సిరుల పంట జాఫ్రా
ABN , Publish Date - Mar 11 , 2025 | 12:26 AM
జాఫ్రా(అనోటా) సాగు గిరిజన రైతులకు సిరులు కురిపిస్తోంది. స్వల్ప పెట్టుబడితో అధిక ఆదాయం తీసుకొస్తున్నది. గిరిజన ప్రాంతంలో రైతులు సాగు చేసే జాఫ్రాకు ‘ఏ’ గ్రేడ్ లభిస్తున్నట్టు శాస్త్రవేత్తల అధ్యయనంలో వెల్లడైంది.

స్వల్ప పెట్టుబడితో అధిక ఆదాయం
పోడు, మెట్ట భూముల్లో వర్షాధారంపై సాగుకు అనుకూలం
ఈ ఏడాది కిలో రూ.290 ధరకు కొనుగోలు
చింతపల్లి, మార్చి 10 (ఆంధ్రజ్యోతి): జాఫ్రా(అనోటా) సాగు గిరిజన రైతులకు సిరులు కురిపిస్తోంది. స్వల్ప పెట్టుబడితో అధిక ఆదాయం తీసుకొస్తున్నది. గిరిజన ప్రాంతంలో రైతులు సాగు చేసే జాఫ్రాకు ‘ఏ’ గ్రేడ్ లభిస్తున్నట్టు శాస్త్రవేత్తల అధ్యయనంలో వెల్లడైంది. ఔషధ గుణాలు, అధిక పోషకాలు కలిగిన జాఫ్రాకు జాతీయ, ప్రాంతీయ మార్కెట్‌లో మంచి ధర లభిస్తున్నది. ఈ ఏడాది జాఫ్రా గింజలను ప్రైవేటు వర్తకులు రికార్డు స్థాయిలో రూ.290 ధరకు కొనుగోలు చేస్తున్నారు. ఆర్గానిక్ ఉత్పత్తుల వినియోగం పెరుగుతుండడంతో రానున్న రోజుల్లో జాఫ్రాకు మంచి డిమాండ్ ఉంటుందని శాస్త్రవేత్తలు అభిప్రాయపడుతున్నారు.
దక్షిణ భారతదేశంలో జాఫ్రా(అనోటా) సాగుకు అల్లూరి సీతారామరాజు జిల్లా అత్యంత అనుకూలమని చింతపల్లి ప్రాంతీయ వ్యవసాయ పరిశోధన స్థానం, ఉద్యాన పరిశోధన స్థానం శాస్త్రవేత్తలు 26 ఏళ్ల క్రితం ప్రయోగాత్మకంగా గుర్తించారు. మెట్ట, పోడు భూముల్లో వర్షాధారంపై గంజాయికి ప్రత్యామ్నాయంగా తక్కువ పెట్టుబడితో అధిక ఆదాయం పొందేందుకు జాఫ్రా సాగు అత్యంత అనుకూలమని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. గిరిజనులు చాలా ఏళ్లగా పంట పొలాల గట్లలో జాఫ్రాను సాగు చేస్తూ అదనపు ఆదాయం పొందుతున్నారు. ఎన్నో ఔషధ గుణాలు కలిగిన జాఫ్రా మానవుల ఆరోగ్యానికి మేలుచేస్తుందని శాస్త్రవేత్తలు నిర్ధారించారు. ఆర్గానిక్ ఆహార ఉత్పత్తులకు డిమాండ్ పెరగడంతో సహజసిద్ధ రంగును అందిస్తున్న జాఫ్రా గింజలకు కూడా ఆదరణ పెరిగింది. జాఫ్రాకి ప్రాంతీయ మార్కెట్‌లో కిలోకి రూ.290 గరిష్ఠ ధర లభిస్తుండగా, అంతర్జాతీయ మార్కెట్‌లో రూ.300-340 ధర లభిస్తోంది. గిరిజన ప్రజలకు దీర్ఘకాల ఆదాయం సమకూర్చడంతో పాటు మానవుల ఆరోగ్యానికి మేలుచేసే జాఫ్రా సాగు విస్తీర్ణం పెంపొందించేందుకు శాస్త్రవేత్తలు, అధికారులు కృషి చేస్తున్నారు.
స్వల్ప పెట్టుబడి.. అధిక ఆదాయం
జాఫ్రా మొక్కలు నాటిన మూడో ఏట నుంచి కాపుకొస్తాయి. మొదటి ఏడాది మొక్కలు, గోతులు తీయడం, ఎరువులు, పొలం చుట్టూ కంచె వేయడానికి ఎకరానికి రూ.12 వేల వరకూ ఖర్చు అవుతుంది. రెండు, మూడు సంవత్సరాల్లో ఎరువుల కోసం మూడు, నాలుగు వేల రూపాయల ఖర్చు అవుతుంది. నాలుగో ఏడాది నుంచి కాపుకొస్తాయి. నాలుగు, ఐదు సంవత్సరాల్లో కాపు కొద్దిగానే వుంటుంది. ఆరో ఏట నుంచి దిగుబడి బాగా పెరుగుతుంది. గరిష్ఠంగా 18 ఏళ్లకు పైగా పంట దిగుబడి వస్తుంది. ఏటా ప్రతి మొక్క నుంచి రెండు కిలోల వరకు జాఫ్రా దిగుబడి వస్తుంది. ఖర్చులు పోనూ ఏటా ఎకరానికి నికరంగా రూ.2.5 లక్షల ఆదాయం వస్తుంది.
జాఫ్రాలో ఔషధ గుణాలు
జాఫ్రాలో అత్యధిక ఔషధ గుణాలు, పోషక విలువలున్నట్టు నిపుణుల అధ్యయనంలో తేలింది. జాఫ్రా గింజల రంగుల్లో వ్యాధి నిరోధక శక్తిని పెంపొందించే కెరోటినాయిడ్లు అధికంగా వున్నాయి. ఆయుర్వేద వైద్యంలో ఈ చెట్టు బెరడును గనేరియా వ్యాధి నివారణకు, విత్తనాల గుజ్జును బంకవిరేచనాలను అరికట్టేందుకు, ఆకులను పాముకాటు విషం విరుగుడుకు, పచ్చకామెర్ల వ్యాధి నివారణకు ఉపయోగిస్తున్నారు. అలాగే జాఫ్రా ఉపయోగించడం వల్ల క్యాన్సర్ సోకే ప్రమాదం లేదని వైద్యనిపుణులు ధ్రువీకరించడంతో ప్రపంచ వ్యాప్తంగా జాఫ్రా వినియోగం పెరిగింది.