ఉద్యోగం..ఉత్సాహం
ABN , Publish Date - Aug 24 , 2025 | 01:24 AM
ఉపాధ్యాయ ఖాళీల భర్తీకి నిర్వహించిన డీఎస్సీ రాత పరీక్షా ఫలితాల వెల్లడి కావడంతో అభ్యర్థుల్లో ఆనందం వ్యక్తమవుతోంది.
డీఎస్సీ మెరిట్ జాబితాలు విడుదల
ఫలించిన నిరీక్షిణ
ఏడేళ్ల తరువాత ఉపాధ్యాయ పోస్టుల భర్తీ
నేడో, రేపో సెలక్షన్ జాబితా
ఉమ్మడి జిల్లాలో 1,139 ఖాళీలు
ఉక్కు నగరంలోని విమల విద్యాలయంలో సర్టిఫికెట్ల పరిశీలన
ఎంఈవోలు, హెచ్‌ఎంలు, డేటా ఎంట్రీ ఆపరేటర్లకు శిక్షణ
వేర్వేరు యాజమాన్యాల ఆధ్వర్యంలో పోస్టింగ్, కౌన్సెలింగ్
విశాఖపట్నం, ఆగస్టు 23 (ఆంధ్రజ్యోతి):
ఉపాధ్యాయ ఖాళీల భర్తీకి నిర్వహించిన డీఎస్సీ రాత పరీక్షా ఫలితాల వెల్లడి కావడంతో అభ్యర్థుల్లో ఆనందం వ్యక్తమవుతోంది. డీఎస్‌సీ కోసం ఏడేళ్లుగా అభ్యర్థులు నిరీక్షిస్తున్నారు. ఈ నేపథ్యంలో కూటమి ప్రభుత్వం గత ఏడాది నోటిఫికేషన్ జారీచేసింది. దీనికి సంబంధించి ఈ ఏడాది జూన్‌లో నిర్వహించిన రాతపరీక్ష ఫలితాలు శుక్రవారం రాత్రి ప్రకటించింది. ఉమ్మడి జిల్లాలో ప్రభుత్వ, జడ్పీ, ముసిసిపల్, గిరిజన సంక్షేమ, జువెనైల్ శాఖల పరిధిలో 1,139 పోస్టుల భర్తీకి సంబంధించి సబ్జెక్టుల వారీగా మెరిట్ లిస్టులు విడుదల చేసింది. వీటితోపాటు జోనల్ స్థాయిలో చేపట్టనున్న బీసీ, ఎస్సీ గురుకులాలు, మోడల్ స్కూళ్లలో టీజీటీ, పీజీటీ పోస్టులు, ప్రిన్సిపాళ్ల నియామకాల్లో ఉమ్మడి జిల్లాలో పలువురికి అవకాశం దక్కనున్నది.
ఉమ్మడి జిల్లాలో ఒకేసారి 1,139 మందికి ఉద్యోగాలు వస్తుండడంతో అభ్యర్థులు, వారి కుటుంబాల్లో ఆనందం వ్యక్తమవుతుంది. చంద్రబాబునాయుడు సీఎంగా ఉన్న సమయంలో 2018లో డీఎస్సీ నిర్వహించారని, ఆ తరువాత మళ్లీ ఇప్పుడు ఆయన హయాంలోనే పోస్టులు భర్తీ చేస్తున్నారని అభ్యర్థులు గుర్తుచేస్తున్నారు. ఒకేసారి పలు యాజమాన్యాల పరిధిలో ఖాళీలు భర్తీచేయడం చాలావరకు ఉపయోగపడిందని పలువురు వ్యాఖ్యానించారు. శుక్రవారం రాత్రి విడుదల చేసిన మెరిట్ జాబితాలో అభ్యర్థులకు వచ్చిన మార్కుల ప్రకారం ర్యాంకులు ప్రకటించారు. దాని ప్రాతిపదికగా రోస్టర్ పాయింట్లు ఉపయోగించి సెలక్షన్ జాబితా సిద్ధం చేస్తున్నారు. రోస్టర్ ఆధారంగా కటాఫ్ మార్కులు నిర్ణయించి ఆదివారం లేదా సోమవారం సెలక్షన్ జాబితా విడుదల చేయనున్నారు. సెలక్షన్ జాబితా మేరకు అభ్యర్థులకు కాల్ లెటర్స్ పంపించనున్నారు. కాల్ లెటర్ వచ్చిన అభ్యర్థులు మాత్రమే సర్టిఫికెట్ల పరిశీలనకు హాజరుకావాల్సి ఉంటుంది.
