ఆర్టీసీలో జోష్
ABN , Publish Date - Dec 11 , 2025 | 01:35 AM
విశాఖ రీజియన్‌లో ఆర్టీసీ ప్రయాణికుల సంఖ్య అనూహ్యంగా పెరిగింది. ఆక్యుపెన్సీ రేషియో (ఓఆర్) దాదాపు 95 శాతం నమోదవుతోంది. అందుకు తగ్గట్టుగా ఆదాయం వస్తోంది. ఇందుకు ‘స్ర్తీశక్తి’ పథకమే కారణమని ప్రత్యేకించి చెప్పనవసరం లేదు. ప్రభుత్వం ఈ ఏడాది ఆగస్టు 15న స్ర్తీశక్తి పథకం ప్రారంభించింది. ఆ మరుసటిరోజు నుంచే ఓఆర్ పెరుగుతూ వచ్చింది.
స్ర్తీశక్తి పథకం అమలుతో
విపరీతంగా పెరిగిన ప్రయాణికుల సంఖ్య
గతంలో రోజుకు 2.3 లక్షల మంది ప్రయాణం
ఇప్పుడు 4.18 లక్షలు...
ఆక్యుపెన్సీ 66 నుంచి 93 శాతానికి...
ఆదాయం రూ.95 లక్షల నుంచి రూ.1.3 కోట్లకు
ద్వారకా బస్‌స్టేషన్, డిసెంబరు 9 (ఆంధ్రజ్యోతి):
విశాఖ రీజియన్‌లో ఆర్టీసీ ప్రయాణికుల సంఖ్య అనూహ్యంగా పెరిగింది. ఆక్యుపెన్సీ రేషియో (ఓఆర్) దాదాపు 95 శాతం నమోదవుతోంది. అందుకు తగ్గట్టుగా ఆదాయం వస్తోంది. ఇందుకు ‘స్ర్తీశక్తి’ పథకమే కారణమని ప్రత్యేకించి చెప్పనవసరం లేదు. ప్రభుత్వం ఈ ఏడాది ఆగస్టు 15న స్ర్తీశక్తి పథకం ప్రారంభించింది. ఆ మరుసటిరోజు నుంచే ఓఆర్ పెరుగుతూ వచ్చింది.
రీజియన్‌లోని మధురవాడ, వాల్తేరు, మద్దిలపాలెం, విశాఖపట్నం, గాజువాక, స్టీల్ సిటీ, సింహాచలం డిపోల పరిధిలో 700 బస్సులు నడుస్తున్నాయి. స్ర్తీశక్తి పథకం అమలుకు ముందు ప్రతిరోజు సగటున 2.3 లక్షల మంది ప్రయాణించేవారు. ఆక్యుపెన్సీ రేషియో 66 శాతంగా నమోదయ్యేది. సగటున రోజువారీ ఆదాయం రూ.95 లక్షలు వచ్చేది. స్ర్తీశక్తి పథకం అమలు తరువాత రోజువారీ ప్రయాణికుల సంఖ్య 4.18 లక్షలకు పెరిగింది. ఆక్యుపెన్సీ రేషియో 96 శాతానికి, ఆదాయం రూ.1.4 కోట్లకు పెరిగాయి.
స్త్రీశక్తి ప్రయాణికులు 74 శాతం
స్త్రీశక్తి పథకం అమలుకు ముందు ఆర్టీసీ బస్సుల్లో 2.3 లక్షల మంది ప్రయాణిస్తే అందులో పురుషులు 52 శాతం ఉంటే మహిళలు 48 శాతం ఉండేవారని ఆర్టీసీ అధికారులు చెబుతున్నారు. ఇప్పుడు రోజువారీ మొత్తం ప్రయాణికుల సంఖ్య 4.18 లక్షలు ఉంది. అందులో స్త్రీశక్తి మహిళా ప్రయాణికుల సంఖ్య 3.1 లక్షలుగా నమోదయ్యింది. మొత్తం ప్రయాణికుల్లో ఇది 74 శాతం. జీరో టికెట్ ఇష్యూ ప్రకారం అధికారులు ఈ లెక్కలు తేల్చారు. స్త్రీశక్తి పథకానికి సంబంధించిన ఆర్డినరీ, పల్లెవెలుగు, ఆలా్ట్ర పల్లెవెలుగు, ఎక్స్‌ప్రెస్, మెట్రోఎక్స్‌ప్రెస్ సర్వీసులో కొన్నిమార్లు 120 శాతం వరకు ఆక్యుపెన్సీ రేషియో నమోదవుతున్నదని అధికారులు తెలిపారు. విశాఖ నుంచి శ్రీకాకుళం, పలాస, ఇచ్ఛాపురం, సోంపేట, మందస, పాతపట్నం, విజయనగరం, సాలూరు, బొబ్బిలి, రాజాం, పార్వతీపురం, రాజమండ్రి, కాకినాడ ప్రాంతాలకు రాకపోకలు సాగించే స్త్రీశక్తి బస్సులు రోజంతా వంద శాతం ఆక్యుపెన్సీ రేషియోతో నడుస్తున్నాయని రీజియన్ స్థాయి అధికారులు తెలిపారు.
అంచనాకు మించి పెరిగిన ఆదాయం
స్త్రీశక్తి పథకం అమలు తరువాత అధికారుల అంచనాకు మించి ఆదాయం పెరిగింది. పథకం అమలుకు ముందు సగటున రోజువారీ ఆదాయం రూ.95 లక్షలు వచ్చేది. పథకం అమలు తరువాత సగటున రూ.1.35 కోట్లుగా నమోదవుతున్నది. రూ.1.25 కోట్లు ఆదాయం నమోదుకాగలదని అధికారులు అంచనా వేశారు. అయితే వారి అంచనాకు మించి అధికంగా ఆదాయం నమోదవుతున్నట్టు అధికారులు వెల్లడించారు.
రోజువారీ కలెక్షన్ రూ.40 లక్షలు
ఆర్టీసీకి రోజువారీ ఆదాయం రూ.1.35 కోట్లుగా నమోదవుతున్నా, నగదు రూపంలో వచ్చేది రూ.40 లక్షలు. మిగిలిన రూ.95 లక్షలు స్త్రీశక్తి పథకం ద్వారా ప్రయాణించిన మహిళలకు సంబంధించినది. ఈ మొత్తాన్ని రాష్ట్రప్రభుత్వం ఆర్టీసీకి చెల్లించాల్సి ఉంది. ఆగస్టు 15 నుంచి అక్టోబరు నెలాఖరు వరకూ ఆర్టీసీ విశాఖ రీజియన్‌కు చెల్లించాల్సిన మొత్తంలో రూ.40 కోట్లను ప్రభుత్వం చెల్లించింది.