Share News

ఉద్యోగం ఇక్కడ... విధులు అక్కడ!

ABN , Publish Date - Sep 02 , 2025 | 01:13 AM

కనకమహాలక్ష్మి ఆలయానికి చెందిన ఇంజనీరింగ్‌ అధికారి డీవీఎస్‌ రామరాజు (హరి) పోస్టింగ్‌ ఇచ్చినచోట కాకుండా వేరొకచోట పనిస్తున్నారు.

ఉద్యోగం ఇక్కడ... విధులు అక్కడ!

  • ఇదీ కనకమహాలక్ష్మి ఆలయం డీఈ తీరు

  • సుదీర్ఘకాలం సింహాచలం దేవస్థానంలో విధులు

  • ఆ కారణంతోనే ఇటీవల బదిలీ

  • అయినా అప్పన్న ఆలయానికి వెళ్లిపోతున్న సదరు అధికారి

  • ప్రొటోకాల్‌, దర్శనాలలో హడావిడి

(విశాఖపట్నం-ఆంధ్రజ్యోతి)

కనకమహాలక్ష్మి ఆలయానికి చెందిన ఇంజనీరింగ్‌ అధికారి డీవీఎస్‌ రామరాజు (హరి) పోస్టింగ్‌ ఇచ్చినచోట కాకుండా వేరొకచోట పనిస్తున్నారు. ఇటీవల జరిగిన బదిలీల్లో ఆయన్ను సింహాచలం దేవస్థానం నుంచి వన్‌టౌన్‌లోని కనకమహాలక్ష్మి ఆలయానికి బదిలీ చేశారు. సుదీర్ఘకాలం సింహాచలం ఆలయంలో ఉన్నారనే కారణంతోనే మార్చారు. అయితే ఆయన ఇప్పటికీ సింహాచలంలోనే విధులు నిర్వహించడానికి ఆసక్తి చూపుతున్నారు. ఎటువంటి ఉత్తర్వులు లేకుండా వారానికి రెండు, మూడు రోజులు సింహాచలం వెళ్లి ప్రొటోకాల్‌, దర్శనాల వ్యవహారాలు చూస్తున్నారు. ఉద్యోగులు ఎక్కడకు బదిలీ అయితే అక్కడే పనిచేయాలి. ఆయన మాత్రం అందుకు ఇష్టపడడం లేదంటున్నారు. పైగా సింహాచలంలో నిత్యం ఈఓ పక్కనే ఉంటుంటారు. ప్రస్తుతం దేవదాయ శాఖ ఇన్‌చార్జి కమిషనర్‌ రామచంద్రమోహన్‌ సింహాచలంలో ఈఓగా పనిచేసినప్పటి నుంచి రామరాజుకు అది అలవాటుగా మారిందని దేవస్థానం వర్గాల సమాచారం.

దేవస్థానంలోని ట్రాన్స్‌పోర్ట్‌ విభాగంలో ఫిట్టర్‌గా రామరాజు విధుల్లో చేరారు. అక్కడి నుంచి ఎలా ఇంజనీరింగ్‌ విభాగంలోకి వచ్చారో తెలియదు గానీ ఏఈగా కొన్నాళ్లు పనిచేసి, డీఈగా పదోన్నతి పొందారు. ఆయన సర్టిఫికెట్లు సరైనవి కావని కొందరు జిల్లా కలెక్టర్‌కే నేరుగా ఫిర్యాదు చేశారు. దీనిపై శాఖాపరమైన విచారణ జరిగినా, నివేదిక బయటకు రాలేదు. ఆ తరువాత ఫిర్యాదు చేసిన వ్యక్తిని గుర్తించి దానికి వెనక్కి తీసుకునేలా చేశారనే ఆరోపణలు ఉన్నాయి. రామరాజు ఎప్పుడూ ఈఓతోనే ఉండడం, పరిపాలన, ఆలయ పర్యవేక్షణ, ప్రొటోకాల్‌ పనుల్లో తలదూర్చడం వివాదాలకు కారణమవుతోంది.

చెప్పే వెళుతున్నారు

శోభారాణి, ఈఓ, కనకమహాలక్ష్మి దేవస్థానం

డీఈ రామరాజు...కనకమహాలక్ష్మి దేవస్థానంలో పనిచేయకుండా సింహాచలం వెళ్లి పనిచేయడంపై ఈఓ శోభారాణిని ‘ఆంధ్రజ్యోతి’ వివరణ కోరగా, తనకు చెప్పే అక్కడకు వెళుతున్నారని సమాధానమిచ్చారు. అయితే దీనిపై ఎటువంటి రాతపూర్వకమైన ఉత్తర్వులు లేవని స్పష్టంచేశారు. ఇంజనీరింగ్‌ పనులు ఉన్నాయంటే అనుమతించామని చెప్పారు.

ఈఈ రమణకు అదనపు బాధ్యతలు

సింహాచలంలో చందనోత్సవ సమయంలో గోడ కూలిన తరువాత ఈఈ శ్రీనివాసరాజును సస్పెండ్‌ చేశారు. అదేరోజున డీఈ నాగేశ్వరరావు రిటైర్‌ అయ్యారు. దాంతో ప్రభుత్వం కనకమహాలక్ష్మి దేవస్థానం ఈఈ సీహెచ్‌ రమణకు సింహాచలం ఈఈగా అదనపు బాధ్యతలు ఇచ్చింది. అలాగే అన్నవరం దేవస్థానం ఈఈకి కూడా అదనపు బాధ్యతలు ఇచ్చారు. ఇద్దరు ఈఈలు అడిషనల్‌ చార్జితో పనిచేస్తుండగా అసలు ఇంజనీరింగ్‌ వ్యవహారాలే చూడని డీఈ రామరాజును సింహాచలం ఎందుకు పంపుతున్నారనేదే ప్రధాన ప్రశ్న.

Updated Date - Sep 02 , 2025 | 01:13 AM