Share News

అంతర్జాతీయ ఎయిర్‌ కార్గో లేనట్టే!!

ABN , Publish Date - Oct 17 , 2025 | 01:20 AM

విశాఖపట్నం విమానాశ్రయం నుంచి అంతర్జాతీయ కార్గో (సరకు) రవాణా ఇక లేనట్టే. ఐదు విమానాలు ఉన్నప్పుడు అవకాశం కల్పించాల్సిందిగా కోరడం జరిగింది.

అంతర్జాతీయ ఎయిర్‌ కార్గో లేనట్టే!!

పారిశ్రామిక వేత్తల నుంచి ఎప్పటినుంచో డిమాండ్‌

ఇప్పటికీ కార్యరూపం దాల్చని వైనం

భోగాపురం విమానాశ్రయం అందుబాటులోకి వస్తే విశాఖ నుంచి నిలిచిపోనున్న పౌర విమానాల రాకపోకలు

పలాసలో కార్గో విమానాశ్రయం నిర్మాణానికి భూసేకరణ

(విశాఖపట్నం-ఆంధ్రజ్యోతి)

విశాఖపట్నం విమానాశ్రయం నుంచి అంతర్జాతీయ కార్గో (సరకు) రవాణా ఇక లేనట్టే. ఐదు విమానాలు ఉన్నప్పుడు అవకాశం కల్పించాల్సిందిగా కోరడం జరిగింది. ఇప్పుడు వాటి సంఖ్య రెండుకు పడిపోయింది. కొద్ది నెలల్లో విమానాశ్రయం కూడా మూతపడనున్నది.

నగరానికి 45 కి.మీ. దూరాన భోగాపురంలో అంతర్జాతీయ విమానాశ్రయం శరవేగంతో పనులు పూర్తి చేసుకుంటోంది. వచ్చే జూన్‌ నాటికి పూర్తవుతుందని, సెప్టెంబరు నుంచి విమానాల రాకపోకలు మొదలవుతాయని రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు ప్రకటించారు. ఆ విమానాశ్రయం మొదలైతే విశాఖపట్నంలో విమానాశ్రయంలో పౌర విమానాల రాకపోకలు ఆపేస్తారు. ఈ విమానాశ్రయాన్ని ఇకపై పూర్తి నేవీ అవసరాలకే ఉపయోగించుకుంటారు. ఈ నేపథ్యంలో విశాఖపట్నం విమానాశ్రయం నుంచి అంతర్జాతీయ సరకు రవాణా అనేది కలగానే మిగిలిపోనుంది.

కేంద్ర మంత్రి ఆదేశించినా...

