Share News

బీజేపీలో జోష్‌

ABN , Publish Date - Sep 15 , 2025 | 01:28 AM

భారతీయ జనతా పార్టీ నగరంలోని రైల్వే మైదానంలో ఆదివారం నిర్వహించిన ‘సారథ్యం యాత్ర’ ముగింపు సభ విజయవంతమైంది. పార్టీ రాష్ట్ర అధ్యక్షుడిగా పీవీఎన్‌ మాధవ్‌ బాధ్యతలు చేపట్టిన తరువాత రాష్ట్రంలోని 26 జిల్లాల్లో 50 రోజులపాటు యాత్ర నిర్వహించారు.

బీజేపీలో జోష్‌

రాష్ట్ర అధ్యక్షుడు మాధవ్‌ ‘సారథ్యం యాత్ర’ ముగింపు సభ సూపర్‌ సక్సెస్‌

హాజరైన జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా, ఎంపీలు, ఎమ్మెల్యేలు, ముఖ్య నేతలు

రాష్ట్రాభివృద్ధికి కేంద్రం సహకరిస్తున్నదన్న నడ్డా

గ్రామీణ ప్రజలకు పార్టీని చేరువచేయాలని మాధవ్‌ పిలుపు

గత వైసీపీ పాలనపై బీజేపీ నేతల తీవ్ర విమర్శలు

పార్టీ శ్రేణులతో కిటకిటలాడిన రైల్వే మైదానం

విశాఖపట్నం, సెప్టెంబరు 14 (ఆంధ్రజ్యోతి): భారతీయ జనతా పార్టీ నగరంలోని రైల్వే మైదానంలో ఆదివారం నిర్వహించిన ‘సారథ్యం యాత్ర’ ముగింపు సభ విజయవంతమైంది. పార్టీ రాష్ట్ర అధ్యక్షుడిగా పీవీఎన్‌ మాధవ్‌ బాధ్యతలు చేపట్టిన తరువాత రాష్ట్రంలోని 26 జిల్లాల్లో 50 రోజులపాటు యాత్ర నిర్వహించారు. పార్టీ విధానాలను ప్రజల్లోకి తీసుకెళ్లడంతోపాటు వివిధ వర్గాలతో మమేకమయ్యారు. ఈ యాత్ర ఆదివారం ముగిసింది. ఈ నేపథ్యంలో రైల్వే మైదానంలో బహిరంగసభను నిర్వహించారు. సభకు రాష్ట్రంలోని అనేక ప్రాంతాలకు చెందిన కార్యకర్తలు, నాయకులు హాజరయ్యారు. ముఖ్యఅతిథిగా బీజేపీ జాతీయ అధ్యక్షుడు జగత్‌ ప్రకాశ్‌ నడ్డా హాజరై శ్రేణులనుద్దేశించి మాట్లాడారు. దేశం, రాష్ట్రం అభివృద్ధికి ఎన్‌డీఏ ప్రభుత్వం చేపడుతున్న కార్యక్రమాలను వివరించారు. ముఖ్యంగా ఉత్తరాంధ్ర ప్రాంత అభివృద్ధి కోసం తెచ్చిన పరిశ్రమలు, ప్రాజెక్టుల గురించి వెల్లడించారు. రాష్ట్రాభివృద్ధికి ప్రధాని మోదీ నేతృత్వం లోని కేంద్ర ప్రభుత్వం చిత్తశుద్ధితో కృషిచేస్తున్నదని, ఇందుకు అవసరమైన నిధులను ఇస్తోందన్నారు. భవిష్యత్తులో మరింత చేయూత అందిస్తామని స్పష్టం చేశారు. చంద్రబాబు నేతృత్వంలో రాష్ట్రం అభివృద్ధి పథంలో దూసుకుపోయేందుకు మోదీ ఇతోథికంగా సాయపడుతున్నారన్నారు.

