వానొచ్చె.. వరదొచ్చె!
ABN , Publish Date - Oct 13 , 2025 | 11:18 PM
మన్యంలో సోమవారం కుండపోతగా వర్షం కురిసింది. ఏజెన్సీ వ్యాప్తంగా ఉదయం నుంచే వాతావరణం మారిపోయి ఉరుములతో కూడిన భారీ వర్షం మొదలైంది.
మన్యంలో భారీ వర్షం
లోతట్టు ప్రాంతాలు, రహదారులు జలమయం
నీట మునిగిన పొలాలు
జన జీవనానికి అంతరాయం
పాడేరు, అక్టోబరు 13 (ఆంధ్రజ్యోతి): మన్యంలో సోమవారం కుండపోతగా వర్షం కురిసింది. ఏజెన్సీ వ్యాప్తంగా ఉదయం నుంచే వాతావరణం మారిపోయి ఉరుములతో కూడిన భారీ వర్షం మొదలైంది. జిల్లా కేంద్రం పాడేరుతో పాటు ఏజెన్సీ వ్యాప్తంగా ఒక మోస్తరు నుంచి భారీ వర్షం కురిసింది. దీంతో రోడ్లన్నీ జలమయమయ్యాయి. గెడ్డలు, వాగులు ఉధృతంగా ప్రవహించాయి. జన జీవనానికి తీవ్ర అంతరాయం ఏర్పడింది.
ఏజెన్సీలో వర్షాలు కురుస్తుండడంతో గెడ్డలు ఉధృతంగా ప్రవహిస్తున్నాయి. దీంతో ముంపు ప్రమాదం ఉందని పాడేరు డివిజన్ వాసులు, చింతూరు డివిజన్ వాసులు ఆందోళన చెందుతున్నారు. ఈ ప్రాంతంలో కురిసే భారీ వర్షాలతో ఆయా ప్రాంతాల్లోని గెడ్డలు ఉధృతం కాగా, అక్కడి నుంచి వరద నీరు చింతూరు డివిజన్ పరిధిలో ఉన్న గోదావరి, శబరి నదుల్లోకి చేరుతోంది. దీంతో ఆయా ప్రాంతాల్లోని గ్రామాలు ముంపునకు గురవుతాయని ప్రజలు ఆందోళన చెందుతున్నారు.
అరకులోయలో...
అరకులోయ: అరకులోయతో పాటు పరిసర ప్రాంతాల్లో సోమవారం తెల్లవారుజాము నుంచి సాయంత్రం దఫదఫాలు గా వర్షం కురుస్తూనే ఉంది. దీంతో జన జీవనానికి అంతరాయం ఏర్పడింది. రహదారులు చిత్తడిగా మారాయి.
డుంబ్రిగుడలో..
డుంబ్రిగుడ: మండలంలోని పరిసర ప్రాంతాల్లో సోమవారం ఉదయం చినుకులతో వర్షం మొదలై ఆ తరువాత భారీ వర్షం కురిసింది. దీంతో ప్రధాన రహదారులు, లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి. విద్యుత్ సరఫరాకు తీవ్ర అంతరాయం ఏర్పడింది.
ముంచంగిపుట్టులో..
ముంచంగిపుట్టు: మండల పరిధిలో సోమవారం ఉదయం నుంచి మధ్యాహ్నం వరకు భారీ వర్షం కురిసింది. పలు చోట్ల వాగులు, గెడ్డలు వరద నీటితో ఉధృతంగా ప్రవహించాయి. మట్టి రహదారులు అత్యంత అధ్వానంగా తయారయ్యాయి. వాహనచోదకులు ఇబ్బందులు పడ్డారు.
వారపు సంతకు వర్షం దెబ్బ
అనంతగిరి: మండల కేంద్రంలో సోమవారం జరిగే వారపు సంతకు వర్షం దెబ్బతగిలింది. ఉదయం నుంచి సాయంత్రం వరకు ఏకధాటిగా కురిసిన భారీ వర్షం కారణంగా వారపు సంతకు కొనుగోలుదారులు రాకపోవడంతో వ్యాపారులు నిరాశ చెందారు. ఉదయం నుంచే సంత వెలవెలబోగా, మధ్యాహ్నం లోపే సంత నుంచి వ్యాపారులు వెనుదిరిగారు. వర్షానికి ఎక్కడికక్కడ నీరు నిలిచిపోయి, రోడ్డంతా అధ్వానంగా మారింది.
సీలేరు, ధారకొండలో..
సీలేరు: జీకేవీధి మండలం సీలేరు, ధారకొండలో సోమవారం రెండు గంటల పాటు భారీ వర్షం కురిసింది. దీంతో సీలేరు, ధారకొండలో ప్రధాన రహదారులు జలమయమయ్యాయి. లోతట్టు ప్రాంతాలు నీట మునిగాయి. ధారకొండ ఎంపీపీ పాఠశాలలోకి వరద నీరు రావడంతో విద్యార్థులు ఇబ్బంది పడ్డారు. ధారకొండలో రామాలయం దిగువన రహదారి కూడా జలమయం కావడంతో వాహనచోదకులకు అవస్థలు తప్పలేదు.
కొయ్యూరులో..
కొయ్యూరు: మండలంలోని బూదరాళ్ల పంచాయతీ పరిధిలో సోమవారం ఉదయం భారీ వర్షం కురిసింది. దీంతో పంచాయతీ పరిధిలోని పోకలపాలెం, చీడిపల్లి, గిరిజనపల్లి, కొండపడ, కునుకూరు, తదితర గ్రామాల్లో వరి పొలాలు నీట మునిగాయి. సోమవారం ఉదయం 10 గంటల వరకు ఎండ కాయగా, ఆ తరువాత ఒక్కసారిగా వాతావరణం మారిపోయి ఈదురు గాలులతో కూడిన వర్షం మొదలైంది. మధ్యాహ్నం రెండు గంటల పాటు ఏకధాటిగా వర్షం కురిసింది.