కేంద్ర పౌర విమానయాన శాఖా మంత్రి రామ్మోహన్‌నాయుడు ఈ ప్రాంతానికి చెందినవారే. దగ్గుబాటి పురందేశ్వరి విశాఖ ఎంపీగా ఉన్నప్పుడు విశాఖ విమానాశ్రయం నుంచి అంతర్జాతీయ సరకు రవాణాకు అనేక ప్రయత్నాలు చేశారు. అవసరమైన సిబ్బందిని మంజూరు చేయించారు. ఆ తరువాత ఎంపీగా వచ్చిన కంభంపాటి హరిబాబు డ్రగ్‌ కంట్రోల్‌ అథారిటీని నియమించారు. ప్రస్తుత ఎంపీ శ్రీభరత్‌ కూడా మంత్రి రామ్మోహన్‌నాయుడితో మాట్లాడించి తగిన ఆదేశాలు ఇప్పించారు. అన్ని చేసినా ఒక్క టన్ను కూడా ఇతర దేశాలకు వెళ్లలేదు. పంపించే సరకు భద్రంగా గమ్యం చేరడానికి కస్టోడియన్‌ బాధ్యత తీసుకునేవారు ఎవరూ ముందుకు రాలేదు. అదొక కారణమైతే విశాఖ నుంచి విదేశాలకు వెళ్లే విమానాల సంఖ్య క్రమంగా పడిపోవడం మరో కారణం. ఇక్కడి నుంచి గతంలో సింగపూర్‌, మలేషియా, బ్యాంకాక్‌, శ్రీలంక, దుబాయ్‌లకు విమానాలు నడిచేవి. ఈ ఏడాది మే నుంచి మలేషియా, బ్యాంకాక్‌ సర్వీసులు ఆగిపోయాయి. కరోనా సమయంలో ఆగిపోయిన దుబాయ్‌, శ్రీలంక విమానాలను తరువాత పునరుద్ధరించలేదు. ఇప్పుడు సింగపూర్‌తో పాటు అబుదాబీకి ఇండిగో నడుపుతున్న విమానాలే మిగిలాయి. రెండు నెలల క్రితం విశాఖ ఎంపీ నిర్వహించిన సమావేశంలో అంతర్జాతీయ సరకు రవాణా గురించి ప్రశ్నిస్తే...అంత పెద్దమొత్తంలో ఏమీ లేదని అధికారులు తేల్చి పడేశారు. ఇంకో ఎనిమిది నెలల్లో పౌర విమానాలు ఆగిపోయే తరుణంలో ప్రారంభించడం దండగ అనే అభిప్రాయం అధికారుల్లో ఉంది.

పలాసలో కార్గో విమానాశ్రయం

విశాఖపట్నంలో రెండు పోర్టులు ఉన్నాయి. విశాఖపట్నం స్టీల్‌ ప్లాంటు ఉంది. మందులు తయారీచేసి విదేశాలకు పంపే ఫార్మా కంపెనీలు వందల సంఖ్యలో ఉన్నాయి. విశాఖపట్నం నుంచి రొయ్యలు, టూనా చేపలు పంపించే సీఫుడ్‌ ఎక్స్‌పోర్టర్లు ఉన్నాయి. విదేశాలకు రెడీమేడ్‌ దుస్తులు పంపించే బ్రాండిక్స్‌ కర్మాగారం ఉంది. ఇలాంటిచోట సరకులు పంపడానికి ప్రత్యేక విమానాశ్రయం నిర్మించాల్సి ఉండగా...ఒక్కరోజు కూడా ఆ ప్రతిపాదన చేయలేదు. ఎగుమతిదారులు సిద్ధంగా ఉన్నా విమానాల్లో పంపడానికి అవకాశం ఇవ్వలేదు. ఇప్పుడు విశాఖ నుంచి 195 కి.మీ. దూరానున్న పలాసలో ప్రత్యేకంగా కార్గో విమానాశ్రయం నిర్మించాలని ప్రతిపాదించారు. భూ సర్వేకు రాష్ట్ర ప్రభుత్వం నిధులు విడుదల చేసింది. భూముల సేకరణకు ఇటీవల ప్రజాభిప్రాయ సేకరణ కూడా నిర్వహించారు. స్థానిక రైతులు వ్యతిరేకించారు. పలాసకు సరైన బస్టాండ్‌ లేదు గానీ విమానాశ్రయం కడతారా?...అంటూ చాలా మంది ప్రశ్నించారు. పలాసలో కార్గో విమానాశ్రయం వస్తే జీడిపప్పును నేరుగా విదేశాలకు ఎగుమతి చేసుకోవచ్చునని, ఇంకా మరిన్ని కంపెనీలు వస్తాయని కేంద్ర మంత్రి రామ్మోహన్‌నాయుడు వారికి నచ్చజెప్పే ప్రయత్నం చేశారు. విస్తృత అవకాశాలున్న విశాఖపట్నాన్ని కాదని పలాసలో పెట్టడంపై పారిశ్రామిక వర్గాలు పెదవి విరుస్తున్నాయి.

Updated Date - Oct 17 , 2025 | 01:22 AM