Share News

ఐఐఎంలో కీలక శిక్షణ

ABN , Publish Date - Nov 24 , 2025 | 12:46 AM

ఇండియన్‌ ఇనిస్టిట్యూట్‌ ఆఫ్‌ మేనేజ్‌మెంట్‌ (ఐఐఎం) విభిన్నమైన కార్యకలాపాలకు కేంద్రంగా మారుతోంది.

ఐఐఎంలో కీలక శిక్షణ

మహిళా శాస్త్రవేత్తలకు అవకాశం

డిసెంబరు 8 నుంచి 12 వరకు నిర్వహణ

విభిన్న అంశాలపై చర్చించనున్న నిపుణులు

విశాఖపట్నం, నవంబరు 23 (ఆంధ్రజ్యోతి):

ఇండియన్‌ ఇనిస్టిట్యూట్‌ ఆఫ్‌ మేనేజ్‌మెంట్‌ (ఐఐఎం) విభిన్నమైన కార్యకలాపాలకు కేంద్రంగా మారుతోంది. ప్రస్తుత కాలమాన పరిస్థితులకు అనుగుణంగా విభిన్న రంగాల్లో వచ్చే మార్పులకు అనుగుణంగా నిపుణులకు అందించేందుకు నిరంతరం కృషి చేస్తోంది. ఈ క్రమంలోనే మరో విభిన్న శిక్షణ కార్యక్రమానికి వేదికగా నిలుస్తోంది.

అన్ని రంగాల్లో పోటీ పడి రాణిస్తున్న మహిళలను శక్తివంతులుగా తీర్చిదిద్దే కార్యక్రమానికి కేంద్ర శాస్త్ర, సాంకేతిక మంత్రిత్వశాఖ (డీఎస్టీ)తో కలిసి ఐఐఎం కీలక శిక్షణకు శ్రీకారం చుట్టనుంది. ఇప్పటికీ శాస్త్ర, సాంకేతిక రంగాల్లో మహిళలు అద్వితీయంగా ఎదిగేందుకు అనేక అవాంతరాలు, అడ్డంకులు సవాళ్లుగా నిలుస్తున్నాయి. వాటికి పరిష్కార మార్గాలను చూపించడంతోపాటు ఆయా రంగాల్లో మహిళలను ప్రోత్సహించేందుకు డీఎస్టీతో కలిసి శిక్షణలో మెలకువలను నేర్పించనున్నారు. ఇందులో భాగంగానే డిసెంబరు 6 నుంచి 12వ తేదీ వరకు రెసిడెన్షియల్‌ కెపాసిటీ బిల్డింగ్‌ ప్రొగ్రామ్‌ను నిర్వహించనున్నారు. నాలుగురోజులు నిర్వహించనున్న శిక్షణకు అయ్యే ఖర్చును పూర్తిగా డీఎస్టీ భరించనుంది. పాల్గొనే మహిళలకు భోజనం, వసతి సదుపాయాన్ని కల్పించనున్నారు. ప్రయాణ ఖర్చులను వారే భరించాల్సి ఉంటుంది. దేశంలోని ఏ ప్రాంతానికి చెందిన మహిళలైనా శిక్షణలో పాల్గొనే అవకాశం ఉంది.

అర్హులు వీరే

శిక్షణకు పీహెచ్‌డీ, ఎంటెక్‌ చదివి, పరిశోధన, అభివృద్ధి (ఆర్‌అండ్‌డీ)లో చురుగ్గా పాల్గొంటున్న మహిళా విద్యావేత్తలు, ప్రొఫెసర్లు అర్హులు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు, ప్రభుత్వ రంగ సంస్థలు, స్వయం ప్రతిపత్తి, పరిశోధన, డెవలప్‌మెంట్‌ ఇనిస్టిట్యూషన్స్‌, పరిశోధన ప్రయోగశాలల్లోని శాస్ర్తీయ విభాగాల్లో పనిచేస్తున్న మహిళా శాస్త్రవేత్తలు, సాంకేతిక నిపుణులు దరఖాస్తు చేసుకోవచ్చు. ఆసక్తి కలిగిన మహిళలు ్టట్చజీుఽజీుఽజ.ఛీట్ట.జౌఠి.జీుఽ వెబ్‌సైట్‌లో లాగిన్‌ కావడం ద్వారా దరఖాస్తు చేసుకోవచ్చు. శిక్షణలో మహిళా శాస్త్రవేత్తలు, సాంకేతిక నిపుణులను కీలకమైన నాయకత్వ సామర్థ్యాల తో సన్నద్ధపరచడం, స్వీయ అవగాహన, విశ్వాసం పెంపొందించేలా చూస్తారు. ఆయా అంశాలపై బృంద చర్చలను నిర్వహించనున్నారు. సవాళ్లతో కూడిన పరిస్థితులు ఎదరైనప్పుడు ఎదుర్కొనే తీరు, ఆలోచనలు, పరిపాలనా బాధ్యతలను నిర్వర్తించడం, వృత్తిపరమైన అడ్డంకులను సమరంగా ఎదుర్కోవడం, అభివృద్ధికి అవకాశాలుగా ఎలా మార్చుకోవాలన్న విషయాలను శిక్షణలో తెలియజేస్తారు. లింగభేదాలు, పక్షపాతాలను అధిగమించడానికి వ్యూహాలు రచించడం, పరిశోధనల్లో బృందాలను శక్తిమంతం చేయడానికి అవసరమైన నాయకత్వ లక్షణాలపై అవగాహన కల్పిస్తారు.


