Share News

ఖాకీల కలెక్షన్‌

ABN , Publish Date - May 11 , 2025 | 01:22 AM

కొంతమంది పోలీస్‌ అధికారుల తీరుతో ఆ శాఖ ప్రతిష్ఠ మసకబారుతోంది.

ఖాకీల కలెక్షన్‌

  • పోలీస్‌ స్టేషన్లలో వసూళ్ల పర్వం

  • సీపీ హెచ్చరికలు బేఖాతరు

  • మద్యం దుకాణాలు, బార్‌ల నుంచి నెలవారీలు...

  • పిటిషన్‌ వస్తే పండగే...

  • కాసులు ఎవరు ఇస్తే వారికి సపోర్టు

  • గుట్టుచప్పుడు కాకుండానే తంతంగం పూర్తి

  • మహిళా పోలీస్‌ స్టేషన్‌ ఉదంతంతో ఖాకీల అవినీతిపై చర్చ

  • చాలా పోలీస్‌ స్టేషన్లలో అదే పరిస్థితి

  • చోద్యంచూస్తున్న స్పెషల్‌ బ్రాంచి

(విశాఖపట్నం-ఆంధ్రజ్యోతి)

కొంతమంది పోలీస్‌ అధికారుల తీరుతో ఆ శాఖ ప్రతిష్ఠ మసకబారుతోంది. న్యాయం కోసం స్టేషన్‌కు వచ్చేవారికి అండగా నిలవాల్సింది పోయి...స్వప్రయోజనాలే పరమావధిగా వ్యవహరిస్తున్నారనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. కొన్ని స్టేషన్లలో అధికారులే స్వయంగా వసూళ్ల బాధ్యతను పర్యవేక్షిస్తుంటే...మరికొన్ని స్టేషన్లలో ఆ బాధ్యతను ప్రత్యేకంగా సిబ్బందికి అప్పగిస్తున్నారు.

