Share News

ఉత్సాహంగా ఖరీఫ్‌

ABN , Publish Date - Jul 25 , 2025 | 01:27 AM

ఖరీఫ్‌ సీజన్‌లో పంటల సాగుకు సానుకూల వాతావరణం ఏర్పడడంతో అన్నదాతలు ఆనందం చెందుతున్నారు.

ఉత్సాహంగా ఖరీఫ్‌

అవసరమైన సమయంలో సమృద్ధిగా వర్షాలు

మడుల్లో అందుబాటులోకి వస్తున్న వరి నారు

రిజర్వాయర్లలో సమృద్ధిగా నీరు

ఆయకట్టుకు విడుదల కోసం తేదీలు ఖరారుచేసిన అధికారులు

దమ్ము పనుల్లో రైతులు బిజీ

చోడవరం, జూలై 24 (ఆంధ్రజ్యోతి):

ఖరీఫ్‌ సీజన్‌లో పంటల సాగుకు సానుకూల వాతావరణం ఏర్పడడంతో అన్నదాతలు ఆనందం చెందుతున్నారు. వరి నాట్లు వేసే సమయం దగ్గర పడుతున్న తరుణంలో ఉపరితల ద్రోణి, బంగాళాఖాతంలో అల్పపీడన ప్రభావాలతో కొద్ది రోజుల నుంచి ఆశాజనకంగా వర్షాలు కురుస్తున్నాయి. ముందుగా ఆకుమడులు పోసిన పొలాల్లో వరి నారు అందుబాటులోకి రావడంతో నాట్లు వేసేందుకు దమ్ము పనులు చేస్తున్నారు. రిజర్వాయర్ల నుంచి నీటిని విడుదల చేసిన వెంటనే నాట్లు వేయడానికి సన్నద్ధం అవుతున్నారు.

ఈ ఏడాది మే నెలలో సాధారణానికి మించి వర్షాలు పడడంతో జలాశయాల్లోకి, చెరువుల్లోకిఇ బాగానే నీరు చేరింది. జూన్‌లో సాధారణ వర్షం పడడంతో రైతులు ఖరీఫ్‌ పంటల సాగుకు పొలాలను సిద్ధం చేసుకున్నారు. మెట్ట భూముల్లో అపరాలు, చిరుధాన్యాలు, నూనె గింజలపంటలు వేసుకున్నారు. పల్లం (మాగాణి) భూముల్లో వరినాట్లు వేసే సమయాలకు అనుగుణంగా జూన్‌ నెలాఖరు నుంచి ఈ నెల రెండో వారం వరకు వరి నారుమడుల్లో విత్తనాలు చల్లారు. వరి నాట్లకు అనువైన పరిస్థితులు నెలకొనడంతో ముందుగా ఆకుమడులు వేసిన అన్నదాతలు దమ్ముల్లో నిమగ్నమయ్యారు. వాస్తవానికి ఈ ఏడాది ఖరీఫ్‌ సీజన్‌లో వర్షాలు సకాలంలోనే పడినప్పటికీ, ఆకుమడులు వేసిన తరువాత, వారం రోజుల క్రితం వరకు తీవ్రమైన ఎండలతో వర్షాభావ ఛాయలు కనిపించడంతో రైతులు ఆందోళనకు గురయ్యారు. ఇటువంటి తరుణంలో ఊపరితల ఆవర్తనం, అల్పపీడనం ఏర్పడి వర్షాలు పడుతుండడంతో రైతులు ఊపిరి పీల్చుకున్నారు. వర్షాలు ఆశాజనంగా కురుస్తుండడంతో జలాశయాల్లోకి సమృద్ధిగా నీరు చేరుతున్నది. పంట పొలాలు వర్షం నీటికళతో కళకళలాడుతున్నాయి. ఈ వారంలో పెద్దేరు, రైవాడ, కోనాం రిజర్వాయర్ల నుంచి కాలువలకు నీటిని విడుదల చేయనుండడంతో వరినాట్లు వేయడానికి దమ్ముపనులు మొదలుపెట్టారు.

గత ఏడాది ఎల్‌నినో కాణంగా వర్షాభావ పరిస్థితులు నెలకొని వరినాట్లు ఆలస్యం అయ్యాయి. వ్యవసాయ శాఖ గణాంకాల ప్రకారం 53,121 హెక్టార్లలో వరినాట్లు వేశారు. ఈ ఏడాది మే నెల నుంచే వాతావరణం అనుకూలంగా వుండడంతో గత ఏడాది కన్నా ఎక్కువ విస్తీర్ణంలో వరి సాగు అవుతుందని అధికారులు అంచనా వేస్తున్నారు. ఇప్పటికే వేసిన మొక్కజొన్న, రాగి, సజ్జ, వేరుశనగ, నువ్వు, తదితర పంటలు ఆశాజనంగా వున్నాయని రైతులు చెబుతున్నారు.

Updated Date - Jul 25 , 2025 | 01:27 AM