Share News

ఆగిన జల్‌జీవన్‌ పనులు

ABN , Publish Date - Sep 12 , 2025 | 12:05 AM

ప్రతి ఇంటికీ కొళాయిల ద్వారా తాగునీటిని అందించాలనే లక్ష్యంతో కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన జల్‌జీవన్‌ మిషన్‌ పనులు జిల్లాలో ఇప్పటి వరకు మందకొడిగా సాగగా, బిల్లులు మంజూరు కాలేదని జరుగుతున్న అరకొర పనులను కూడా కాంట్రాక్టర్లు ఆపేశారు.

ఆగిన జల్‌జీవన్‌ పనులు
జి.మాడుగుల మండలం గెమ్మెలి పంచాయతీ చేమకూరపాలెంలో నిర్మించిన నీటి ట్యాంకు

పది నెలలుగా బిల్లులు మంజూరుకాకపోవడమే కారణం

ఇప్పటికే జిల్లాలో మందకొడిగా పనులు, పూర్తిగా పనులు నిలుపుదలతో మరింత వెనక్కి

గిరి పల్లెలకు సాకారం కాని ఇంటింటా కొళాయి

(పాడేరు- ఆంధ్రజ్యోతి)

ప్రతి ఇంటికీ కొళాయిల ద్వారా తాగునీటిని అందించాలనే లక్ష్యంతో కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన జల్‌జీవన్‌ మిషన్‌ పనులు జిల్లాలో ఇప్పటి వరకు మందకొడిగా సాగగా, బిల్లులు మంజూరు కాలేదని జరుగుతున్న అరకొర పనులను కూడా కాంట్రాక్టర్లు ఆపేశారు. ఇప్పటికే చేసిన ఆయా పనులకు సంబంధించిన నిధులను రాష్ట్ర ప్రభుత్వం గత పది నెలలుగా విడుదల చేయకపోవడంతో ఎక్కడికక్కడ పనులు ఆగిపోయాయి. దీంతో గ్రామాల్లో తాగునీటి సమస్యలు పరిష్కారానికి నోచుకోవడం లేదు.

జిల్లాలోని 22 మండలాల పరిధిలో 7,185 పనుల ద్వారా 2 లక్షల 64 వేల 766 ఇళ్లకు కొళాయిల ద్వారా తాగునీరు అందించేందుకు రూ.626 కోట్లు మంజూరయ్యాయి. ఆయా పనులను గత మూడేళ్లుగా గ్రామీణ నీటి సరఫరా విభాగం అధికారులు కాంట్రాక్టర్లతో చేయిస్తున్నారు. ప్రస్తుతానికి రూ.131 కోట్ల పనులు మాత్రమే జరగగా, 96 వేల ఇళ్లకు కొళాయిల ద్వారా తాగునీటిని అందించారు. అయితే జిల్లా వ్యాప్తంగా గత ఏడాదిన్నర కాలంలో రూ.26 కోట్ల విలువ చేసే 443 పనులు జరగగా, వాటికి సంబంధించి పది నెలలుగా ఎటువంటి బిల్లులు విడుదల కాలేదు. దీంతో ఆయా పనులు వివిధ దశల్లో నిలిచిపోయాయి. వాస్తవానికి విడతలుగా బిల్లులు మంజూరైతే పనులు జోరందుకుంటాయి. కానీ పరిస్థితులు అందుకు భిన్నంగా ఉండడంతో ఏడాది కాలంగా 443 పనులు పూర్తికాక సుమారు రెండు వేల కుటుంబాలకు ఇంటింటా కొళాయి ద్వారా నీళ్లు అందని దుస్థితి కొనసాగుతున్నది.

బిల్లులు విడుదల కాకపోవడంతో..

పది రోజులుగా జల్‌జీవన్‌ మిషన్‌ పనులు పూర్తిగా ఆగిపోయాయి. వాస్తవానికి పూర్తయిన పనుల వరకు రాష్ట్ర ప్రభుత్వం బిల్లులు విడుదల చేస్తే, విడతల వారీగా మిలిగిన పనులను చేపడతారు. కానీ పూర్తయిన పనులకు, జరుగుతున్న పనులకు సైతం గత పది నెలలుగా ఒక్క పైసా విడుదల చేయకపోవడంతో కాంట్రాక్టర్లు ఎక్కడికక్కడ పనులను నిలిపేశారు. అయితే ఆర్‌డబ్ల్యూఎస్‌ అధికారులు ఈ ఏడాది మార్చి నుంచి నిధులు విడుదలవుతాయని కాంట్రాక్టర్లకు ఆశ చూపిస్తూ కొన్ని పనులు చేయించారు. కానీ రోజులు, నెలలు గడుస్తున్నా నిధులు విడుదల కాకపోవడంతో పెట్టుబడులు పెట్టలేక కాంట్రాక్టర్లు సైతం చేతులెత్తేశారు. అలాగే ఈ సమస్యను రాష్ట్ర, జిల్లా స్థాయి అధికారుల దృష్టికి కాంట్రాక్టర్ల సంఘం నేతలు తీసుకువెళ్లారు.

వేసవిలో సైతం తప్పని తాగునీటి వెతలు

జల్‌జీవన్‌ మిషన్‌లో చేపడుతున్న పనులకు రాష్ట్ర ప్రభుత్వం సకాలంలో నిధులను విడుదల చేస్తే పనులు జరిగి అనేక గ్రామాలకు తాగునీటి సౌకర్యం కలిగి ఉండేది. కానీ అందుకు భిన్నంగా అరకొరగా జరిగిన పనులకే బిల్లులు విడుదలకాకపోవడంతో ఈ ఏడాది మే నాటికి పూర్తికావాల్సిన వందల సంఖ్యలో పనులు జరగలేదు. దీంతో ఆయా ప్రాంతాల్లో గిరిజనులకు తాగునీటి సమస్యలు కొనసాగుతున్నాయి. ఇప్పటికైనా రాష్ట్ర ప్రభుత్వం జల్‌జీవన్‌ మిషన్‌కు నిధులను విడుదల చేయాలని పలువురు కోరుతున్నారు.

Updated Date - Sep 12 , 2025 | 12:05 AM