స్టూడెంట్‌ అసెంబ్లీకి ఎనిమిది మంది

నియోజకవర్గానికి ఒకరుచొప్పున ఎంపిక

నేడు, రేపు విజయవాడలో అవగాహన

మిగిలిన విద్యార్థులకు 26న జిల్లాలో సత్కారం

విశాఖపట్నం, నవంబరు 23 (ఆంధ్రజ్యోతి):

రాష్ట్ట్రస్థాయిలో నిర్వహించనున్న స్టూడెంట్‌ అసెంబ్లీకి జిల్లా నుంచి ఎనిమిది విద్యార్థులు ఎంపికయ్యారు. ప్రతి అసెంబ్లీ నియోజకవర్గం నుంచి ఒకరు చొప్పున ఎంపికచేసిన జిల్లావిద్యాశాఖ, అదనంగా ఒక విద్యార్థిని ఈ బృందంలో చేర్చారు. భారత రాజ్యాంగం అమల్లోకి వచ్చిన నవంబరు 26న విజయవాడలో కార్యక్రమం నిర్వహించనున్నారు.

స్టూడెంట్‌ అసెంబ్లీకి జిల్లాలోని పెదనరవ బీసీ గురుకులం విద్యార్థి ఎస్‌.లికేష్‌ ( పదోతరగతి- పెందుర్తి నియోజకవర్గం), సింహాచలం బీసీ గురుకులం విద్యార్థి ఎస్‌.దుర్గారవికుమార్‌ (పదోతరగతి, భీమిలి అసెంబ్లీ), శ్రీకృష్ణాపురం ఎస్సీ గురుకులం విద్యార్థి (తొమ్మిదో తరగతి- విశాఖ తూర్పు), డాబాగార్డెన్స్‌లోని ఎంజీఎం ఉన్నత పాఠశాల విద్యార్థి పి.రాకేష్‌ (తొమ్మిదోతరగతి- విశాఖ దక్షిణ), అక్కయ్యపాలెం ఎన్జీవో కాలనీ జీవీఎంసీ ఉన్నత పాఠశాల విద్యార్థి వి.హర్షవర్దన్‌ ( పదోతరగతి- విశాఖ ఉత్తర), మల్కాపురం జీవీఎంసీ ఉన్నత పాఠశాల విద్యార్థి డీపీకేవీ.సతీష్‌ (తొమ్మిదో తరగతి- విశాఖ పశ్చిమ), నడుపూరు జడ్పీ ఉన్నత పాఠశాల విద్యార్థి వై.రిషి(ఎనిమిదో తరగతి- గాజువాక)ను ఎంపికచేశారు. స్టాండ్‌బైగా ప్రకాశరావుపేట జీవఎంసీ మునిసిపల్‌ పాఠశాల విద్యార్థి బి.ఉదయ్‌ తేజ (తొమ్మిదోతరగతి- విశాఖ దక్షిణ)ను పంపారు. వీరికి తోడుగా చింతలఅగ్రహారం, గోపాలపట్నం బాలుర జడ్పీ ఉన్నత పాఠశాల సోషల్‌స్టడీస్‌ ఉపాధ్యాయులు జి.వరహాలదొర, సరళకుమారి ఆదివారం విజయవాడ బయలుదేరారు. ఎనిమిదిమందిలో ఏడుగురు మాత్రమే స్టూడెంట్‌ అసెంబ్లీలో పాల్గొంటారు. పాఠశాల స్థాయి నుంచి ఎంపిక ప్రక్రియ ప్రారంభించారు. ఆ తరువాత మండలం, నియోజకవర్గం స్థాయిలో ముగ్గురు చొప్పున ఎంపికచేసి 21మంది పేర్లను పాఠశాల విద్యాశాఖకు పంపారు. వీరిలో ఏడుగురు, ఆ తరువాత మరొకరిని ఎంపికచేశారు. నియోజకవ్గం నుంచి ముగ్గురు చొప్పున ఎంపికచేసిన జాబితాలో మిగిలిన 13 మందిని ఈనెల 26వతేదీన జిల్లా స్థాయిలో నిర్వహించే కార్యక్రమంలో సత్కరించనున్నారు.

Updated Date - Nov 24 , 2025 | 12:46 AM