అభివృద్ధి పథంలో రాష్ట్రం

డబుల్‌ ఇంజన్‌ సర్కార్‌తో రాష్ట్రంలో జరుగుతున్న అభివృద్ధిని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు పీవీఎన్‌ మాధవ్‌ వివరించారు. స్టీల్‌ప్లాంట్‌ను ఆదుకునేం దుకు గతంలో వాజపేయి, ఇప్పుడు మోదీ సర్కారు అందించిన సహాయా న్ని ప్రజలు గుర్తించాలని కోరారు. సుమారు రూ.11,500 కోట్ల గ్రాంట్‌ను ప్రధాని మోదీ స్టీల్‌ప్లాంటుకు అందించి ఆదుకునేందుకు యత్నిస్తున్నారన్నారు. రాష్ట్రంలో బీజేపీని బలోపేతం చేసేందుకు కార్యకర్తలంతా కంకణ బద్ధులు కావాలని పిలుపునిచ్చారు. కేంద్ర ఉక్కు, పరిశ్రమల శాఖ సహాయ మంత్రి భూపతిరాజు శ్రీనివాసవర్మ మాట్లాడుతూ, దేశాన్ని అభివృద్ధి పథంలో నడిపించే బాధ్యత బీజేపీ తీసుకుందన్నారు. అగ్ర నాయకుల ప్రసంగాలకు పార్టీ శ్రేణుల నుంచి మంచి స్పందన వచ్చింది. అంతకుముందు పార్టీ నాయకులకు శ్రేణులు ఘనస్వాగతం పలికారు. ఓపెన్‌ టాప్‌ వాహనంపై నడ్డా, మాధవ్‌ తదితర నేతలు ర్యాలీగా వేదిక వద్దకు చేరుకున్నారు. సభా ప్రాంగణంలో ఏర్పాటు చేసిన పలు స్టాల్స్‌ను సందర్శించారు. అరకు కాఫీ, ఏటికొప్పాక బొమ్మలు, కొబ్బరిపీచుతో తయారుచేసిన వస్తువులు, పొందూరు ఖాదీ ఉత్పత్తులను పరిశీలించారు. నడ్డాతో పాటు ఇతర ప్రముఖులకు జీసీసీ అధికారులు బహుమతులను అందించారు. అనంతరం వేదికపైకి చేరుకున్న పార్టీ జాతీయ అధ్యక్షుడు నడ్డా, జాతీయ సహ సంఘటన ప్రధాన కార్యదర్శి శివప్రకాశ్‌కు రాష్ట్ర నేతలు స్వాగతం పలికారు. పార్టీ జిల్లా అధ్యక్షుడు పరశురామ రాజు ఆధ్వర్యంలో జేపీ నడ్డా, మాధవ్‌లను గజమాలతో సత్కరించారు. అంతకుముందు సభా ప్రాంగణంలో నిర్వహించిన సాంస్కృతిక కార్యక్రమాలు అలరించాయి. కార్యక్రమంలో రాష్ట్ర వైద్య, ఆరోగ్య శాఖ మంత్రి సత్యకుమార్‌ యాదవ్‌, అనకాపల్లి ఎంపీ సీఎం రమేశ్‌, ఎమ్మెల్సీ సోము వీర్రాజు, ఎమ్మెల్యేలు సుజనాచౌదరి, విష్ణుకుమార్‌ రాజు, కామినేని శ్రీనివాస్‌, నడుకుదిటి ఈశ్వరరావు, నల్లమిల్లి రామకృష్ణారెడ్డి, నియోజకవ ర్గాల ఇన్‌చార్జులు, ముఖ్య నాయకులు పాల్గొన్నారు.

భారీగా హాజరైన శ్రేణులు..

సభకు రాష్ట్రంలోని వివిధ ప్రాంతాల నుంచి బీజేపీ శ్రేణులు భారీగా తరలివచ్చారు. ఉదయం తొమ్మిది గంటల నుంచే సభా ప్రాంగణానికి రావడం మొదలుపెట్టారు. 11 గంటలకు ముఖ్య నాయకులు వేదికపైకి వచ్చారు. మధ్యాహ్నం ఒంటి గంట వరకు సభ సాగింది. వర్షం వచ్చినా ఆటంకం లేకుండా భారీ రెయిన్‌ ప్రూఫ్‌ టెంట్లు వేశారు.

నూరు శాతం హామీల అమలు

బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు పీవీఎన్‌ మాధవ్‌

విశాఖపట్నం, సెప్టెంబరు 14 (ఆంధ్రజ్యోతి):

గత ఎన్నికల్లో ఇచ్చిన హామీలను వందశాతం అమలు చేస్తున్నామని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు పీవీఎన్‌ మాధవ్‌ స్పష్టం చేశారు. సారథ్యం ముగింపు సభలో ఆయన మాట్లాడుతూ డబుల్‌ ఇంజన్‌ సర్కార్‌తో రాష్ట్రభివృద్ధికి బాటలు వేస్తున్నామన్నారు. సారథ్యం పేరుతో మలి విడత యాత్ర ప్రారంభిస్తామన్నారు. జీఎస్టీ సరళీకరణతో నిత్యావసర సరకుల ధరలు తగ్గుముఖం పడుతున్నా యన్నారు. దేశం నుంచి పేదరికం తొలగేలా కేంద్రం పథకాలు రూపొందిస్తోందన్నారు. సౌత్‌ కోస్టల్‌ రైల్వే జోన్‌ ఇచ్చి ఈ ప్రాంత ప్రజల కలను మోదీ సాకారం చేశారన్నారు. పరిశ్రమల ఏర్పాటుతో ఉపాధి అవకాశాలను కల్పించనున్నారన్నారు. వైద్య, ఆరోగ్యశాఖ మంత్రి సత్యకు మార్‌ యాదవ్‌ మాట్లాడుతూ 2047 నాటికి వికసిత్‌ భారత్‌ నినాదంతో విశ్వగురు స్థానానికి చేరుకోవడమే లక్ష్యంగా పాలన సాగుతోందన్నారు. ఐదేళ్ల వైసీపీ విధ్వం సం నుంచి బయటపడేందుకు చర్యలు చేపడుతున్నా మన్నారు. బీజేపీని సంస్థాగతంగా విస్తరించాల్సిన అవ సరం ఉందని, ఇందుకు కార్యకర్తలు బాధ్యత తీసుకోవాల న్నారు. బీజేపీ ఫ్లోర్‌లీడర్‌ విష్ణు కుమార్‌రాజు మాట్లాడు తూ ఏ రాష్ట్రానికి ఇవ్వనన్ని నిధులు రాష్ట్రానికి కేంద్రం అందిస్తోందన్నారు. 2019లో ఏపీ ప్రజలు తప్పు చేసి జగన్‌ను గెలిపించడంతో ఐదేళ్లు రాష్ట్రం సర్వనాశనమైంద న్నారు. భవిష్యత్తును బంగారంగా తీర్చిదిద్దే దిశగా ముం దుకు వెళుతున్నామన్నారు. మోదీ, చంద్రబాబు, పవన్‌ కలయికతో రాష్ట్రం వికసిత్‌ ఏపీగా రూపాంతరం చెందుతోదన్నారు.

Updated Date - Sep 15 , 2025 | 01:28 AM