నగరంలో కిడ్నీ రాకెట్?
ABN , Publish Date - Jul 16 , 2025 | 01:24 AM
‘ఏదైనా కేసుని ఛేదించినా, నేరం జరగకుండా ముందుగా అడ్డుకున్నా, నేరస్థులను అదుపులోకి తీసుకున్నా...పోలీసులు వెంటనే వివరాలను ఉన్నతాధికారులకు చేరవేస్తారు.
కిడ్నీ విక్రయించేందుకు గత నెల 30న ఏలూరు జిల్లా నుంచి నగరానికి వచ్చిన ఇద్దరు...
అక్కయ్యపాలెంలోని హోటల్‌లో దిగి వైద్యుడితో ఫోన్‌లో మంతనాలు
ఫోర్త్ టౌన్ స్టేషన్‌కు హోటల్ సిబ్బంది సమాచారం
ఇద్దరినీ తీసుకువెళ్లిన పోలీసులు
గుట్టుగా ఉంచడంతో సీపీకి చేరిన సమాచారం
15 రోజుల తర్వాత రాత్రివేళ మీడియాకు వాట్సాప్ మెసేజ్ ద్వారా సమాచారం ఇచ్చిన వైనం
ఈ ఉదంతంలో పెద్దఎత్తున డబ్బు చేతులు మారిందనే ఆరోపణలు
అలాంటిదేమీ లేదని ఖండిస్తున్న సీఐ
(విశాఖపట్నం-ఆంధ్రజ్యోతి)
‘ఏదైనా కేసుని ఛేదించినా, నేరం జరగకుండా ముందుగా అడ్డుకున్నా, నేరస్థులను అదుపులోకి తీసుకున్నా...పోలీసులు వెంటనే వివరాలను ఉన్నతాధికారులకు చేరవేస్తారు. ఒకటి, రెండు రోజుల తర్వాత మీడియాకు వెల్లడించడం పరిపాటి. కానీ ఆర్థిక ఇబ్బందుల కారణంగా కిడ్నీ విక్రయించేందుకు సిద్ధపడిన ఒక వ్యక్తితోపాటు అతని స్నేహితుడిని అదుపులోకి తీసుకుని విచారించిన పోలీసులు 15 రోజుల తర్వాత ఆ వివరాలను వెల్లడించారు. అది కూడా వాట్సాప్‌లో చిన్న మెసేజ్ పెట్టి చేతులు దులిపేసుకున్నారు. ఫోర్త్‌టౌన్ స్టేషన్ పరిధిలో జరిగిన ఈ ఘటన ప్రస్తుతం నగర పోలీస్ శాఖలో హాట్‌టాపిక్‌గా మారింది.
ఏలూరు జిల్లా జిల్లా కలిదిండి మండలం గురయ్యపాలేనికి చెందిన కట్టా రంగబాబు (36), చిల్లుముంత ఏసురాజు (30) స్నేహితులు. రంగబాబు తాను వ్యాన్ కొనాలనుకుంటున్నానని, విశాఖలో ఒక వ్యాన్ ఉన్నందున చూసి వద్దామంటూ స్నేహితుడైన ఏసురాజును తీసుకుని గత నెల 30న విశాఖ వచ్చాడు. అక్కయ్యపాలెం జాతీయ రహదారి సమీపంలో ఉన్న ఒక హోటల్‌కు వెళ్లారు. అక్కడ రంగబాబు ఎవరితోనో మాట్లాడుతూ తన కిడ్నీని విక్రయించేందుకు బేరమాడుతుండడంతో ఏసురాజు షాక్‌కు గురయ్యాడు. వ్యాన్ కొనడానికి అనిచెప్పి తీసుకొచ్చి కిడ్నీ అమ్మేస్తానంటున్నావేమిటని రంగబాబును ఏసురాజు ప్రశ్నించగా, తనకు ఆర్థిక ఇబ్బందులు ఉన్నందున కిడ్నీ అమ్మేయాలనుకుంటున్నానని చెప్పాడు. దీంతో రంగబాబు భార్యకు ఏసురాజు ఫోన్ చేసి సంగతి చెప్పడంతో ఆమె తన భర్తను మందలించి ఇంటికి రావాలని చెప్పింది. ఈ తతంగాన్ని చూసిన హోటల్ సిబ్బంది ఫోర్త్ టౌన్ పోలీసులకు సమాచారం ఇవ్వగా, వారు వచ్చి ఇద్దరినీ స్టేషన్‌కు తీసుకువెళ్లి కిడ్నీలు విక్రయించడం నేరమని మందలించి వారి నుంచి వాంగ్మూలం తీసుకుని పంపించేశారు. ఇదంతా గత నెల 30న జరిగితే ఫోర్త్ టౌన్ పోలీసులు మాత్రం ఈనెల 13న జరిగినట్టు పేర్కొంటూ వాట్సాప్‌లో ఒక చిన్న మెసేజ్ పెట్టడం అనుమానాలకు దారితీసింది.
