కేజీహెచ్‌కు అవినీతి జబ్బు
ABN , Publish Date - Jul 06 , 2025 | 01:08 AM
కింగ్ జార్జ్ ఆస్పత్రిలో పనిచేసిన, పనిచేస్తున్న ఉద్యోగుల నుంచి కొందరు భారీఎత్తున డబ్బుల వసూళ్లకు పాల్పడిన వ్యవహారం ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది.

రెండేళ్ల కిందట తొలగించిన రోగి మిత్రలకు మళ్లీ ఉద్యోగం
ఇస్తామంటూ డబ్బుల వసూలు
ఆస్పత్రికి చెందిన కీలక అధికారి సూచన మేరకు ఉపాధి కల్పన కార్యాలయం అధికారికి చెల్లింపు
ఆప్కోస్‌లో చేర్పిస్తామంటూ అవుట్‌సోర్సింగ్ ఉద్యోగుల వద్ద మరో అధికారి కలెక్షన్
కలెక్టర్‌కు అందిన ఫిర్యాదులు
విచారణ జరిపించాలని సూపరింటెండెంట్‌కు ఆదేశం
విశాఖపట్నం, జూలై 5 (ఆంధ్రజ్యోతి):
కింగ్ జార్జ్ ఆస్పత్రిలో పనిచేసిన, పనిచేస్తున్న ఉద్యోగుల నుంచి కొందరు భారీఎత్తున డబ్బుల వసూళ్లకు పాల్పడిన వ్యవహారం ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. రెండు కేటగిరీలకు చెందిన ఉద్యోగుల నుంచి ఆస్పత్రికి చెందిన అధికారితోపాటు మరో శాఖకు చెందిన అధికారి భారీమొత్తంలో వసూలు చేసినట్టు చెబుతున్నారు. దీనికి సంబంధించిన వివరాలు ఇలా ఉన్నాయి.
కేజీహెచ్‌లో 12 ఏళ్లుగా రోగి మిత్రలుగా పని చేస్తున్న కొందరిని రెండేళ్ల కిందట అధికారులు తొలగించారు. అలా తొలగింపునకు గురైన 20 మందిని మళ్లీ విధుల్లోకి తీసుకుంటామని ఆస్పత్రికి చెందిన ఒక అధికారి హామీ ఇచ్చారు. అయితే, అందుకు ఒక అధికారిని కలవాలని సూచించారు. సదరు ఆస్పత్రి అధికారి సూచన మేరకు ఎంప్లాయ్‌మెంట్ కార్యాలయంలో పనిచేసే ఒక అధికారిని కలిసి సమస్యను విన్నవించుకున్నారు. అయితే, ఉద్యోగాలు ఇస్తామని, అందుకు కొంత మొత్తం ఖర్చవుతుందని ఉద్యోగులకు సదరు అధికారి స్పష్టంచేశారు. ఈ మేరకు ఒక్కొక్కరూ రూ.20 వేలు చొప్పున రెండు విడతల్లో ఎంప్లాయ్‌మెంట్ కార్యాలయ అధికారికి సమర్పించారు. రోజులు గడుస్తున్నా డబ్బులు తీసుకున్న అధికారి ఉద్యోగాన్ని కల్పించకపోవడంతో వారంతా కలెక్టర్‌ను కలిసి సమస్యను తెలియజేశారు. డబ్బులు తీసుకున్నారని, ఉద్యోగం కూడా ఇవ్వలేదని పీజీఆర్‌ఎస్‌లో ఫిర్యాదు చేశారు. అలాగే, ఎన్‌టీఆర్ వైద్యసేవలో పనిచేసే సుమారు 50 మంది ఉద్యోగులను అవుట్ సోర్సింగ్ కార్పొరేషన్ (ఆప్కోస్)లోకి మార్పిస్తామంటూ ఆస్పత్రి అధికారి ఒకరు డబ్బులు తీసుకున్నారంటూ వసూలు చేశారంటూ కలెక్టర్‌కు పీజీఆర్‌ఎస్‌లో ఫిర్యాదు చేశారు. దీనిపై వెంటనే విచారణ జరిపి నివేదిక ఇవ్వాలని ఆస్పత్రి సూపరింటెండెంట్‌ను కలెక్టర్ ఆదేశించారు. రెండు వేర్వేరు వ్యవహారాల్లో ఆస్పత్రికి చెందిన ఉద్యోగులపై ఆరోపణలు రావడం చర్చనీయాంశంగా మారింది. దీనిపై కేజీహెచ్ సూపరింటెండెంట్ డాక్టర్ వాణిని వివరణ కోరగా..తన దృష్టికి సమస్య రాలేదన్నారు. ఈ విషయాన్ని అధికారులతో మాట్లాడిన వసూలుచేసిన వారిపై చర్యలు తీసుకుంటామన్నారు.
