Share News

ఆదివాసీల్లో వెల్లివిరిసిన ఆనందం

ABN , Publish Date - Aug 01 , 2025 | 10:20 PM

మండలంలోని అంజలి శనివారం పంచాయతీ కేంద్రానికి 75 ఏళ్ల తరువాత తారు రోడ్డు పడింది. కూటమి ప్రభుత్వ ప్రత్యేక చొరవతో తారు రోడ్డు వేయడంతో ఆదివాసీల ఆనందానికి అవధుల్లేవు.

ఆదివాసీల్లో వెల్లివిరిసిన ఆనందం
అంజలి శనివారంకి అందుబాటులోకి వచ్చిన తారు రోడ్డు

అంజలి శనివారానికి తారు రోడ్డు

75ఏళ్ల తర్వాత గ్రామానికి రోడ్డు

కూటమి ప్రభుత్వానికి కృతజ్ఞతలు తెలిపిన గిరిజనులు

చింతపల్లి, ఆగస్టు 1 (ఆంధ్రజ్యోతి):మండలంలోని జాజులపాలెం నుంచి అంజలి శనివారం వరకు 4.9 కిలోమీటర్లు కొన్నేళ్ల క్రితం మెటల్‌ రోడ్డు నిర్మించారు. ఈ రహదారి అత్యంత అధ్వానంగా తయారుకావడంతో రాకపోకలు సాగించేందుకు ప్రజలు అవస్థలు పడేవారు. గ్రామానికి అంబులెన్స్‌ వచ్చే పరిస్థితి లేక రోగులు, గర్భిణులను డోలిలో మోసుకెళ్లాల్సి వచ్చేది. ఆదివాసీలు ఎదుర్కొంటున్న రవాణ కష్టాలను గుర్తించిన గత టీడీపీ ప్రభుత్వం 2018లో రూ.రెండు కోట్లను విడుదల చేసింది. 2019లో అధికారంలోకి వచ్చిన వైసీపీ ప్రభుత్వం ఈ టెండర్‌ని రద్దు చేసింది. 2021-22లో నాటి జిల్లా కలెక్టర్‌ ప్రత్యేక చొరవ తీసుకొని అంజలి శనివారం రహదారి నిర్మాణానికి రూ.2.84 ఎన్‌ఆర్‌ఈజీఎస్‌ నిధులను కేటాయించారు. అయితే వైసీపీ ప్రభుత్వం నిధులు విడుదల చేయకపోవడంతో 2024 వరకు రహదారి నిర్మాణాలు పూర్తికాలేదు. గతంలో టీడీపీ పాడేరు నియోజకవర్గ ఇన్‌చార్జి గిడ్డి ఈశ్వరి, టీడీపీ అరకు పార్లమెంట్‌ కార్యనిర్వాహక కార్యదర్శి చల్లంగి జ్ఞానేశ్వరి, మండలాధ్యక్షుడు కిల్లో పూర్ణచంద్రరావు, టీడీపీ నాయకులు, స్థానిక గిరిజనులతో కలిసి బురదమయమైన అంజలి శనివారం రహదారిపై వరి నాట్లు వేసి నిరసన వ్యక్తం చేశారు. అయినా వైసీపీ ప్రభుత్వంలో కనీస చలనం కనిపించలేదు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి రావడంతో మాజీ ఎమ్మెల్యే గిడ్డి ఈశ్వరి అంజలి శనివారం రహదారి దుస్థితి, ఆదివాసీలు ఎదుర్కొంటున్న సమస్యలను ముఖ్యమంత్రి చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్‌ కల్యాణ్‌ దృష్టికి తీసుకువెళ్లారు. అటవీ శాఖ అనుమతులను సైతం ప్రభుత్వం వెంటనే మంజూరు చేసేందుకు కూటమి ప్రభుత్వం ప్రత్యేక చొరవ తీసుకుంది. దీంతో రహదారి నిర్మాణానికి అవసరమైన నిధులను నెల రోజుల క్రితం విడుదల చేసింది. దీంతో పంచాయతీరాజ్‌ ఇంజనీరింగ్‌ ఏఈఈ బాలకిశోర్‌ పర్యవేక్షణలో జూలై 21న అంజలి శనివారం తారు రోడ్డు నిర్మాణం ప్రారంభించి 31వ తేదీ నాటికి పూర్తి చేశారు. తారు రోడ్డు అందుబాటులోకి రావడంతో దశాబ్దాల నాటి కల నెరవేరిందని ఆదివాసీలు ఆనందం వ్యక్తం చేశారు. తమ రవాణ కష్టాలు తీర్చిన ముఖ్యమంత్రి చంద్రబాబు, ఉప ముఖ్యమంత్రి పవన్‌ కల్యాణ్‌, నియోజకవర్గ ఇన్‌చార్జి గిడ్డి ఈశ్వరిలకు అంజలి శనివారం గ్రామ పెద్దలు, టీడీపీ నాయకులు కిముడు నారాయణరావు, పరమేశ్వరరావు, అశోక్‌గజపతిరావు, విజయ్‌కుమార్‌, లకే చిన్నరామస్వామి, సుర్ల అప్పలరాజు, వంతల ఆనంద్‌ కృతజ్ఞతలు తెలిపారు.

Updated Date - Aug 01 , 2025 | 10:20 PM