నగర పోలీస్‌ కమిషనరేట్‌ పరిధిలో కొందరు సర్కిల్‌ ఇన్‌స్పెక్టర్లు, సబ్‌ ఇన్‌స్పెక్టర్లతోపాటు కిందిస్థాయి సిబ్బంది బరితెగించి వ్యవహరిస్తున్నారు. ఎవరైనా స్టేషన్‌కు వస్తే వారికి ఏ విధంగా న్యాయం చేయగలమనే దానిపై కాకుండా, ఆ పిటిషన్‌పై ఎలా వ్యవహరిస్తే తమకు డబ్బులు వస్తాయనే దానిపైనే దృష్టిపెడుతున్నారు. కమిషనరేట్‌లో ఒకటి, రెండు స్టేషన్లలో మినహా మిగిలినచోట్ల పెద్దఎత్తున వసూళ్ల దందా సాగుతోందని ఆ శాఖ సిబ్బందే చెబుతున్నారు. స్టేషన్‌కు వచ్చే పిటిషనర్ల పట్ల గౌరవంగా వ్యవహరించకపోయినా, న్యాయం చేయడంలో తాత్సారం చేసినా, అవినీతికి పాల్పడినా కఠిన చర్యలు తప్పవని సీపీ శంఖబ్రతబాగ్చి ఎప్పటికప్పుడు హెచ్చరిస్తూనే ఉన్నారు. మొదట్లో అందరూ ఎంతో కొంత భయంతో విధులు నిర్వర్తించినప్పటికీ కొంతకాలంగా సీపీ ఆదేశాలను బేఖాతరుచేస్తూ జేబులు నింపుకునే పనిలో నిమగ్నమయ్యారు. కొన్ని స్టేషన్లలో నేరుగా సీఐ, ఎస్‌ఐ స్థాయి అధికారులే వసూళ్ల పర్వాన్ని పర్యవేక్షిస్తుంటే, మరికొన్నిచోట్ల నమ్మకమైన ఏఎస్‌ఐ/హెడ్‌కానిస్టేబుల్‌/కానిస్టేబుల్‌కు బాధ్యతలు అప్పగిస్తున్నారు. స్టేషన్‌ పరిధిలోని మద్యం దుకాణాలు, బార్‌ల నుంచి నెలవారీ మామూళ్ల వసూలుకు రెండు నెలల కిందటే శ్రీకారం చుట్టారు. స్టేషన్‌కు వచ్చే సివిల్‌ కేసులు, కుటుంబ కలహాలు, చీటింగ్‌ కేసుల్లో బాధితులకు చేయాల్సింది పోయి, తమను ఎవరు ప్రసన్నం చేసుకుంటే వారికి మద్దతుగా వ్యవహరిస్తున్నారనే అభిప్రాయాలు సర్వత్రా వ్యక్తమవుతున్నాయి. ఇటీవల మహిళా పోలీస్‌ స్టేషన్‌లో ఒక అధికారిణి వ్యవహారశైలిపై బాధితురాలు నేరుగా సీపీకి ఫిర్యాదు చేయడంతో పోలీస్‌ శాఖలో వసూళ్ల అంశం మరోసారి చర్చకు దారితీసింది. తన భర్త కుటుంబాన్ని సక్రమంగా పట్టించుకోవడం లేదని, తనను ఇబ్బంది పెడుతున్నందున సన్మార్గంలో పెట్టేందుకు చర్యలు తీసుకోవాలని కోరుతూ ఫిర్యాదు చేస్తే, తనను విడాకులు తీసుకోవాలని సదరు అధికారిణి ఒత్తిడి చేయడంతోపాటు, ఆమె భర్త స్నేహితుడైన వ్యక్తి ద్వారా కూడా ఒత్తిడి చేయించారంటూ బాధితురాలు ఫిర్యాదు చేశారు. సీపీ స్పందించి సదరు అధికారిణి నుంచి ఆ కేసును మరొకరికి బదిలీ చేయడంతోపాటు విచారణ జరిపి తనకు అసలు విషయం తెలియజేయాలని నార్త్‌ ఏసీపీ అప్పలరాజును ఆదేశించారు. ఈస్ట్‌ సబ్‌డివిజన్‌ పరిధిలో ఉన్న ఒక స్టేషన్‌ సీఐ నైట్‌ రౌండ్స్‌ ఉన్నప్పుడు ఒక హోటల్‌లో కూర్చొని వసూళ్ల గురించి హెడ్‌కానిస్టేబుల్‌తో చర్చించుకుంటారని ఆ స్టేషన్‌ సిబ్బందే చెబుతున్నారు. స్టేషన్‌లో వసూళ్ల బాధ్యతలు చూస్తున్న సదరు హెడ్‌కానిస్టేబుల్‌ గతంలో కంచరపాలెం పోలీస్‌ స్టేషన్‌లో పనిచేసినప్పుడు కూడా ఇలాంటి ఆరోపణలే వెల్లువెత్తడంతో ఈస్ట్‌ సబ్‌డివిజన్‌కు బదిలీ చేశారు. ఎయిర్‌పోర్టుకు సమీపంలో ఉన్న ఒక స్టేషన్‌లో ఏఎస్‌ఐ ఒకరు వసూళ్ల బాధ్యతను భుజానవేసుకున్నారు. వెస్ట్‌ సబ్‌డివిజన్‌లో జాతీయ రహదారికి అనుకుని ఉన్న ఒక పోలీస్‌ స్టేషన్‌లో బ్లూకోట్స్‌ బాధ్యతలు చూస్తున్న కానిస్టేబుల్‌ వసూళ్ల బాధ్యత చూస్తున్నారు. ద్వారకా సబ్‌డివిజన్‌లోని వాణిజ్య సముదాయాలు కలిగివున్న ఒక స్టేషన్‌లో మరొక కానిస్టేబుల్‌ వసూళ్ల బాధ్యతలు చూసుకుంటున్నారని ఉన్నతాధికారులకు ఇప్పటికే ఫిర్యాదు అందినట్టు తెలిసింది. ఈ వ్యవహారాలపై సీపీ శంఖబ్రతబాగ్చికి సమాచారం అందించాల్సిన స్పెషల్‌బ్రాంచి విభాగం తన బాధ్యతలను నిర్వర్తించడంతో విఫలమవుతోందనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ప్రతి స్టేషన్‌ పరిధిలో జరిగే అన్నిరకాల వ్యవహారాలతోపాటు శాఖాపరంగా అంతర్గత వ్యవహారాలు, అవినీతిపై సమాచారం సేకరించేందుకు స్పెషల్‌బ్రాంచి విభాగం నుంచి ఒక్కో కానిస్టేబుల్‌ ఉంటారు. అయినప్పటికీ వారు కూడా స్టేషన్‌ సిబ్బందితో కుమ్మక్కు అయిపోవడం, గతంలో వారు స్టేషన్‌లో అలాంటి విధుల్లో పనిచేయడం వల్లే అవినీతి, నిర్లక్ష్యాన్ని ఉన్నతాధికారులకు చేరవేయడం లేదనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ఇప్పటికైనా సీపీ స్టేషన్లలోని అవినీతిపై దృష్టిసారించాలని నగరవాసులు కోరుతున్నారు.