ఆరోపణలపై దృష్టిసారించరా..?
కేజీహెచ్‌లో పనిచేసే ఉద్యోగుల నుంచి అధికారులు డబ్బులు తీసుకోవడంపై సర్వత్రా విస్మయం వ్యక్తమవుతోంది. ఉన్నతాధికారులు ఈ వ్యవహారాన్ని సీరియస్‌గా తీసుకుని విచారణ చేయాల్సిన అవసరం ఉంది. వెంటనే విచారణ జరిపించి నివేదిక ఇవ్వాలని కలెక్టర్ కొద్దిరోజుల కిందట ఆస్పత్రి అధికారులకు ఆదేశించారు. అయినప్పటికీ అధికారులు దీనిపై దృష్టిసారించకపోవడం గమనార్హం.
గంటల వ్యవధిలో జనన, మరణ ధ్రువపత్రాలు
కేజీహెచ్ అధికారుల నిర్ణయం
అందుకు తగిన పత్రాలు అందించిన రోజునే జారీ చేయాలని సిబ్బందికి ఆదేశాలు
జాప్యం చేస్తే చర్యలు
విశాఖపట్నం, జూలై 5 (ఆంధ్రజ్యోతి):
కింగ్ జార్జ్ ఆస్పత్రిలో జనన, మరణ ధ్రువీ కరణ పత్రాల జారీలో జరుగుతున్న జాప్యాన్ని నియంత్రించడంపై అధికారులు దృష్టిసారిం చారు. ఆస్పత్రిలో పుట్టే చిన్నారులకు బర్త్ సర్టిఫికెట్లను, మృతిచెందిన వారికి డెత్ సర్టిఫికెట్లను ఎంఆర్‌వో సెక్షన్ ఆధ్వర్యంలో అందిస్తుంటారు. అయితే, సర్టిఫికెట్ల కోసం దరఖాస్తు చేసుకున్న తరువాత రోజుల తరబడి ఆస్పత్రి చుట్టూ తిరగాల్సిన పరిస్థితి ప్రస్తుతం నెలకొని ఉంది. సర్టిఫికెట్ల కోసం కొంతమంది సిబ్బంది డబ్బులు కూడా వసూలు చేస్తున్నట్టు ఆరోపణలు ఉన్నాయి. ఈ నేపథ్యంలో సర్టిఫికెట్ల జారీలో వేగాన్ని పెంచా లని సిబ్బందికి ఆస్పత్రి ఉన్నతాధికారులు ఆదేశాలు జారీచేశారు.
కుటుంబ సభ్యుల నుంచి అవసరమైన పత్రాలను తీసుకున్న వెంటనే (అదేరోజు) సర్టిఫికెట్ల జారీ ప్రక్రియను పూర్తిచేయాలని సూచించారు. ఈ ప్రక్రియలో జాప్యం జరిగే పరిస్థితి ఉంటే అందుకు గల కారణాన్ని దరఖాస్తుదారులకు తెలియజేసి, మరుసటి రోజు అందించేలా చర్యలు చేపట్టా లన్నారు. ఈ మేరకు ఆ సెక్షన్‌కు అవసరమైన సిబ్బందిని కూడా కేటాయించారు. కేజీహెచ్‌లో ప్రతిరోజూ బర్త్ సర్టిఫికెట్ల కోసం 30 నుంచి 40, అలాగే, డెత్ సర్టిఫికెట్ల కోసం 15 నుంచి 20 దరఖాస్తులు వస్తుంటాయని అధికారులు చెబుతున్నారు. వచ్చిన దరఖాస్తులను పరి శీలించి వెంటనే క్లియర్ చేసేలా చర్యలు తీసుకుంటున్నామని సీఎస్‌ఆర్‌ఎంవో డాక్టర్ శ్రీహరి తెలిపారు. ఇందుకోసం అవసరమైతే రెండు గంటలు అధిక సమయాన్ని వెచ్చిం చేందుకు సిద్ధంగా ఉన్నట్టు తెలిపారు.
