Share News

బహిరంగ మార్కెట్‌కు కేజీబీవీ సరుకులు

ABN , Publish Date - Nov 21 , 2025 | 11:33 PM

కొయ్యూరు కస్తూర్బా గాంధీ పాఠశాల సరుకులు శుక్రవారం బహిరంగ మార్కెట్‌కు తరలిస్తుండగా స్థానికులు పట్టుకున్నారు.

బహిరంగ మార్కెట్‌కు కేజీబీవీ సరుకులు
కొయ్యూరు కేజీబీవీ పాఠశాల నుంచి తరలిస్తూ పట్టుబడిన సరుకులు

కొయ్యూరులో పట్టుకున్న గ్రామస్థులు

ఎంపీడీవో కార్యాలయానికి తరలింపు

మొంథా తుఫాన్‌ సమయంలో వెండర్‌ నుంచి

తెచ్చిన సరుకులు తిరిగి ఇస్తున్నామంటున్న ఎస్‌వో

నేడు విచారణ చేస్తామన్న ఏటీడబ్ల్యూవో

కొయ్యూరు, నవంబరు 21 (ఆంధ్రజ్యోతి): కొయ్యూరు కస్తూర్బా గాంధీ పాఠశాల సరుకులు శుక్రవారం బహిరంగ మార్కెట్‌కు తరలిస్తుండగా స్థానికులు పట్టుకున్నారు. శుక్రవారం ఉదయం నుంచి విడతల వారీగా సరుకులు బయటకు వెళుతుండడంతో స్థానికులు మధ్యాహ్నం మూడు గంటల సమయంలో గ్యాస్‌ సిలిండర్‌, ఇడ్లీనూక, ఉప్పు ప్యాకెట్లు, చోడిపిండి ప్యాకెట్లను పట్టుకొని ఎంపీడీవో కార్యాలయంలో భద్రపరిచారు. ఈ సందర్భంగా స్థానికులు మాట్లాడుతూ విద్యార్థులకు మెనూ సక్రమంగా అమలు చేయకుండా ఎస్‌వో అడ్డదారిలో దోపిడీకి పాల్పడుతున్నారని ఆరోపించారు. శుక్రవారం ఒక్కరోజే నాలుగు పర్యాయాలు ఇలా సరకులు తరలించారన్నారు. చివరిసారి తాము పట్టుకున్నామన్నారు. గతంలో అనేక పర్యాయాలు రాత్రి సమయాలలో సరుకుల తరలింపు జరిగేదని, ఇప్పుడు పట్టపగలే అక్రమాలకు తెగపడ్డారని తెలిపారు. ఈ విషయమై విచారణ జరిపి నిగ్గు తేల్చాలని స్థానికులు డిమాండ్‌ చేస్తున్నారు. కాగా కొయ్యూరు కేజీబీవీ ఎస్‌వో పరిమళ వద్ద ప్రస్తావించగా మొంథా తుఫాన్‌ సమయంలో కొన్ని సరుకులను వెండర్‌ నుంచి తెచ్చామని, వాటిని తిరిగి ఇస్తున్నామని చెప్పారు. తుఫాన్‌ సమయంలో సరుకుల కొరత ఏర్పడడంతో కేజీబీవీకి కూరగాయలు తదితర సామగ్రి సరఫరా చేసే వెండరు నుంచి అప్పుగా తేవడం జరిగిందని, వాటిని వెండర్‌ అడిగితే తిరిగి ఇచ్చామే తప్ప ఇందులో ఎటువంటి అక్రమాలకు పాల్పడలేదని వివరించారు. ఈ విషయమై మండల సహాయ గిరిజన సంక్షేమశాఖాధికారి (ఏటీడబ్ల్యూవో) క్రాంతికుమార్‌ వద్ద ప్రస్తావించగా.. ఈ విషయమై శనివారం విచారణ జరిపి చర్యలు తీసుకుంటామన్నారు.

Updated Date - Nov 21 , 2025 | 11:33 PM