ఉమ్మడి జిల్లాలో జడ్పీ, మునిసిపల్, ప్రభుత్వ పాఠశాలలు, గిరిజన సంక్షేమ శాఖ, జువెనైల్ శాఖలలో పోస్టుల భర్తీ, జోన్ పరిధిలో గురుకులాల్లో టీజీటీ, పీజీటీ, ప్రిన్సిపాళ్ల నియామకాల కోసం అభ్యర్థుల సర్టిఫికెట్ల పరిశీలన విద్యా శాఖ పరిధిలో జరగనున్నది. విశాఖ ఉక్కు నగరంలోని విమల విద్యాలయంలో సర్టిఫికెట్ల పరిశీలన చేస్తారు. సర్టిఫికెట్ల పరిశీలనలో పాల్గొనే ఎంఈవోలు, హెచ్‌ఎంలు, డేటా ఎంట్రీ ఆపరేటర్లకు శనివారం విశాఖ విమల విద్యాలయంలో శిక్షణ ఇచ్చారు. సర్టిఫికెట్ల పరిశీలన ఎప్పుడు జరిపేది ఆదివారం ప్రకటించనున్నారు. ఏ పోస్టుకు ప్రాధాన్యం ఇస్తున్నారో దరఖాస్తు చేసే సమయంలోనే అభ్యర్థులు ఆప్షన్ ఇచ్చారు. దీని ప్రకారం సదరు అభ్యర్థికి వచ్చిన మార్కుల ప్రాతిపదికగా పోస్టులో నియమిస్తారు. ఆ తరువాత ఆయా యాజమాన్యాలు ఎంపికైన అభ్యర్థులకు పోస్టింగ్స్ ఇచ్చి కౌన్సెలింగ్ నిర్వహించనున్నట్టు పాఠశాల విద్యా శాఖ ఆర్జేడీ విజయభాస్కర్ తెలిపారు. కాగా ఉమ్మడి జిల్లాలో మెరిట్ జాబితా మేరకు ఏ ర్యాంకు వరకు పోస్టులు తీస్తారనే చర్చ అభ్యర్థుల్లో సాగుతుంది. దీనిపై రకరకాలుగా అభ్యర్థులు, నిపుణులు లెక్కలు కడుతున్నారు. అయితే ఏ ర్యాంకు వరకూ ఉద్యోగం గ్యారంటీ అనేది స్పష్టంగా చెప్పలేమని, అది పోస్టులను బట్టి ఉంటుందని విద్యా శాఖకు చెందిన ఒక అధికారి తెలిపారు. ఉదాహరణకు స్కూల్ అసిస్టెంట్ ఫిజికల్ ఎడ్యుకేషన్ కేటగిరీలో 139 పోస్టులు ఉన్నాయి. అందులో సగం రిజర్వేషన్ కు వెళతాయి. దీనిని పరిగణనలోకి తీసుకోవాలని సూచించారు. ప్రధానంగా కటాఫ్‌కు దగ్గరగా ఉన్న వారిలో మాత్రం కొంత ఉత్కంఠ ఉందని, బహుశా ఆదివారం లేదా సోమవారం పూర్తిగా స్పష్టత వస్తుందని అన్నారు.
గణితం టాపర్ విజయ్
మూడు కేటగిరీల్లోనూ అతనే
ఎస్.రాయవరం, ఆగస్టు 23 (ఆంధ్రజ్యోతి): అనకాపల్లి జిల్లా ఎస్.రాయవరం మండలం వమ్మవరం అగ్రహారం గ్రామానికి చెందిన సుంకరణం విజయ్ ట్రైన్డ్ గ్రాడ్యుయేట్ టీచర్ (టీజీటీ) కేటగిరీ...గణితంలో 87.33, పోస్ట్ గ్రాడ్యుయేట్ టీచర్ (పీజీటీ) గణితంలో 78.5, స్కూల్ అసిస్టెంట్ (ఎస్‌ఏ) గణితంలో 94.67 మార్కులు సాధించి రాష్ట్ర టాపర్‌గా నిలిచారు. విజయ్ తండ్రి నాగార్జునశర్మ ఫొటోగ్రాఫర్ కాగా, తల్లి వెంకటలక్ష్మి గృహిణి. విజయ్‌కు చిన్నతనం నుంచి టీచర్ కావాలనే కోరిక ఉండేది. పదవ తరగతి చదువుతున్నప్పటి నుంచే గ్రామంలో ట్యూషన్ చెబుతూ కుటుంబానికి చేయూతగా నిలిచేవాడు. కష్టపడి చదివి డీఎస్సీలో ప్రథమ ర్యాంకు సాధించాడు. ఈ సందర్భంగా విజయ్ మాట్లాడుతూ లక్ష్య సాధన కోసం రోజుకు 10 నుంచి 12 గంటల పాటు చదివేవాడినని తెలిపాడు. రాష్ట్ర ప్రభుత్వం డీఎస్సీ నిర్వహించడం వల్ల తన కల నెరవేరిందన్నాడు. తాను స్కూల్ అసిస్టెంట్‌గా విధులు నిర్వర్తించాలని అనుకుంటున్నట్టు తెలిపాడు.
విద్యా కుసుమం జ్యోత్స్న
చోడవరం, ఆగస్టు 23 (ఆంధ్రజ్యోతి): చోడవరానికి చెందిన కురచా జ్యోత్స్న స్కూల్ అసిస్టెంట్ కేటగిరీ...హిందీలో 86.05 మార్కులతో ఉమ్మడి విశాఖ జిల్లా మొదటి స్థానం, రాష్ట్ర స్థాయిలో మూడవ స్థానం సాధించింది. ఇక టీజీటీ విభాగంలో 88.05 మార్కులతో జోన్-1లో ప్రథమ స్థానం, రాష్ట్ర స్థాయిలో రెండవ ర్యాంక్ సాధించింది. సాధారణ వ్యవసాయ కుటుంబానికి చెందిన నారాయణమూర్తి, వెంకటలక్ష్మి దంపతులు రెండవ కుమార్తె జ్యోత్స్న. తల్లిదండ్రుల ప్రోత్సాహంతో లక్ష్యాన్ని సాధించగలిగానని తెలిపింది.