్ ఇవ్వాలి
ఏడు నెలల నుంచి మూడు సంవత్సరాల లోపు పిల్లలకు వంద శాతం టీహెచ్‌ఆర్ ఇవ్వాలి
వయసుకి తగ్గ ఎత్తు లేని పిల్లలను రెండు శాతం తగ్గించాలి
వయసుకి తగ్గ బరువు లేని పిల్లలను రెండు శాతం తగ్గించాలి
ప్రీ స్కూల్ పిల్లలు నెలలో కనీసం 21 రోజులు హాజరవ్వాలి
బాల్య వివాహాలను నిరోధించాలి