మన్యంలో జొల్డ పండుగ జోష్
ABN , Publish Date - Sep 04 , 2025 | 12:36 AM
ఏజెన్సీలో గిరిజన రైతులు పలు ప్రాంతాల్లో జొల్డ పండుగను బుధవారం ఘనంగా నిర్వహించారు. దీంతో గిరి పల్లెల్లో, పంట పొలాల్లో జొల్డ పండుగ సందడి నెలకొంది. మైదాన ప్రాంతాలకు భిన్నంగా, ఇతరులకు ఆసక్తి కలిగేలా గిరిజనుల ఆచార, వ్యవహారాలు ఉంటాయి.
వరి నాట్లు పూర్తయిన తరువాత తొలి వ్యవసాయ పండుగ
తరతరాలుగా కొనసాగుతున్న ఆచారం
ఇలా చేస్తే పంట బాగుంటుందని గిరిజనుల విశ్వాసం
(పాడేరు- ఆంధ్రజ్యోతి)
ఏజెన్సీలో గిరిజన రైతులు పలు ప్రాంతాల్లో జొల్డ పండుగను బుధవారం ఘనంగా నిర్వహించారు. దీంతో గిరి పల్లెల్లో, పంట పొలాల్లో జొల్డ పండుగ సందడి నెలకొంది. మైదాన ప్రాంతాలకు భిన్నంగా, ఇతరులకు ఆసక్తి కలిగేలా గిరిజనుల ఆచార, వ్యవహారాలు ఉంటాయి. వాటిపై గిరిజనులు తరతరాలుగా విశ్వాసం ఉంచి, పాటిస్తూనే ఉంటారు. అటువంటి వ్యవహారాల్లో ఒకటిగా జొల్డ పండుగకు ప్రత్యేకత ఉంది. ఏజెన్సీలో గిరిజనులు వరి నాట్లు పూర్తయిన మూడు వారాలకు విధిగా జొల్డ పండుగను నిర్వహిస్తారు. ప్రతి గిరిజన రైతు ఈ పండుగను బుధవారం మాత్రమే నిర్వహించాలనే నిబంధన తరతరాలుగా కొనసాగుతున్నది. వరిసాగు చేసే ప్రతి రైతు నాట్లు పూర్తయిన మూడు వారాల తరువాత వచ్చే బుధవారం నాడు కచ్చితంగా జొల్డ పండుగను ఆచరిస్తారు.
’జొల్డ పండుగ’ ఇలా...
గిరిజన రైతులు వరి నాట్లు పూర్తయిన మూడు వారాల తరువాత అడవికి వె ళ్లి కస్మి, సీడి, పెద్ద జొల్డ మొక్కల కొమ్ములను తీసుకు వస్తారు. ఇంటి వద్ద లేదా గ్రామ సావిడి వద్ద కోడిని కోసి, దాని రక్తాన్ని బియ్యంలో కలిపి అక్షింతలు చేస్తారు. అలాగే అన్నంలో సైతం పసుపు, కోడి రక్తం కలుపుతారు. వాటితో అడవుల నుంచి తీసుకువచ్చిన కొమ్మలను పట్టుకుని ఇంటిల్లపాది తమ పంట పొలాలకు వెళతారు. అక్కడ దేవతలకు మొక్కిన తరువాత అడవుల నుంచి తీసుకువచ్చిన మొక్కల కొమ్మలను పంట పొలాల్లో పాతుతారు. అలాగే పూజ చేసి తీసుకువచ్చిన అక్షింతలు, అన్నం మెతుకులను సైతం పంట పొలాల్లో చల్లుతారు. ఇలా చేయడం వల్ల పంట బాగుంటుందని, లేకుంటే పంట పాడ వుతుందని గిరి రైతుల విశ్వాసం.
గిరిజన సంప్రదాయంలో శాస్ర్తీయ విధానం
వరి నాట్లు పూర్తయిన మూడు వారాల తరువాత సంప్రదాయంగా గిరిజనులు నిర్వహించే జొల్డ పండుగ వెనుక శాస్ర్తీయత దాగి ఉందని పలువురు పూర్వీకులు అంటున్నారు. ఈ సంప్రదాయ పండుగలో భాగంగా రైతులు పొలాల్లో పాతే కొమ్మలు ఔషధ మొక్కలకు చెందినవని గిరి రైతులు అంటున్నారు. ఔషధ గుణాలు కలిగిన కస్మి, సీడి, పెద్ద జొల్డ మొక్కల కొమ్మలను పంట పొలాల్లో పాతడం వల్ల, లేత వరి పైరును ఆశించాలనుకునే పలు రకాల పురుగులను ఈ కొమ్మలు ఆకర్షించి వరి పంటను కాపాడుతాయని పలువురు అంటున్నారు. అయితే సస్యరక్షణలో భాగంగా చేపట్టాల్సిన ఈ చర్యను సంప్రదాయం, ఆచారాల్లో కలిపి చేయడం వల్ల గిరిజనులు పండుగగా భావించి, విధిగా దానిని పాటిస్తారనే ఆలోచనతో పూర్వీకులు జొల్డ పండుగగా నామకరణం చేసి ఆచరిస్తున్నారని స్థానికులు చెబుతున్నారు. దానినే అడవి బిడ్డలు తరతరాలుగా కొనసాగిస్తున్నారు.
జి.మాడుగులలో..
జి.మాడుగుల: మండలంలో జొల్డ పండుగ సందడి నెలకొంది. పలు గ్రామాల్లో బుధవారం ఈ పండుగను జరుపుకున్నారు. భీరం పంచాయతీ వి.కోడాపల్లి, సింగర్భ పంచాయతీ బూరుగువీధి తదితర గ్రామాల్లో ఆ పండుగను నిర్వహించారు.