Share News

ఆర్‌ఈసీఎస్‌పై విచారణకు మోకాలడ్డు?

ABN , Publish Date - Aug 20 , 2025 | 01:16 AM

అనకాపల్లి గ్రామీణ విద్యుత్‌ సరఫరా సంఘం (ఆర్‌ఈసీఎస్‌)లో అక్రమాలపై విచారణ ముందుకు సాగకుండా విజయవాడలోని ఓ ఉన్నతాధికారి అడ్డుకుంటున్నారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. ప్రస్తుతం సహకార శాఖలో పనిచేస్తున్న ఆయన...గతంలో ఆర్‌ఈసీఎస్‌కు కొన్నాళ్లు పర్సన్‌ ఇన్‌చార్జిగా పనిచేశారు. ఆ సమయంలో చేతివాటం ప్రదర్శించారనే ఫిర్యాదులు ఉన్నాయి. హుద్‌హుద్‌ సమయంలో ఆయన ఇక్కడే ఉన్నారు. తుఫాన్‌ గాలులకు విద్యుత్‌ వ్యవస్థ సమూలంగా నాశనం కావడంతో స్తంభాలు, ట్రాన్స్‌ఫార్మర్లు, కండక్టర్‌ వైర్లు వంటివి పెద్ద మొత్తంలో కొనుగోలు చేయాల్సి వచ్చింది.

ఆర్‌ఈసీఎస్‌పై  విచారణకు మోకాలడ్డు?

ఇక్కడ కొందరు ఉద్యోగులు చేస్తున్న ప్రయత్నాలకు

విజయవాడ అధికారి సహాయ సహకారాలు

అనకాపల్లి గ్రామీణ విద్యుత్‌ సరఫరా సంఘానికి

గతంలో పర్సన్‌ ఇన్‌చార్జిగా పనిచేసిన సదరు అధికారి

ఆయన హయాంలోనే అనేక అవకతవకలు చోటుచేసుకున్నట్టు ఆరోపణలు

అవన్నీ బయటపడతాయనే విచారణను అడ్డుకునేందుకు యత్నం

(విశాఖపట్నం-ఆంధ్రజ్యోతి)

అనకాపల్లి గ్రామీణ విద్యుత్‌ సరఫరా సంఘం (ఆర్‌ఈసీఎస్‌)లో అక్రమాలపై విచారణ ముందుకు సాగకుండా విజయవాడలోని ఓ ఉన్నతాధికారి అడ్డుకుంటున్నారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. ప్రస్తుతం సహకార శాఖలో పనిచేస్తున్న ఆయన...గతంలో ఆర్‌ఈసీఎస్‌కు కొన్నాళ్లు పర్సన్‌ ఇన్‌చార్జిగా పనిచేశారు. ఆ సమయంలో చేతివాటం ప్రదర్శించారనే ఫిర్యాదులు ఉన్నాయి. హుద్‌హుద్‌ సమయంలో ఆయన ఇక్కడే ఉన్నారు. తుఫాన్‌ గాలులకు విద్యుత్‌ వ్యవస్థ సమూలంగా నాశనం కావడంతో స్తంభాలు, ట్రాన్స్‌ఫార్మర్లు, కండక్టర్‌ వైర్లు వంటివి పెద్ద మొత్తంలో కొనుగోలు చేయాల్సి వచ్చింది. ఆర్‌ఈసీఎస్‌లో విద్యుత్‌ పరికరాల కొనుగోళ్లకు ఎటువంటి టెండర్‌ల విధానం పాటించడం లేదు. ఐదు లక్షల రూపాయలు, అంతకంటే ఎక్కువ మొత్తం అయితే టెండర్‌ పిలవాలి. కానీ ఆ నిబంధనను తుంగలో తొక్కి నామినేషన్‌ పద్ధతిపైనే నచ్చిన వారితో కొనిపిస్తూ వచ్చారు. ఈ క్రమంలో ఆయన అస్మదీయ సంస్థల నుంచి కోట్ల రూపాయల పరికరాలు కొనుగోలు చేయించారు. ఆర్‌ఈసీఎస్‌లో నిధుల స్వాహాకు అధికారులు కొన్ని అడ్డగోలు పనులుచేసేవారు. కోటి రూపాయల పరికరాలు అవసరమైతే రెండు కోట్ల రూపాయలు అవసరమని ఫైల్‌ పెట్టి, డబ్బులు మంజూరు చేసేవారు. సరకు మాత్రం కోటి రూపాయలకే వచ్చేది. బిల్లు రెండు కోట్లు చెల్లించినట్టు చూపించేవారు. ఆ అదనపు కోటి రూపాయలు అధికారులు, సిబ్బంది దిగమింగేవారు. ఇప్పుడు ఆర్‌ఈసీఎస్‌లో జరుగుతున్న విచారణలో ఆ బాగోతాలు బయటకు వస్తాయన్న భయంతో దర్యాప్తు ముందుకు సాగకకుండా సదరు అధికారి అడ్డం పడుతున్నారు. కేసును నీరు గార్చేందుకు యత్నిస్తున్న వర్గానికి తనవంతు సహాయ సహకారాలు అందిస్తున్నారు.