ధ్రువపత్రాలు కీలకం..
బర్త్ సర్టిఫికెట్‌ను చిన్నారికి పేరు పెట్టిన తరువాత తీసుకోవాల్సి ఉంటుంది. ఇందుకోసం తల్లిదండ్రులు ఆధార్‌లు, ఆస్పత్రిలో ప్రసవించి నట్టు ఇచ్చే పత్రం తీసుకుని ఎంఆర్‌వో సెక్షన్‌ను సంప్రతించాల్సి ఉంటుంది. ఈ పత్రాలతోపాటు దరఖాస్తు పత్రాన్ని నింపి కార్యాలయంలో అందించాల్సి ఉంటుంది. ఈ పత్రాలు ఇచ్చిన కొన్ని గంటల్లోనే బర్త్ సర్టిఫికెట్ జారీచేస్తారు. అలాగే, కేజీహెచ్‌లో మృతిచెందిన వ్యక్తికి సంబంధించిన కుటుంబ సభ్యులు కూడా ఇదే తరహాలో కొన్ని పత్రాలు తీసుకురావాల్సి ఉంటుంది. కుటుంబ సభ్యు లకు మాత్రమే ఈ సర్టిఫికెట్‌ను అందిస్తారు. ప్రస్తుతం ఈ సర్టిఫికెట్లు తీసుకునేందుకు రెండు, మూడుసార్లు ఆస్పత్రి చుట్టూ ప్రదక్షిణలు చేయాల్సిన పరిస్థితి నెలకొంది. దానివల్ల సుదూర ప్రాంతాల నుంచి వచ్చేవారు తీవ్ర ఇబ్బందులను ఎదుర్కొంటు న్నారు. ఈ ఇబ్బందులకు తాజా నిర్ణయంతో చెక్ పడనుంది.
పలు ప్రత్యేక రైళ్ల రద్దు
రెగ్యులర్ రైళ్ల గమ్యాల కుదింపు
విశాఖపట్నం, జూలై 5 (ఆంధ్రజ్యోతి):
రేక్‌ల కొరత వల్ల పలు ప్రత్యేక రైళ్లను తాత్కాలికంగా రద్దు చేశామని, శాశ్వత ప్రాతిపదికన రాకపోకలు సాగిస్తున్న కొన్ని రైళ్ల గమ్యాలు కుదించామని వాల్తేరు సీనియర్ డీసీఎం కె.సందీప్ తెలిపారు.
రద్దయిన రైళ్లు: ఈ నెల 6న విశాఖ-పూరి రఽథయాత్ర ప్రత్యేక రైలు (08313), జగదల్‌పూర్-రూర్కెలా ఇంటర్‌సిటీ ఎక్స్‌ప్రెస్ (18108), జగదల్‌పూర్-భువనేశ్వర్ హిరాకుడ్ ఎక్స్‌ప్రెస్ (18448)ను రద్దు చేశారు. 7న పూరి-జగదల్‌పూర్ రథయాత్ర ప్రత్యేక రైలు (08446), పూరి-విశాఖ రథయాత్ర ప్రత్యేక రైలు (08314), రూర్కెలా-జగదల్‌పూర్ ఇంటర్‌సిటీ ఎక్స్‌ప్రెస్ (18107)ను రద్దు చేశారు.
కిరండూల్ రైళ్లు కోరాపుట్ వరకే
విశాఖ-కిరండూల్ పాసింజర్ (58501) 6, 7 తేదీల్లో విశాఖలో బయలుదేరి కోరాపుట్ వరకూ వెళ్లి, తిరుగు ప్రయాణంలో (58502) కోరాపుట్‌లో బయలుదేరి విశాఖ చేరుతుంది. కోరాపుట్-కిరండూల్ మధ్య రాకపోకలను రద్దు చేశారు. అలాగే విశాఖ-కిరండూల్ రాత్రి ఎక్స్‌ప్రెస్ (18515) ఈ నెల 6న విశాఖలో బయలుదేరి కోరాపుట్ వరకూ నడుస్తుంది. తిరుగు ప్రయాణంలో కిరండూల్-విశాఖ రాత్రి ఎక్స్‌ప్రెస్ (18516) ఈ నెల 6, 7 తేదీల్లో కోరాపుట్ నుంచి బయలుదేరి విశాఖ చేరుతుందని తెలిపారు.