నేవల్ ప్రాజెక్టు డీజీగా కె.శ్రీనివాస్
ABN , Publish Date - Nov 04 , 2025 | 01:21 AM
విశాఖపట్నం నేవల్ ప్రాజెక్టు డైరెక్టర్ జనరల్‌గా వైస్ అడ్మిరల్ కె.శ్రీనివాస్ బాధ్యతలు చేపట్టారు.
విశాఖపట్నం, నవంబరు 3 (ఆంధ్రజ్యోతి):
విశాఖపట్నం నేవల్ ప్రాజెక్టు డైరెక్టర్ జనరల్‌గా వైస్ అడ్మిరల్ కె.శ్రీనివాస్ బాధ్యతలు చేపట్టారు. నేవల్ డాక్‌యార్ట్ సూపరింటెండెంట్‌గా తన పదవీకాలం పూర్తి కావడంతో ప్రభుత్వం డైరెక్టర్ జనరల్‌గా నియమించింది. కోరుకొండ సైనిక్ స్కూల్, నేవల్ డిఫెన్స్ అకాడమీలో విద్య అభ్యసించిన ఆయన 1990లో నేవీలో ప్రవేశించారు. తన 35 ఏళ్ల సర్వీసులో సముద్రంలోనే ఎక్కువకాలం పనిచేశారు. యుద్ధ విమాన వాహక నౌక ఐఎన్‌ఎస్ విరాట్‌లో వివిధ హోదాల్లో విధులు నిర్వహించారు. ఐఎన్‌ఎస్ విక్రమాదిత్యకు రష్యాలో మరమ్మతులు చేయాల్సి వచ్చినప్పుడు సూపరింటెండెంట్‌గా వెళ్లారు. యుద్ధ విమాన వాహక నౌకల ప్రాజెక్ట్‌కు ప్రిన్సిపల్ డైరెక్టర్‌గా పనిచేశారు.
కమిషనరేట్‌లో కలియతిరిగిన డీజీపీ
ప్రతి విభాగం పరిశీలన
విశాఖపట్నం, నవంబరు 3 (ఆంధ్రజ్యోతి):
డీజీపీ హరీష్‌కుమార్‌గుప్తా సోమవారం నగర పోలీస్ కమిషనర్ కార్యాలయంలో కలియతిరిగారు. ఉదయం కొంతసేపు సీపీ శంఖబ్రతబాగ్చితో మాట్లాడారు. అనంతరం ప్రతి అంతస్థుకు వెళ్లి అక్కడున్న విభాగాలను పరిశీలించారు. కంట్రోల్ రూమ్‌కు వెళ్లి అక్కడి నుంచి నగరంలోని వివిధ కూడళ్లు, ప్రాంతాలు, రోడ్లకు సంబంధించిన సీసీ కెమెరాల ఫుటేజీని పరిశీలించారు. కమిషనరేట్ ఆవరణలో నిలిచిపోయిన భవన నిర్మాణాలను పరిశీలించి వాటి గురించి సీపీని ఆరా తీశారు. అక్కడి నుంచి పాత సీపీ కార్యాలయం, స్పెషల్ బ్రాంచి, ఏఆర్‌కాంప్లెక్స్‌ను పరిశీలించారు. కార్యాలయం ఆవరణ పరిశుభ్రంగా ఉంచడంపై సీపీతోపాటు ఏఆర్ విభాగం అధికారులను అభినందించారు.
6న జడ్పీ స్థాయీసంఘ సమావేశాలు
విశాఖపట్నం, నవంబరు 3 (ఆంధ్రజ్యోతి):
జిల్లా పరిషత్ స్థాయీ సంఘ సమావేశాలు ఈనెల ఆరో తేదీన జరగనున్నాయని సీఈవో పి.నారాయణమూర్తి తెలిపారు. జడ్పీ సమావేశ మందిరంలో ఆరో తేదీ ఉదయం పది గంటలకు రెండో స్థాయీ సంఘ సమావేశం, 11 గంటలకు నాలుగు, మధ్యాహ్నం 12 గంటలకు ఏడు, ఒకటి స్థాయీ సంఘ సమావేశాలు జరుగుతాయన్నారు. చైర్‌పర్సన్ ఛాంబర్‌లో ఉదయం 10.30 గంటలకు మూడు, 11.30 గంటలకు ఐదు, మధ్యాహ్నం 12.30 గంటలకు ఆరో స్థాయీ సంఘ సమావేశం జరుగుతాయన్నారు.