ఖాకీ అడ్డదారి!
ABN , Publish Date - May 06 , 2025 | 01:13 AM
అతనో పోలీస్ అధికారి. మావోయిస్టులకు సంబంధించిన కీలకమైన సమాచారాన్ని సేకరించగలిగినందుకు శాఖాపరంగా ప్రత్యేక గుర్తింపు లభించింది. ప్రభుత్వం రెండు పదోన్నతులు ఇచ్చింది. అయితే మావోయిస్టుల నుంచి ముప్పు ఉందని భావించి ఆయన రక్షణకు సుమారు పది మంది గన్‌మెన్‌ను కేటాయించింది. అయితే సదరు అధికారి...వారితోనే ఇంటి పనులు (పెంపుడు కుక్కను సాకడం, ఇంటీరియర్, కార్పెంటర్ పనులు చేసేవారికి సహాయకులు ఉండడం) కూడా అప్పగిస్తున్నారనే విమర్శలు వినిపిస్తున్నాయి.
రక్షణకు కేటాయించిన గన్‌మెన్‌కు ఇంటి పనులు అప్పగింత
పెంపుడు కుక్కలను సాకేదీ వారే
పెందుర్తిలో విలాసవంతమైన భవన నిర్మాణం
చింతపల్లి మండలం అన్నవరంలో మరో నిర్మాణం
ఏసీబీకి అందిన ఫిర్యాదు
(విశాఖపట్నం-ఆంధ్రజ్యోతి)
అతనో పోలీస్ అధికారి. మావోయిస్టులకు సంబంధించిన కీలకమైన సమాచారాన్ని సేకరించగలిగినందుకు శాఖాపరంగా ప్రత్యేక గుర్తింపు లభించింది. ప్రభుత్వం రెండు పదోన్నతులు ఇచ్చింది. అయితే మావోయిస్టుల నుంచి ముప్పు ఉందని భావించి ఆయన రక్షణకు సుమారు పది మంది గన్‌మెన్‌ను కేటాయించింది. అయితే సదరు అధికారి...వారితోనే ఇంటి పనులు (పెంపుడు కుక్కను సాకడం, ఇంటీరియర్, కార్పెంటర్ పనులు చేసేవారికి సహాయకులు ఉండడం) కూడా అప్పగిస్తున్నారనే విమర్శలు వినిపిస్తున్నాయి.
పోలీస్ శాఖలో చిరుద్యోగిగా విధుల్లో చేరిన ఆయన ఉమ్మడి విశాఖ జిల్లాలోని పలు స్టేషన్లతో పాటు మావోయిస్టుల వ్యవహారాలను పర్యవేక్షించే విభాగంలో పనిచేశారు. ఆ సమయంలో మావోయిస్టులకు సంబంధించిన కీలక సమాచారాన్ని సేకరించి ఉన్నతాధికారులకు అందించారు. దీంతో ఆయనకు రెండుసార్లు యాగ్జిలరీ ప్రమోషన్లు (ప్రత్యేక పదోన్నతి) లభించి, ప్రస్తుతం ఉన్నత హోదాలో ఉన్నారు. ప్రభుత్వం అతని భద్రతకు సుమారు పది మంది గన్‌మన్‌ను కేటాయించింది. ఆ తరువాత నగర పోలీస్ కమిషనరేట్ పరిధిలో పోస్టింగ్ ఇచ్చింది. ఆ సమయంలో అనేక అవినీతి ఆరోపణలు వచ్చాయి. రికవరీల్లో కొంత ఇవ్వాలని ఎస్‌ఐలపై ఒత్తిడి చేసేవారని, స్ర్కాప్ దుకాణాల నుంచి నెలవారీ మామూళ్లు వసూలు చేయాలని ఆదేశించే వారని ఆరోపణలున్నాయి. ఇటీవల ప్రత్యేక ఇంటెలిజెన్స్ విభాగానికి బదిలీ అయ్యారు.
సొంత పనులకు గన్‌మెన్
కాగా సదరు అధికారి రక్షణ కోసం ప్రభుత్వం కేటాయించిన గన్‌మెన్‌ను వ్యక్తిగత పనులకు వినియోగిస్తున్నారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. పెందుర్తి సమీపంలో ఈ అధికారి ఓ భవనాన్ని నిర్మిస్తున్నారు. అందులో ఇంటీరియర్, కార్పెంటర్ పనులు చేస్తున్న వారికి సహాయకులుగా ఉండాలని ఇద్దరు గన్‌మెన్‌ను ఆదేశించారు. పెంపుడు కుక్కలను చూసుకునే బాధ్యత కూడా గన్‌మెన్‌లకే అప్పగించారని తెలిసింది. అల్లూరి సీతారామరాజు జిల్లా చింతపల్లి మండలం అన్నవరం వద్ద గిరిజనుడి పేరుతో ప్రైవేటు రిసార్టు నిర్మిస్తున్నారనే ఆరోపణలున్నాయి. వీటిపై కొందరు ఇటీవల ఆధారాలతో సహా ఏసీబీకి ఫిర్యాదు చేయడంతో వారు ప్రత్యేక దృష్టిసారించారని పోలీస్ శాఖలో ప్రచారం జరుగుతోంది.