Share News

పెద్దాస్పత్రికి సుస్తీ

ABN , Publish Date - Jul 01 , 2025 | 01:29 AM

ఉత్తరాంధ్ర పెద్దాస్పత్రిగా పేరుగాంచిన కేజీహెచ్‌లో గడిచిన కొద్దిరోజులుగా గుండె శస్త్రచికిత్సలు జరగడం లేదు. ఆపరేషన్లు నిర్వహించేందుకు అవసరమైన కీలకమైన పరికరాలు పనిచేయకపోవడంతో సమస్య ఉత్పన్నమైనట్టు అధికారులు చెబుతున్నారు.

పెద్దాస్పత్రికి సుస్తీ

  • కేజీహెచ్‌లో ఆరు నెలలుగా నిలిచిపోయిన గుండె శస్త్రచికిత్సలు

  • కీలకమైన పరికరాలు పనిచేయకపోవడమే కారణం

  • రోగుల అవస్థలు...

  • కొత్తవి కొనుగోలుకు సుమారు రూ.2.5 కోట్లు అవసరం

  • అద్దె ప్రాతిపదికన తెచ్చిన పరికరం కూడా మొరాయింపు

  • మల్లగుల్లాలు పడుతున్న ఆస్పత్రి అధికారులు

  • ఉన్నతాధికారులు దృష్టికి సమస్య

మహారాణిపేట, జూన్‌ 30 (ఆంధ్రజ్యోతి):

ఉత్తరాంధ్ర పెద్దాస్పత్రిగా పేరుగాంచిన కేజీహెచ్‌లో గడిచిన కొద్దిరోజులుగా గుండె శస్త్రచికిత్సలు జరగడం లేదు. ఆపరేషన్లు నిర్వహించేందుకు అవసరమైన కీలకమైన పరికరాలు పనిచేయకపోవడంతో సమస్య ఉత్పన్నమైనట్టు అధికారులు చెబుతున్నారు.

కేజీహెచ్‌లోని కార్డియాలజీ విభాగానికి ఉత్తరాంధ్రతో పాటు ఒడిశా, ఛత్తీస్‌గఢ్‌ వంటి రాష్ట్రాల నుంచి ప్రతిరోజూ పదుల సంఖ్యలో రోగులు వస్తుంటారు. అయితే, గడిచిన కొద్ది నెలలుగా ఇక్కడ ఓపెన్‌ హార్ట్‌ సర్జరీలు చేయడంలో ఇబ్బందులు ఎదురవుతున్నాయి. ఈ శస్త్రచికిత్సలు నిర్వహించాలంటే కొన్ని రకాల పరికరాలు అవసర ముంటుంది. ఇందులో అత్యంత కీలకమైనది హార్ట్‌ లంగ్‌ మెషీన్‌. గుండెకు సరఫరా అయ్యే రక్తాన్ని డైవర్ట్‌ చేసి వైద్యులు శస్త్రచికిత్సను విజయవంతంగా పూర్తి చేసేందుకు ఈ పరికరం ఉపయోగపడుతుంది. ఈ పరికరం కేజీహెచ్‌లో మూలకు చేరింది. ఒక సంస్థ నుంచి ఈ పరికరాన్ని అద్దె ప్రాతిపదికన తెచ్చి కొద్దికాలం శస్త్ర చికిత్సలు నిర్వహించారు. అయితే, కొన్నాళ్లుగా అది కూడా మొరాయించడంతో శస్త్రచికిత్సలు నిర్వహించలేని పరిస్థితి ఏర్పడింది. అలాగే, గుండె శస్త్ర చికిత్స సమయంలో టెంపరేచర్‌ను నిర్వహించడం అన్నది చాలా కీలకం. ఇందు కోసం టెంపరేచర్‌ కంట్రోల్‌ మెషీన్‌ను వినియోగిస్తుంటారు. ఈ మెషీన్‌ కూడా కొద్దిరోజులుగా పనిచేయడం లేదు. ఈ రెండు కీలక పరికరాలు పనిచేయకపోవడంతో కార్డి యాలజీ విభాగంలో శస్త్ర చికిత్సలు నిలిచిపోయాయి. దీంతో నిరుపేద రోగులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. కేజీహెచ్‌లో ఉచితంగా చేసే ఈ శస్త్ర చికిత్సలను ఇప్పుడు ప్రైవేటు ఆస్పత్రులకు వెళ్లి చేయించుకోవలసి వస్తోంది. అందుకు లక్షలాది రూపాయలు వెచ్చించాల్సిన పరిస్థితి ఏర్పడుతోంది.

రెండున్నర కోట్లు కావాలి

ఈ శస్త్ర చికిత్సలు కేజీహెచ్‌లో నిర్వహించాలంటే హార్ట్‌ లంగ్‌ మెషీన్‌, టెంపరేచర్‌ కంట్రోల్‌ మెషీన్‌ అవసరముంది. ఒక్క హార్ట్‌ లంగ్‌ మెషీన్‌ సుమారు రూ.రెండు కోట్లు ఉంటుంది. అలాగే టెంపరేచర్‌ కంట్రోల్‌ మెషీన్‌కు మరో రూ.60 లక్షల వరకు ఖర్చవుతుందని అధికార వర్గాలు అంచనా వేస్తున్నాయి. అంత మొత్తం వెచ్చించడం ఆస్పత్రి అధికారులకు సాధ్యం కాదు. ఈ నేపథ్యంలోనే సమస్యను ఉన్నతాధికారుల దృష్టికి తీసుకువెళ్లనున్నట్టు సూప రింటెండెంట్‌ డాక్టర్‌ వాణి వెల్లడించారు. ప్రస్తుతానికి ఈ సమస్య నుంచి బయటపడే మార్గాల కోసం అన్వేషిస్తు న్నట్టు వెల్లడించారు. ఒక ప్రైవేటు సంస్థ నుంచి అద్దెకు పరికరాన్ని తెచ్చే ఆలోచనలో ఉన్నట్టు వెల్లడించారు. గతంలో అద్దెకు తెచ్చిన పరికరానికి నెలకు రూ.60 వేలు చెల్లించామని, ఇప్పుడు అద్దెకు తీసుకురావాలని భావిస్తున్న సంస్థ రూ.లక్షన్నర అడుగుతుండడంతో ఆలోచనలో పడినట్టు వెల్లడించారు. ఉన్నతాధికారులు ఆదేశాల మేరకు చర్యలు తీసుకుంటా మన్నారు.

Updated Date - Jul 01 , 2025 | 01:29 AM