Share News

నడిరోడ్డుపై జగన్‌ షో!

ABN , Publish Date - Oct 10 , 2025 | 01:23 AM

వైసీపీ అధినేత, మాజీ సీఎం వైఎస్‌ జగన్మోహన్‌రెడ్డి పర్యటన నగర వాసులకు చుక్కలు చూపించింది.

నడిరోడ్డుపై జగన్‌ షో!

  • పోలీసుల సూచనలు పట్టించుకోని మాజీ సీఎం

  • అడుగడుగునా ట్రాఫిక్‌ ఇక్కట్లు

  • ఆయన ఎప్పుడు నగరానికి వచ్చినా ఇదే పరిస్థితి

  • నాడు స్టీల్‌ప్లాంటును గాలికి వదిలేసి....నేడు మొసలికన్నీరు

  • గోపాలపట్నంలో అంబులెన్స్‌కు కూడా దారి ఇవ్వని వైసీపీ శ్రేణులు

విశాఖపట్నం, అక్టోబరు 9 (ఆంధ్రజ్యోతి):

వైసీపీ అధినేత, మాజీ సీఎం వైఎస్‌ జగన్మోహన్‌రెడ్డి పర్యటన నగర వాసులకు చుక్కలు చూపించింది. ఎయిర్‌పోర్టు నుంచి ఎన్‌ఏడీ, పెందుర్తి మీదుగా జగన్‌ కాన్వాయ్‌కు పోలీసులు అనుమతించి, షరతులు విధించినా ఎక్కడికక్కడ శ్రేణులకు అభివాదం చేసేందుకు కాన్వాయ్‌ను రోడ్డుపై నిలిపివేయడంతో వాహన రాకపోలకు తీవ్ర ఇబ్బందులు ఎదురయ్యాయి.

జగన్‌ ఎప్పుడు నగరానికి వచ్చిన ట్రాఫిక్‌ సమస్య షరామామూలే. సీఎం హోదాలో జరిపిన పర్యటనల్లో రోడ్డుకు ఇరువైపులా పరదాలు కట్టి అధికార దర్పాన్ని ప్రదర్శించేవారు. సమస్యలపై వినతులు ఇచ్చేందుకు ఎవరినీ రోడ్డుపైకి రాకుండా పోలీసులు కట్టుదిట్టంగా బందోబస్తు నిర్వహించేవారు. జగన్‌ రావడానికి కనీసం గంట ముందు నుంచే వాహన రాకపోకలను నిలిపివేసేవారు. సీఎం హోదాలో చినముషిడివాడలోని శారదాపీఠం వార్షికోత్సవానికి వచ్చినప్పుడు ఎయిర్‌పోర్టు నుంచి పెందుర్తి వరకు గంటల తరబడి రోడ్డు బ్లాక్‌ చేశారు. దీంతో ఎయిర్‌పోర్టుకు వెళ్లాల్సినవారు, నగరంలోకి రావాల్సినవారు లగేజీలతో ఈసురోమంటూ కాలినడకన వెళ్లాల్సిన పరిస్థితి ఏర్పడింది. దీనిపై పెద్దఎత్తున విమర్శలు వెల్లువెత్తినా ఆ తర్వాత పర్యటనల్లోనూ పరిస్థితిలో మార్పు రాలేదు. గురువారం అనకాపల్లి జిల్లా మాకవరపాలెం మెడికల్‌ కాలేజీని సందర్శించేందుకు నగరానికి వచ్చిన జగన్‌ పర్యటన అడుగడుగునా ట్రాఫిక్‌ ఇక్కట్లను సృష్టించింది. నగరంలో గురువారం అంతర్జాతీయ మహిళల క్రికెట్‌ వరల్డ్‌కప్‌ మ్యాచ్‌ జరుగుతుండడంతో పోలీసులు జగన్‌ రోడ్డుమార్గంలో వెళ్లేందుకు అనుమతి ఇవ్వలేదు. హెలికాప్టర్‌లో వెళ్లే అంశాన్ని పరిశీలించాలని వైసీపీ నేతలకు సూచించారు. అయినప్పటికీ రోడ్డుమార్గంలో వెళతామని భీష్మించడంతో సీపీ షరతులతో అనుమతి ఇచ్చారు.

