ఎంవీవీ-ఎంకే పార్క్ స్థలంపై జాయింట్ సర్వే
ABN , Publish Date - Sep 25 , 2025 | 01:15 AM
జోన్-6లోని కూర్మన్నపాలెంలో మాజీ ఎంపీ ఎంవీవీ సత్యనారాయణ బహుళ అంతస్థుల సముదాయాలు (ఎంవీవీ-ఎంకే పార్క్) నిర్మించిన స్థలాన్ని రెవెన్యూ, జిల్లా సర్వే శాఖ ఏడీతో కలిసి సంయుక్తంగా సర్వే చేయాలని జీవీఎంసీ అధికారులు నిర్ణయించారు.
జీవీఎంసీ నిర్ణయం
రెవెన్యూ, జిల్లా సర్వే శాఖలకు అధికారుల లేఖ
విశాఖపట్నం, సెప్టెంబరు 24 (ఆంధ్రజ్యోతి):
జోన్-6లోని కూర్మన్నపాలెంలో మాజీ ఎంపీ ఎంవీవీ సత్యనారాయణ బహుళ అంతస్థుల సముదాయాలు (ఎంవీవీ-ఎంకే పార్క్) నిర్మించిన స్థలాన్ని రెవెన్యూ, జిల్లా సర్వే శాఖ ఏడీతో కలిసి సంయుక్తంగా సర్వే చేయాలని జీవీఎంసీ అధికారులు నిర్ణయించారు. అపార్టుమెంటు నిర్మాణం కోసం 26.5 సెంట్లు ప్రభుత్వ భూమిని కబ్జా చేశారని 87వ వార్డు కార్పొరేటర్ బొండా జగన్... జీవీఎంసీ కమిషనర్, జిల్లా కలెక్టర్‌తోపాటు రాష్ట్ర ఐటీశాఖ మంత్రి నారా లోకేష్, సీఎం చంద్రబాబునాయుడుకి ఫిర్యాదు చేసిన విషయం తెలిసిందే. దీనిపై టౌన్‌ప్లానింగ్ అధికారులు సర్వే చేయించగా 26.5 సెంట్లు ప్రభుత్వ భూమిని ఆక్రమించినట్టు తేలింది. అయితే మరోసారి సర్వే జరపాలని జీవీఎంసీ అధికారులు భావిస్తున్నారు. కేవలం జీవీఎంసీ సర్వేయర్‌తో కాకుండా ప్రభుత్వ భూమి కబ్జాకు గురైనట్టు ఆరోపణలు ఉన్నందున రెవెన్యూశాఖ, జిల్లా సర్వే శాఖ ఏడీతో కలిసి సంయుక్తంగా సర్వే చేయాలని నిర్ణయించారు. ఈ మేరకు ఆ రెండు శాఖలకు ఇప్పటికే జీవీఎంసీ అధికారులు లేఖ రాసినట్టు సమాచారం. జాయింట్ సర్వే నివేదికను బట్టి అపార్టుమెంట్‌పై ఎలాంటి చర్యలు తీసుకోవాలనే దానిపై నిర్ణయం తీసుకుంటామని జీవీఎంసీ అధికారులు చెబుతున్నారు.