ఇదిలావుంటే ఈ వ్యవహారంలో ఫోర్త్ టౌన్‌లోని కొందరు పోలీసులు పెద్ద తతంగమే నడిపారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. గత నెల 30న ఇద్దరు వ్యక్తులు కిడ్నీ విక్రయించేందుకు వచ్చి ఎవరితోనూ సంప్రతింపులు జరుపుతున్నారంటూ ఫోర్త్ టౌన్‌లో పనిచేస్తున్న ఒకరికి హోటల్ సిబ్బంది నుంచి సమాచారం వచ్చింది. సమాచారం అందుకున్న వ్యక్తి విషయాన్ని ఒక ఎస్‌ఐకు తెలియపరిచారు. సదరు ఎస్‌ఐ స్టేషన్‌లో కీలక విధులు నిర్వర్తిస్తున్న ఒకరిని పిలిచి తక్షణం జీపులో ఆ హోటల్‌కు వెళ్లి ఆ ఇద్దరినీ స్టేషన్‌కు తీసుకురావాలని ఆదేశించారు. ఎస్‌ఐ ఆదేశాల మేరకు హోటల్‌కు వెళ్లి ఇద్దరు వ్యక్తులను తీసుకువచ్చిన స్టేషన్‌లోని కీలక విధులు నిర్వర్తించే ఒకరు విషయాన్ని స్టేషన్‌లోని పనిచేస్తున్న ఒక అధికారికి తెలియజేశారు. వారిద్దరూ కలిసి హోటల్‌లో కిడ్నీలు విక్రయం గురించి చర్చించుకున్న ఇద్దరిని విచారించారు. తనకు ఫేస్‌బుక్‌లో విశాఖకు చెందిన ఒక వైద్యుడితో పరిచయం ఏర్పడిందని రంగబాబు చెప్పినట్టు సమాచారం. తనకు ఆర్థిక ఇబ్బందులు ఉన్నాయని వైద్యుడికి చెప్పగా, కిడ్నీ విక్రయిస్తే చాలా డబ్బులు వస్తాయని అనడంతో తన స్నేహితుడికి వ్యాన్ కొనుగోలు చేయడానికి అని చెప్పి విశాఖ తీసుకువచ్చినట్టు వివరించినట్టు తెలిసింది. సదరు వైద్యుడితోపాటు కిడ్నీల విక్రయం ముఠాలో ఎవరెవరు ఉన్నారనే దానిపై పోలీసులు కూపీ లాగినట్టు సమాచారం. ఈ రాకెట్‌లో ప్రమేయం కలిగిన వారిని గుట్టుగా స్టేషన్‌కు పిలిచి వారి నుంచి భారీగా గుంజేసినట్టు ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఈ విషయం పోలీస్ శాఖలోని నిఘా విభాగంలో పనిచేస్తున్న ఒక కానిస్టేబుల్‌కు తెలిసింది. తన పైఅధికారికి సమాచారం ఇస్తే ఇందులో ప్రమేయం ఉన్న ఒకరితో సదరు అధికారికి సన్నిహిత సంబంధాలు ఉండడంతో ఉన్నతాధికారి దృష్టికి వెళ్లకుండా తొక్కిపెట్టేస్తారని భావించారు. దీంతో తమ విభాగానికి చెందిన వాట్సాప్ గ్రూప్‌లో సమాచారాన్ని పోస్ట్ చేశారు. దీంతో విషయం నేరుగా సీపీకి చేరడంతో స్టేషన్ అధికారులు ఆగమేఘాల మీద ఈనెల 13న రాత్రి తొమ్మిది గంటల సమయంలో వాట్సాప్‌లో ఒక పోస్ట్ పెట్టి సమాచారాన్ని బయటకు వెల్లడించారు. హోటల్‌లో కిడ్నీల విక్రయం గురించి ఇద్దరు మాట్లాడుకుంటున్నట్టు సిబ్బంది ఇచ్చిన సమాచారంతో వారిద్దరినీ అదుపులోకి తీసుకుని విచారించి, మందలించి పంపించేశామన్నది వాట్సాప్‌లో పెట్టిన మెసేజ్ సారాంశం. అదే నిజమైతే గత నెల 30న జరిగిన ఘటనకు 15 రోజులు ఎందుకు దాచిపెట్టారనేది అర్థం కానిప్రశ్నగా మారింది. అసలు వైద్యుడుగానీ ఎవరూలేరని, కేవలం ఇద్దరు వ్యక్తులే హోటల్‌లో ఉన్నారని చెబుతున్న పోలీసులు మంగళవారం కూడా హోటల్‌కు వెళ్లి దర్యాప్తు చేశారు. దీనిపై ఫోర్ ్తటౌన్ సీఐ సత్యనారాయణను వివరణ కోరగా ఆరోపణలను పట్టించుకోవాల్సిన అవసరం లేదన్నారు. ఈ ఉదంతంలో ఎవరినీ అరెస్టు చేయలేదని, గతంలో జరిగిన కిడ్నీ రాకెట్ కేసుల్లో నిందితులతో వీరికి ఏమైనా సంబంధాలు ఉన్నాయా?, వైద్యులు ఎవరైనా ఉన్నారా? అనేదానిపై దర్యాప్తు కొనసాగుతోందన్నారు. పట్టుబడిన వ్యక్తుల కాల్‌డేటా రాగానే వారి వెనుక ఉన్నవారి వివరాలు తెలుస్తాయని, ఈ కేసులో ఉన్నతాధికారుల పర్యవేక్షణలోనే దర్యాప్తు జరుగుతోంది కాబట్టి అవినీతి, అక్రమాలకు ఆస్కారం లేదని స్పష్టంచేశారు.