బాబోయ్ చలి
ABN , Publish Date - Dec 16 , 2025 | 12:17 AM
మన్యంలో కనిష్ఠ ఉష్ణోగ్రతలు కొనసాగుతుండడంతో చలి సైతం అదే స్థాయిలో ప్రభావం చూపుతున్నది.
ముంచంగిపుట్టులో 7.3 డిగ్రీలు
పాడేరు, డిసెంబరు 15(ఆంధ్రజ్యోతి): మన్యంలో కనిష్ఠ ఉష్ణోగ్రతలు కొనసాగుతుండడంతో చలి సైతం అదే స్థాయిలో ప్రభావం చూపుతున్నది. దీంతో ఏజెన్సీ వాసులు గజగజ వణుకుతున్నారు. గత వారం రోజులుగా ఏజెన్సీలో సింగిల్ డిజిట్‌లో ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. రాత్రి, పగలు సైతం చలి ప్రభావం చూపుతుండగా మధ్యాహ్నం ఒక మోస్తరుగా ఎండకాస్తున్నది. ప్రస్తుత శీతల వాతావరణంతో సాధారణ జన జీవనానికి అంతరాయంగా మారింది. పాడేరుతో సహా అన్ని ప్రాంతాల్లోనూ సోమవారం ఉదయం తొమ్మిదిన్నర గంటల వరకు పొగమంచు దట్టంగా కమ్మేసింది.
ఉష్ణోగ్రతలు ఇలా..
సోమవారం ముంచంగిపుట్టులో 7.3 డిగ్రీల కనిష్ఠ ఉష్ణోగ్రత నమోదైంది. అలాగే అరకులోయలో 8.9, జి.మాడుగులలో 9.2, పెదబయలులో 9.6, హుకుంపేటలో 9.9, డుంబ్రిగుడలో 10.3, చింతపల్లిలో 10.6, పాడేరులో 10.8, కొయ్యూరులో 13.2 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి.
అరకులోయలో..
అరకులోయ: మండలంలో గత కొద్ది రోజులుగా కనిష్ఠ ఉష్ణోగ్రతలు సింగిల్ డిజిట్‌లో నమోదవుతున్నాయి. సోమవారం వేకువజాము నుంచి ఉదయం 9 గంటల వరకు పొగమంచు దట్టంగా కురిసింది. దీంతో ఎదురెదురుగా వచ్చే వాహనాలు కనిపించని పరిస్థితి నెలకొంది. వాహనాలు హెడ్‌లైట్ల వెలుతురులో రాకపోకలు సాగించాయి. అయితే ఈ చలి వాతావరణాన్ని పర్యాటకులు ఎంజాయ్ చేస్తున్నారు.
జి.మాడుగులలో..
జి.మాడుగుల: మండలంలో చలి తీవ్రత ఎక్కువగా ఉంది. సోమవారం ఉదయం 9 గంటల వరకు పొగమంచు దట్టంగా కురిసింది. వీధుల్లో ఎక్కడ చూసినా చలి మంటలే కనిపించాయి.