అంతటా అధికార దర్పమే...

తాము ఇంకా అధికారంలోనే ఉన్నామన్నట్టు జగన్‌ తన పర్యటనను కొనసాగించారు. పోలీసుల షరతులను బేఖాతరు చేస్తూ ఎయిర్‌పోర్టు నుంచి రోడ్‌షో నిర్వహించారు. కాన్వాయ్‌లో పదికి మించి వాహనాలు ఉండకూడదని, బైక్‌లతో ర్యాలీ నిర్వహించకూడదని, అత్యవసర సర్వీసులకు ఇబ్బంది కలిగించకూడదని పోలీసులు స్పష్టంగా పేర్కొన్నారు. అయితే జగన్‌ పర్యటనలో అన్నింటినీ ఉల్లంఘించినా పోలీసులు కనీసం స్పందించలేదు. ఇదిలావుండగా జగన్‌ కాన్వాయ్‌ గోపాలపట్నం చేరుకునే సరికి ట్రాఫిక్‌ పూర్తిగా స్తంభించింది. అదే సమయంలో అంబులెన్స్‌ వచ్చినా వైసీపీ శ్రేణులు దారి ఇవ్వలేదు. ఇతర ప్రాంతాల నేతలు పెందుర్తి రాకుండా పోలీసులు అడ్డుకోవడంతో మాజీ ఎమ్మెల్యే అదీప్‌రాజ్‌ హడావిడి చేశారు. రోడ్డుపై బైఠాయించి అంతా తమ నియోజకవర్గ శ్రేణులేనంటూ పోలీసులతో వాగ్వాదానికి దిగి, వారిని పెందుర్తి తరలించినా పోలీసులు కిమ్మనలేదు

స్టీల్‌ప్లాంటుపై మొసలి కన్నీరు

సీఎంగా ఉన్న ఐదేళ్లు స్టీల్‌ప్లాంటు ప్రైవేటీకరణ అంశంపై స్పందించని జగన్‌ ఈ పర్యటనలో మొసలికన్నీరు కార్చడంపై విమర్శలు వెల్లువెత్తాయి. గత ఎన్నిలకు ముందు సీఎం హోదాలో జగన్‌ నగరానికి వచ్చి పీఎం పాలెంలో బస చేయగా స్టీల్‌ప్లాంటు కార్మిక సంఘాల నేతలు కలిశారు. ప్లాంటు నష్టాల్లో ఉన్నందున విద్యుత్‌ బకాయిలను మాఫీ చేయాలని కోరారు. దాంతో స్టీల్‌ప్లాంటు నష్టాల్లో ఉందా...? తెలియదే... అయినా విద్యుత్‌ చార్జీలు, పన్నులు కట్టమంటే ఎలా అవుతుంది చెప్పండి’ అంటూ ఎదురుప్రశ్నించడంతో వారంతా అవాక్కయ్యారు. స్టీల్‌ప్లాంటు ప్రైవేటీకరణను ఆపేందుకు కృషిచేయాలంటూ అదే జగన్‌కు ఇప్పుడు ఉక్కు కార్మిక సంఘాల నేతలు కాకానినగర్‌ వద్ద వినతిపత్రం ఇవ్వడం కొసమెరుపు. దీనికి ఆయన స్పందిస్తూ ‘నేను అధికారంలో ఉన్నప్పుడు...ఇప్పుడు కూడా స్టీల్‌ప్లాంటు ప్రైవేటీకరణకు వ్యతిరేకమే’ అని చెప్పడం విశేషం. ఉక్కు ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా కార్మికులు కూర్మన్నపాలెం వద్ద సంవత్సరాల తరబడి నిరశన శిబిరం నిర్వహించారు. ఆ సమయంలో సీఎంగా ఉన్న జగన్‌...ఒక్కసారి కూడా శిబిరాన్ని సందర్శించిన పాపానపోలేదు.

Updated Date - Oct 10 , 2025 | 01:23 AM