కోడూరు ఎంఎస్‌ఎంఈలో ఆరు నెలల్లో ఉత్పత్తులు
ABN , Publish Date - Jun 07 , 2025 | 12:39 AM
పారిశ్రామిక పార్కులో స్థలాలు పొందిన వారు వెంటనే యూనిట్ల ఏర్పాటు పనులు మొదలు పెట్టి ఆరు నెలల్లో ఉత్పత్తిని ప్రారంభించాలని కలెక్టర్ విజయకృష్ణన్ పేర్కొన్నారు. మండలంలోని కోడూరులో రూ.59.47 కోట్లతో ఏర్పాటు చేసిన ఎంఎస్‌ఎంఈ పార్కును ఎమ్మెల్యే కొణతాల రామకృష్ణతో కలిసి శుక్రవారం సాయంత్రం ప్రారంభించారు.
ఔత్సాహికులకు కలెక్టర్ విజయకృష్ణన్ ఆదేశం
ఎమ్మెల్యే కొణతాలతో కలిసి పార్కు ప్రారంభం
అనకాపల్లి రూరల్, జూన్ 6 (ఆంధ్రజ్యోతి): పారిశ్రామిక పార్కులో స్థలాలు పొందిన వారు వెంటనే యూనిట్ల ఏర్పాటు పనులు మొదలు పెట్టి ఆరు నెలల్లో ఉత్పత్తిని ప్రారంభించాలని కలెక్టర్ విజయకృష్ణన్ పేర్కొన్నారు. మండలంలోని కోడూరులో రూ.59.47 కోట్లతో ఏర్పాటు చేసిన ఎంఎస్‌ఎంఈ పార్కును ఎమ్మెల్యే కొణతాల రామకృష్ణతో కలిసి శుక్రవారం సాయంత్రం ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ, ఈ పార్కులో యూనిట్ల ఏర్పాటు కోసం దరఖాస్తు చేసుకున్న వారిలో 171 మందికి అనుమతులు మంజూరు చేసినట్టు చెప్పారు. చిన్న పరిశ్రమల ద్వారానే ఎక్కువ మందికి ఉపాధి కల్పించడానికి అవకాశం వుంటుందన్న ఉద్దేశంతోనే ప్రభుత్వం ఎంఎస్‌ఎంఈ పార్కులను ఏర్పాటు చేస్తున్నదని కలెక్టర్ తెలిపారు. కోడూరు పార్కులోని యూనిట్లలో చుట్టుపక్కల గ్రామాల్లో ప్రతి కుటుంబం నుంచి ఒకరికి ఉపాధి కల్పించేలా చూడాలని ఔత్సాహికులను కోరారు. ఎమ్మెల్యే కొణతాల రామకృష్ణ మాట్లాడుతూ, రాష్ట్ర ప్రభుత్వం ప్రతి అసెంబ్లీ నియోజకవర్గంలో ఒక ఎంఎస్‌ఎంఈ పార్కును ఏర్పాటు చేస్తున్నదని, ఇందులో భాగంగా అనకాపల్లి నియోజకవర్గానికి సంబంధించి కోడూరులో ఎంఎస్‌ఎంఈ పార్కును ఏర్పాటు చేశామన్నారు. ఇక్కడ ఏర్పాటు చేసే పరిశ్రమల్లో స్థానికులకు ఉపాధి కల్పించడానికి ప్రాధాన్యం ఇవ్వాలని సూచించారు. పారిశ్రామిక రంగంలో 70 శాతం ఉద్యోగాలు చిన్న పరిశ్రమలే కల్పిస్తున్నట్టు ఆయన తెలిపారు. ఈ కార్యక్రమంలో ఆర్డీవో షేక్ ఆయీషా, ఏపీఐఐసీ జోనల్ మేనేజర్ ఎస్.నరసింహారావు, తహసీల్దార్ బి.విజయ్‌కుమార్, పలువురు ఔత్సాహిక పారిశ్రామికవేత్తలు పాల్గొన్నారు.