మామూళ్ల వసూలు ముమ్మాటికీ వాస్తవం

మద్యం వ్యాపారుల నుంచి ఖాకీల నెలవారీ కలెక్షన్‌పై గత నెల 7న ‘ఆంధ్రజ్యోతి’ కథనం

ఇంటెలిజెన్స్‌ విచారణలో నిజమేనని తేలడంతో ప్రభుత్వానికి నివేదిక

విశాఖపట్నం, మే 10 (ఆంధ్రజ్యోతి):

నగరంలోని మద్యం దుకాణాలు, బార్‌ల నుంచి పోలీసులు నెలవారీ మామూళ్లు వసూలు చేస్తున్నట్టు నిఘా వర్గాల విచారణలో నిర్ధారణ అయినట్టు తెలిసింది. పోలీసులు తమ స్టేషన్‌ పరిధిలోని మద్యం దుకాణాల నుంచి నెలకు రూ.5,000-8,000, బార్‌ల నుంచి రూ.7,500-10,000 చొప్పున వసూలు చేస్తున్నట్టు గత నెల ఏడో తేదీన ‘ఆంధ్రజ్యోతి’ కథనం ప్రచురించిన విషయం తెలిసిందే. దీనిపై విచారణ జరపాల్సిందిగా స్పెషల్‌బ్రాంచి అధికారులను నగర పోలీస్‌ కమిషనర్‌ శంఖబ్రతబాగ్చి ఆదేశించారు. వారంతా నేరుగా మద్యం దుకాణాల వద్దకు వెళ్లి ఎవరికైనా నెలవారీ మామూళ్లు ఇస్తున్నారా?...అని ప్రశ్నించారు. పోలీసులకు ఇచ్చిన మామూళ్లు గురించి పోలీసులే అడుగుతుండడంతో తమ వ్యాపారానికి ఎక్కడ ఇబ్బంది వస్తుందోననే భయంతో చాలామంది తాము ఎవరికీ ఏమీ ఇవ్వడం లేదని చెప్పారు. మరికొందరు మాత్రం ఆ విషయం తమకు తెలియదని, వేరేవాళ్లు చూసుకుంటున్నారని చెప్పి తప్పించుకునే ప్రయత్నం చేశారు. అయితే ఇంటెలిజెన్స్‌ వర్గాలు మాత్రం దీనిపై లోతుగా విచారణ జరిపినట్టు సమాచారం. వారంతా సాధారణ వ్యక్తుల్లా మద్యం వ్యాపారులతో మాటలు కలిపి మద్యం దుకాణం/బార్‌ నిర్వహణకు సంబంధించిన సాధకబాధకలను ఆరా తీసినట్టు తెలిసింది. ఈ క్రమంలో పోలీసులకు నెలవారీ మామూళ్లు ఇవ్వాలని ఒత్తిళ్లు పెరగడంతో తప్పనిసరి పరిస్థితిలో చేయాల్సి వస్తోందని చెప్పినట్టు సమాచారం. దీంతో ఆయా వివరాలను ఉన్నతాధికారులకు చేరవేశారు. ‘ఆంధ్రజ్యోతి’లో ప్రచురితమైన కథనంలో పేర్కొన్నట్టు మద్యం వ్యాపారుల నుంచి పోలీసులు మామూళ్లు గుంజుతుండడం వాస్తవమేనని నిర్ధారించి, సమగ్ర నివేదిక తయారుచేసి ఇటీవల ప్రభుత్వానికి పంపించినట్టు తెలిసింది.

Updated Date - May 11 , 2025 | 01:22 AM