కొండారెడ్డి కాల్‌డేటా సేకరణ
ABN , Publish Date - Nov 05 , 2025 | 01:04 AM
డ్రగ్స్ వ్యవహారం వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీలో గుబులు రేపుతోంది. ఇప్పటికే ఈ కేసులో ఆ పార్టీ విద్యార్థి విభాగం నేత పులగం కొండారెడ్డిని నాలుగో పట్టణ పోలీసులు అరెస్టు చేసిన విషయం తెలిసిందే.
ఆ సమాచారాన్ని విశ్లేషించిన తరువాత కస్టడీకి తీసుకోవాలని భావిస్తున్న పోలీసులు
డ్రగ్స్ కేసులో దర్యాప్తు ముమ్మరం
పద్మనాభం రిసార్ట్స్‌లో పార్టీపై ఆరా
వైసీపీ నేతల్లో గుబులు
ఏ క్షణంలో తమను పోలీసులు
పిలుస్తారోనని ఆందోళన
(విశాఖపట్నం-ఆంధ్రజ్యోతి)
డ్రగ్స్ వ్యవహారం వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీలో గుబులు రేపుతోంది. ఇప్పటికే ఈ కేసులో ఆ పార్టీ విద్యార్థి విభాగం నేత పులగం కొండారెడ్డిని నాలుగో పట్టణ పోలీసులు అరెస్టు చేసిన విషయం తెలిసిందే. కొండారెడ్డి చాలాకాలంగా డ్రగ్స్‌ను దిగుమతి చేసుకుంటూ, పలువురికి సరఫరా చేసినట్టు పోలీసుల ప్రాథమిక దర్యాప్తులో తేలింది. కొండారెడ్డి ఎన్నిసార్లు డ్రగ్స్ తెచ్చాడు, ఎవరెవరికి అందజేశాడు, అతనితో తరచూ కాంటాక్టులో ఉన్న వారెవరనే దానిపై పోలీసులు దృష్టిసారించారు. కొండారెడ్డి కాల్‌డేటా తెప్పించుకుంటామని, కస్టడీకి తీసుకుని పూర్తిస్థాయిలో విచారిస్తామని డీసీపీ ప్రకటించడంతో ఏ క్షణంలో పోలీసుల నుంచి పిలుపు వస్తుందోనని ఆ పార్టీలో కొందరు ఆందోళన చెందుతున్నట్టు తెలిసింది.
కొండారెడ్డి ఎంబీఏ చదువుతున్నప్పటికీ వైసీపీలో కొందరు ముఖ్య నేతలకు సన్నిహితంగా ఉంటూ పార్టీ విద్యార్థి విభాగం అధ్యక్షుడు పదవి దక్కించుకున్నాడు. జిల్లాకు చెందిన నేత ఒకరు ...కొండారెడ్డితో రూ.మూడు లక్షలు షాపింగ్ చేయించుకుని, ఆ తర్వాత అతడి పేరును పదవికి ప్రతిపాదించారని చెబుతున్నారు. అప్పటి నుంచి సదరు నేతతో కొండారెడ్డి సన్నిహితంగా ఉంటుండడంతో డ్రగ్స్ అంశంలో ఆయన పాత్రపైనా ఊహాగానాలు వ్యక్తమవుతున్నాయి. మరో వైపు కొండారెడ్డి నగరానికి చెందిన ఉత్తరాంధ్ర యువజన విభాగం పదవిలో ఉన్న నేతతోనూ సన్నిహిత సంబంధాలు కలిగివున్నట్టు పార్టీ నేతలు చెబుతున్నారు. ఆ నేత ఈ ఏడాది జూన్‌లో పద్మనాభం వద్ద ఒక రిసార్టులో నైట్ పార్టీ ఏర్పాటుచేశారని, అక్కడ అర్ధరాత్రి దాటిన తరువాత డ్రగ్స్ వాడినట్టు చెబుతున్నారు. కొండారెడ్డి పుట్టినరోజు కూడా వచ్చే నెలలో ఉందని, యువజననేత ఏర్పాటుచేసిన స్థాయిలోనే పార్టీ ఇచ్చేందుకు ఏర్పాట్లు చేసుకుంటున్నాడని, అందుకోసమే భారీగా డ్రగ్స్‌ను తెప్పించినట్టున్నాడని ఆ పార్టీ నేతలు చెబుతున్నారు. కొండారెడ్డితోపాటు పద్మనాభం వద్ద రిసార్టులో పార్టీ ఇచ్చినట్టు అనుమానిస్తున్న నేత కాల్‌డేటా ఆధారంగా వారితో సంబంధాలు కలిగి వున్న నేతలు, అనుమానితులను గుర్తించేపనిలో పోలీసులు ఉన్నారు. కాల్‌డేటా వచ్చిన తర్వాత వాటిని విశ్లేషించి అనుమానితుల జాబితాను తయారుచేసిన తర్వాత కొండారెడ్డి, గీత్‌చరణ్, హర్షవర్దన్‌నాయుడును కస్టడీకి తీసుకోవాలని భావిస్తున్నారు. కాల్‌డేటాలోని వివరాలు, కస్టడీలో వారిచ్చే సమాధానాలు, వివరణ ఆధారంగా డ్రగ్స్ వినియోగం, విక్రయంతో సంబంధాలు కలిగివున్నట్టు భావించే వారిని విచారించాలని నిర్ణయించారు. దీంతో కొండారెడ్డి, ఉత్తరాంధ్ర యువజన విభాగంలో ముఖ్య పదవిలో ఉన్న నేతతో సంబంధాలు కలిగివున్న నేతల్లో ఆందోళన మొదలైంది. ఈ సమస్యను ఎలా ఎదుర్కొనవచ్చుననే దానిపై న్యాయవాదులతో చర్చిస్తున్నట్టు తెలిసింది.