Share News

చలికి గజగజ

ABN , Publish Date - Dec 14 , 2025 | 12:41 AM

చలికి నగర ప్రజలు గజగజ వణుకుతున్నారు. ఉత్తరాది నుంచి గాలులు వీస్తుండడంతో పది రోజుల నుంచి చలి తీవ్రత రోజురోజుకూ పెరుగుతోంది.

చలికి గజగజ

పది రోజుల నుంచి రోజురోజుకూ పెరుగుతున్న వైనం

శివారు ప్రాంతాల్లో మరింత అధికం

పెందుర్తి సమీపాన గల అక్కిరెడ్డిపాలెంలో 12.7 డిగ్రీలు

వర్షాలు లేనిపక్షంలో ఫిబ్రవరి వరకూ ఇదే పరిస్థితి

విశాఖపట్నం, డిసెంబరు 13 (ఆంధ్రజ్యోతి):

చలికి నగర ప్రజలు గజగజ వణుకుతున్నారు. ఉత్తరాది నుంచి గాలులు వీస్తుండడంతో పది రోజుల నుంచి చలి తీవ్రత రోజురోజుకూ పెరుగుతోంది. పొరుగునున్న ఒడిశా, ఛత్తీస్‌గఢ్‌ రాష్ర్టాల్లో అతి శీతల వాతావరణం నెలకొంది. దానికి ఆనుకుని ఉన్న ఏజెన్సీ ప్రాంతాల్లో చలి ప్రభావం ఎక్కువగా ఉంది. అటు నుంచి గాలులు నగరంపైకి వీస్తుండంతో ఐదారు సంవత్సరాల తరువాత ఈ ఏడాది చలి పెరిగింది. తెల్లవారుజాము సమయానికి మరింత ఎక్కువవుతుంది. మంచు కూడా దట్టంగా కురుస్తోంది. నగరం కంటే శివారునున్న పెందుర్తి పరిసరాలు, మధురవాడ, ఆనందపురం, గాజువాక, దువ్వాడ ప్రాంతాల్లో చలి ప్రభావం మరింత ఎక్కువగా ఉంది. ఈ ప్రాంతాల్లో నివసించే వారంతా సాయంత్రం నాలుగు గంటల నుంచి వణుకుతున్నారు. తెల్లవారుజామున బయటకు రావాలంటే వెనుకంజ వేస్తున్నారు. శనివారం పెందుర్తి సమీపాన గల అక్కిరెడ్డిపాలెంలో 12.7 డిగ్రీల కనిష్ఠ ఉష్ణోగ్రత నమోదైంది. గాజువాకలో 14.7, ఆనందపురంలో 15, ఎయిర్‌పోర్టులో 16.2 డిగ్రీలు నమోదైంది. ఈ ఏడాది చలి తీవ్రత అధికంగా ఉందని వాతావరణ నిపుణుడొకరు తెలిపారు. తూర్పుగాలుల ప్రభావంతో వర్షాలు కురిస్తే చలి స్వల్పంగా తగ్గుతుందని, లేకపోతే ఫిబ్రవరి వరకూ ఇదే ఉధృతి కొనసాగుతుందని పేర్కొన్నారు.

Updated Date - Dec 14 , 2025 | 12:46 AM