Share News

అన్నదాత ఆనందం

ABN , Publish Date - Jul 06 , 2025 | 12:32 AM

ఈ ఏడాది ఖరీఫ్‌ సీజన్‌ ఆశాజనకంగానే ప్రారంభం కావడంతో అన్నదాతల్లో ఆనందం నెలకొంది. సీజన్‌ ప్రారంభంలోనే అవసరమైన వానలు పడడంతో అన్నదాతలు పొలం పనుల్లో నిమగ్నమయ్యారు. ప్రస్తుతం గ్రామాల్లో అన్నదాతలు ఆకుమడుల తయారీతో పాటు ఆకుపోతలతో బిజీగా ఉన్నారు. వాస్తవానికి గ్రామీణ ప్రాంతంలో ఏటా జూలై నెల రెండో వారానికే చాలా చోట్ల వరినాట్లు ప్రారంభమై ఆగస్టు నెలాఖరునాటికి దాదాపుగా 80 శాతం పైగా వరినాట్లు పూర్తయ్యేవి. కానీ గత రెండేళ్లలో ఖరీఫ్‌ సీజన్‌లో అన్నదాతలు వర్షాల కోసం ఎదురుచూపులు చూడకతప్పని పరిస్థితి ఎదురైంది. గత ఏడాది ఆగస్టు నెల చివరి వారానికి గానీ వరినాట్లు వేయలేకపోయారు. అయితే ఈ ఏడాది ఖరీఫ్‌ సీజన్‌కు వాతావరణం కలిసి వచ్చింది

అన్నదాత ఆనందం
: అన్నవరం గ్రామం వద్ద విత్తనాలు చల్లేందుకు ఆకుమడిని సిద్ధం చేస్తున్న రైతు

- ఆశాజనకంగా ఖరీఫ్‌ సీజన్‌ ఆరంభం

- అదునులో వర్షాలతో రైతుల సంబరం

- ఉత్సాహంగా ఆకుమడులు తయారీ, జోరుగా ఆకుపోతలు

- గత రెండేళ్లు ఆలస్యంగా వర్షాలతో సీజన్‌ జాప్యం

- ఈ ఏడాది సకాలంలో వర్షాలతో ఆగస్టు నెలాఖరు నాటికే వరినాట్లు పూర్తయ్యే అవకాశం

చోడవరం, జూలై 5: ఈ ఏడాది ఖరీఫ్‌ సీజన్‌ ఆశాజనకంగానే ప్రారంభం కావడంతో అన్నదాతల్లో ఆనందం నెలకొంది. సీజన్‌ ప్రారంభంలోనే అవసరమైన వానలు పడడంతో అన్నదాతలు పొలం పనుల్లో నిమగ్నమయ్యారు. ప్రస్తుతం గ్రామాల్లో అన్నదాతలు ఆకుమడుల తయారీతో పాటు ఆకుపోతలతో బిజీగా ఉన్నారు. వాస్తవానికి గ్రామీణ ప్రాంతంలో ఏటా జూలై నెల రెండో వారానికే చాలా చోట్ల వరినాట్లు ప్రారంభమై ఆగస్టు నెలాఖరునాటికి దాదాపుగా 80 శాతం పైగా వరినాట్లు పూర్తయ్యేవి. కానీ గత రెండేళ్లలో ఖరీఫ్‌ సీజన్‌లో అన్నదాతలు వర్షాల కోసం ఎదురుచూపులు చూడకతప్పని పరిస్థితి ఎదురైంది. గత ఏడాది ఆగస్టు నెల చివరి వారానికి గానీ వరినాట్లు వేయలేకపోయారు. అయితే ఈ ఏడాది ఖరీఫ్‌ సీజన్‌కు వాతావరణం కలిసి వచ్చింది. జూన్‌ నెల రెండవ వారం నుంచి అడపాదడపా వర్షాలు పడడంతో పాటు జూలై నెల ప్రారంభంలో కూడా వర్షాలు కాసింత మెరుగ్గానే కురవడం వ్యవసాయానికి ఊపిరిపోసినట్టయింది. అదునులో వర్షాలు కురియడంతో ప్రస్తుతం గ్రామాల్లో రైతులందరూ సాగు పనులు ముమ్మరంగా చేపడుతున్నారు. ప్రభుత్వం కూడా విత్తనాల పంపిణీ కార్యక్రమం ప్రారంభించడంతో అన్నదాతలు విత్తనాలు చల్లే పనిలో పడ్డారు. ఈ ఏడాది ప్రారంభం నుంచీ వర్షాలు పడుతుండడంతో సాగుకు అనుకూల వాతావరణం ఏర్పడిందని, ఈ ప్రభావం వల్ల డివిజన్‌లో వరినాట్లు త్వరగా పూర్తయ్యే అవకాశం ఉందని వ్యవసాయ అధికారులు అంచనా వేస్తున్నారు. బోర్లు, చెరువుల కింద ఇప్పటికే రైతులు ఆకుమడులు వేయగా, మిగిలిన ప్రాంతాల్లో రైతులు ఆకుపోతల కోసం మడులు సిద్ధం చేసే పనిలో నిమగ్నమయ్యారు. ఇదే వాతావరణం కొనసాగే పరిస్థితులు కనిపిస్తుండడంతో ఈ నెల మూడవ వారం దాటిన తరువాత రిజర్వాయర్ల పరిధిలోనూ, వ్యవసాయ బోర్ల కింద వరినాట్లు ప్రారంభమయ్యే అవకాశాలు ఉన్నాయి. మిగిలిన ప్రాంతాల్లో కూడా నెలాఖరు నాటికి నాట్లు పడే పరిస్థితి కనిపిస్తున్నది.

నిండుగా రిజర్వాయర్లు

ఈ ఏడాది ఏజెన్సీ ప్రాంతంలో రెండు నెలల నుంచి వర్షాలు విస్తారంగా కురవడంతో మైదాన ప్రాంతంలోని రైవాడ, పెద్దేరు, కోనాం, కల్యాణపులోవ రిజర్వాయర్లకు కూడా ఇన్‌ఫ్లో బాగానే పెరిగింది. దీంతో ఈ రిజర్వాయర్లు నీటితో కళకళలాడుతున్నాయి. రిజర్వాయర్లు నిండుగా ఉండడంతో వరినాట్లకు అవసరమైన సమయంలోనే నీరు విడుదల చేయడానికి మార్గం ఏర్పడింది. మొత్తం మీద చూస్తే ఈ ఏడాది సకాలంలో వర్షాలు ప్రారంభం కావడం అన్నదాతలకు ఆనందాన్ని ఇస్తుండగా, వరినాట్లు కూడా సకాలంలో పూర్తవుతాయని అధికారులు అంచనా వేస్తున్నారు. చోడవరం వ్యవసాయశాఖ సబ్‌ డివిజన్‌ పరిధిలోని మండలాల్లో 13,071 హెక్టార్ల పరిధిలో వరి సాగవుతోంది. వాతావరణం సానుకూలంగా ఉండడంతో ఈ ఖరీఫ్‌ సీజన్‌లో ఆగస్టు నెలాఖరు నాటికి దాదాపుగా 80 శాతం మేర వరినాట్లు పూర్తయ్యే అవకాశం ఉందని అధికారులు భావిస్తున్నారు.

ి

Updated Date - Jul 06 , 2025 | 12:32 AM