మాజీ ఎండీదీ అదే తీరు

ఆర్‌ఈసీఎస్‌ పనితీరు బాగా లేదని, ప్రభుత్వం లైసెన్స్‌ ఇవ్వలేదని పేర్కొంటూ సంస్థను ఈపీడీసీఎల్‌కు అప్పగించాలని ఏపీ విద్యుత్‌ నియంత్రణ మండలి (ఈఆర్‌సీ) 2021 మార్చిలో ఆదేశించింది. ఆ ఉత్తర్వును పక్కనపెట్టి అప్పటి ఎండీ రామకృష్ణంరాజు ఆరు నెలలు ఆర్‌ఈసీఎస్‌ను సహకార రంగంలోనే నడిపించారు. సర్వసభ్య సమావేశం పెట్టకుండా, ప్రభుత్వ అనుమతి లేకుండా కోట్ల రూపాయల విద్యుత్‌ పరికరాలు కొనుగోలు చేశారు. అడ్డగోలుగా పలువురికి ఉద్యోగ అవకాశాలు కల్పించారు. వాటిపై ఫిర్యాదులు అందడంతో ఈఆర్‌సీ చైర్మన్‌ తక్షణమే తమ ముందు హాజరై వివరాలు సమర్పించాలని ఎండీని ఆదేశించడంతో ఉద్యోగం పోతుందనే భయంతో చేసింది తప్పేనని ఒప్పుకొని ఆర్‌ఈసీఎస్‌ను 2021 సెప్టెంబరులో ఈపీడీసీఎల్‌కు అప్పగించారు. ఆ తరువాత వాటన్నింటిపై విచారణ చేయాలని సహకార శాఖకు చెందిన అధికారిణి శ్యామలను ఉన్నతాధికారులు ఆదేశిస్తే, ఎటువంటి తప్పులు జరగలేదని ఆమె నివేదిక ఇచ్చారు. ఇప్పుడు 51 విచారణ జరుగుతోంది. మరోవైపు ఈపీడీసీఎల్‌ అధికారులు సిబ్బంది సర్వీసు రిజిస్టర్లన్నీ తిరగేస్తున్నారు. అనర్హుల ఏరివేతకు శ్రీకారం చుట్టారు. ఈ నేపథ్యంలో ఇవి ముందుకు సాగకుండా ఉండేందుకు ఉద్యోగులు కొందరు వినియోగదారుల పేరిట హైకోర్టును ఆశ్రయించి స్టే తేవాలని ప్రయత్నించారు. అటువంటి చర్యలు తగవని, వారిపై చర్యలకు ఆదేశించాల్సిన విజయవాడ అధికారి ఏమీ తెలియనట్టు, సమాచారం లేదని మిన్నకుండిపోయారు. ఇక్కడ అనకాపల్లి జిల్లా అధికారులు కూడా చర్యలకు తాత్సారం చేస్తున్నారు.

Updated Date - Aug 20 , 2025 | 01:16 AM