వానపోయి.. దుమ్ము వచ్చే..
ABN , Publish Date - Nov 15 , 2025 | 01:14 AM
వడ్డాది- పాడేరు ఆర్‌అండ్‌బీ రహదారిపై మండల పరిధిలో వర్షాకాలమంతా పంట కుంటలను తలపించిన గోతులతో ఇబ్బంది పడిన వాహనదారులు, ప్రయాణికులు.. ఇప్పుడు దుమ్ము, ధూళితో అవస్థలు పడుతున్నారు. బుచ్చెయ్యపేట మండలం వడ్డాది నుంచి మాడుగుల మండలం తాటిపర్తి వరకు సుమారు 14 కిలోమీటర్ల మేర పలుచోట్ల రహదారి గోతులతో అధ్వానంగా తయారైంది. వర్షం కురిస్తే నీరు నిలిచిపోయి చెరువులను తలపించేవి. వాహనదారులు ఇక్కట్లు వర్ణనాతీతం.
రాళ్లు, కంకర తేలిన వడ్డాది- పాడేరు రోడ్డు
లారీలు, బస్సులు వెళుతున్నప్పుడు పెద్ద ఎత్తున ఎగిసిపడుతున్న దుమ్ము, ధూళి
తీవ్ర ఇబ్బంది పడున్న ద్విచక్ర వాహనదారులు, ఆటో ప్రయాణికులు
మాడుగుల రూరల్, నవంబరు 14 (ఆంధ్రజ్యోతి): వడ్డాది- పాడేరు ఆర్‌అండ్‌బీ రహదారిపై మండల పరిధిలో వర్షాకాలమంతా పంట కుంటలను తలపించిన గోతులతో ఇబ్బంది పడిన వాహనదారులు, ప్రయాణికులు.. ఇప్పుడు దుమ్ము, ధూళితో అవస్థలు పడుతున్నారు. బుచ్చెయ్యపేట మండలం వడ్డాది నుంచి మాడుగుల మండలం తాటిపర్తి వరకు సుమారు 14 కిలోమీటర్ల మేర పలుచోట్ల రహదారి గోతులతో అధ్వానంగా తయారైంది. వర్షం కురిస్తే నీరు నిలిచిపోయి చెరువులను తలపించేవి. వాహనదారులు ఇక్కట్లు వర్ణనాతీతం. అల్లూరి సీతారామరాజు జిల్లా పాడేరు, పెదబయలు, ముంచంగిపుట్టు, హుకుంపేట, జి.మాడుగుల మండలాల ప్రజలు చోడవరం, అనకాపల్లి, విశాఖపట్నానికి, అదేవిధంగా మైదాన ప్రాంతం నుంచి పాడేరు, చుట్టుపక్కల మండలాలకు వెళ్లే వారు ఈ మార్గంలోనే ప్రయాణిస్తుంటారు. రోడ్డు దారుణంగా వుండడంతో వడ్డాది నుంచి తాటిపర్తి వరకు ప్రయాణించడానికి 45 నిమిషాల నుంచి గంట సమయం పడుతున్నది. వర్షాకాలం ముగియడంతో వాహనదారులకు మరో రకమైన సమస్య ఎదురైంది. సుమారు రెండు వారాల నుంచి వర్షాలు పడకపోవడంతో వాహనాలు వెళుతున్నప్పుడు పెద్ద ఎత్తున దుమ్ము, ధూళి ఎగిసిపడుతున్నది. దీంతో ద్విచక్ర వాహనాలు, ఆటోల్లో ప్రయాణిస్తున్న వారి కళ్లల్లో దుమ్ము పడి ఇబ్బంది పడుతున్నారు. ద్విచక్ర వాహనదారులు ప్రమాదాలకు గురవుతున్నారు.
వడ్డాది- తాటిపర్తి మధ్య రహదారి విస్తరణ, అభివృద్ధి పనులను గత ప్రభుత్వ హయాంలో చేపట్టారు. ఇరువైపులా మీటరు చొప్పున వెడల్పు చేయడంతోపాటు రహదారి బాగా దెబ్బతిన్న ముకుందపురం, కేజేపురం, ఎం.కోటపాడు, డి.సురవరం, సాగరం, ఎం.కోడూరు, కాశీపురం గ్రామాల వద్ద పాత రోడ్డును పూర్తిగా తొలగించారు. ఆయా ప్రదేశాల్లో సిమెంట్ వెట్ మిక్సర్ వేసి రోలింగ్‌చేశారు. అనంతరం దీనిపై బీటీ రోడ్డు వేయకుండా వదిలేశారు. ఈ ఏడాది ఆగస్టు నుంచి అక్టోబరు వరకు అధిక వర్షాలు పడడంతో సిమెంట్ వెట్‌మిక్చర్ పాడైపోయి కంకర, రాళ్లు పైకితేలాయి. రోడ్డంతా పొడిగా ఉండడంతో వాహనాలు వెళుతున్నప్పుడు దుమ్ము, ధూళి ఎగసిపడి ఇవరై మీటర్ల దూరంలో దాటితే కనిపించని పరిస్థితి నెలకొంది. కంకర, రాళ్లు రోడ్డుపై చెల్లాచెదురుగా పడివుండడంతో ద్విచక్ర వాహనాలు, ఆటోలు వంటి చిన్నపాటి వాహనాల టైర్లు దెబ్బతింటున్నాయి. మరోవైపు రోడ్డుకు ఇరువైపులా వున్న ఇళ్లల్లోకి దుమ్ము, ధూళి చొరబడుతున్నది. ఆర్‌అండ్‌బీ అధికారులు వెంటనే స్పందించి, రోడ్డుపై తేలిన కంకర, రాళ్లను రోలింగ్ చేయించడంతోపాటు దుమ్ము, ధూళి ఎగిసిపడకుండా తరచూ నీటిని చల్లించాలని వాహనదారులు, రహదారికి ఇరువైపులా వున్న గ్రామాల ప్రజలు విజ్ఞప్తి చేస్తున్నారు.