జంబో అజెండా!
ABN , Publish Date - Dec 04 , 2025 | 01:35 AM
‘నవ్విపోదురుగాక...’ అన్నచందంగా జీవీఎంసీ స్టాండింగ్ కమిటీ వ్యవహారశైలి మారిపోతోంది. ప్రజాధనం ఖర్చుచేసే అంశంలో అవినీతి, అక్రమాలకు ఆస్కారం లేకుండా పర్యవేక్షించే ఉద్దేశంతో ఏర్పాటుచేసిన స్టాండింగ్‌కమిటీ అందుకు భిన్నంగా వ్యవహరిస్తోందనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.
6న జీవీఎంసీ స్టాండింగ్ కమిటీ సమావేశం
257 అంశాలతో అజెండా రూపొందించిన అధికారులు
జనవరిలో చేసిన పనులకు బిల్లుల చెల్లింపునకు ప్రతిపాదన
ముందస్తు అనుమతి ఇచ్చిన ఎనిమిదినెలల తర్వాత ర్యాటిఫికేషన్
విశాఖపట్నం, డిసెంబరు 3 (ఆంధ్రజ్యోతి):
‘నవ్విపోదురుగాక...’ అన్నచందంగా జీవీఎంసీ స్టాండింగ్ కమిటీ వ్యవహారశైలి మారిపోతోంది. ప్రజాధనం ఖర్చుచేసే అంశంలో అవినీతి, అక్రమాలకు ఆస్కారం లేకుండా పర్యవేక్షించే ఉద్దేశంతో ఏర్పాటుచేసిన స్టాండింగ్‌కమిటీ అందుకు భిన్నంగా వ్యవహరిస్తోందనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.
ఈనెల ఆరున నిర్వహించే స్టాండింగ్ కమిటీ సమావేశానికి 257 అంశాలతో జంబో అజెండాను సిద్ధంచేశారు. ఈ ఏడాది జనవరి నాలుగున జరిగిన ఐఎఫ్‌ఆర్ ఏర్పాట్లకు చేసిన ఖర్చులకు గాను కాంట్రాక్టర్‌కు బిల్లుల చెల్లింపు అంశాన్ని తాజా అజెండాలో చేర్చడం ఆశ్చర్యానికి గురిచేస్తోంది. గత 12 నెలల్లో సుమారు ఏడెనిమిదిసార్లు స్టాండింగ్ కమిటీ సమావేశాలు జరిగాయి. వాటిల్లో ఐఎఫ్‌ఆర్ ఏర్పాట్లకు చేసిన ఖర్చుల బిల్లు పెట్టని అధికారులు 11 నెలల తర్వాత పొందుపరచడం వెనక మతలబులేమిటనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఇంకా నగరంలో రోడ్లపై తిరిగే పశువులను పట్టుకునేందుకు రెండు టాటా ఏస్ వాహనాలను సమకూర్చేందుకు రూ.48.6 లక్షలు వెచ్చించే ప్రతిపాదనను అజెండాలో చేర్చారు. అలాగే బహిరంగ ప్రదేశాల్లో తిరిగే పందులను చంపడంతోపాటు వీధి కుక్కలను పట్టుకుని ఆపరేషన్ సెంటర్లకు తరలించేందుకు వలలు, రింగుల కొనుగోలు, ఆపరేషన్ చేసేందుకు, తూటాల కొనుగోలుకు రూ.38.5 లక్షలు ఖర్చవుతుందని ప్రతిపాదించారు. ఆయా పనులను 2025 ఏప్రిల్ నుంచి 2026 మార్చి వరకు నిర్వహించేలా కాంట్రాక్టర్లకు ఈ ఏడాది ఏప్రిల్‌లోనే ముందస్తు అనుమతి ఇచ్చేశారు. తాజాగా ర్యాటిఫికేషన్ కోసం అజెండాలో ప్రతిపాదించడం విశేషం. ఏదైనా పనికి ముందుగా స్టాండింగ్‌కమిటీ ఆమోదం తీసుకుని టెండర్లు పిలవాలి. కాంట్రాక్టర్లకు బాధ్యతలు అప్పగించాలి. కానీ పనులు అప్పగించేసిన ఎనిమిది నెలల తర్వాత స్టాండింగ్‌కమిటీ ఆమోదం కోరడం విడ్డూరంగా ఉందని అధికారులే అభిప్రాయపడుతున్నారు. ఇలాంటి అంశాలను అజెండాలో అధికారులు ప్రతిపాదిస్తే కమిషనర్, మేయర్ అభ్యంతరం తెలపకుండా ఎలా సమ్మతిస్తున్నారో అర్థం కావడం లేదంటున్నారు.
మరిన్ని అంశాలివీ...
అనకాపల్లి జోన్‌లో ఫ్లెక్సీలను తొలగించేందుకు వీలుగా రోజువారి వేతనంపై ఐదుగురు కార్మికులను నియమించే అంశాన్ని అజెండాలో చేర్చారు. 71వ వార్డులో జీవీఎంసీ ఆధ్వర్యంలో భగీరథ మహర్షి ఉత్సవం నిర్వహించేదుకు అనుమతి కోరుతూ అజెండాలో చేర్చారు. జోన్-6 పరిధిలోని 11 సులభ్ కాంప్లెక్స్‌లలో కేర్‌టేకర్లుగా పనిచేస్తున్న 22 మందికి వేతనాలు చెల్లించే అంశాన్నీ అజెండాలో చేర్చారు. బీచ్‌రోడ్డులో సిల్వర్‌స్పూన్ రెస్టారెంట్‌కు ఇప్పుడున్న స్థలానికి ఆనుకుని 367 చదరపు గజాలను అదనంగా రూ.2.29 లక్షల నెలసరి అద్దెకు కేటాయించే అంశాన్ని ప్రతిపాదించారు. సాగర్‌నగర్‌లో మురుగునీరు సముద్రంలో చేరకుండా ఎస్‌టీపీలోకి తరలించేందుకు, మురుగునీటిలో వ్యర్థాలను వేరుచేసేందుకు స్టెయిన్‌లెస్‌స్టీల్ పాలీమెక్‌నెట్ ఏర్పాటు అంశాన్ని అజెండాలో ఉంచారు. జీవీఎంసీ కార్యక్రమాలను డ్రోన్‌ద్వారా చిత్రీకరించేందుకు నెలకు రూ.25వేల వేతనానికి ఆపరేటర్‌ను ఎస్‌ఎల్‌ఎఫ్ ద్వారా నియమించుకునే అంశాన్ని చేర్చారు. ఈఏడాది జూన్21న నగరంలో నిర్వహించిన యోగాంధ్ర కార్యక్రమానికి ఏర్పాట్లు, సదుపాయాలు, మౌలిక వసతుల కల్పన, పార్కింగ్ స్థలాలను చదనుచేయడం వంటి పనులకు చేసిన ఖర్చులను కాంట్రాక్టర్లకు చెల్లించే అంశాలను భారీగానే అజెండాలో చేర్చారు. ఇవికాకుండా వార్డుల్లో అభివృద్ధి పనులు, వివిధ జోన్‌ల పరిధిలో దుకాణాల వేలం, రోడ్డుమార్జిన్ల ఆశీలు వసూలు వేలం వంటి అంశాలను పొందుపరిచారు.