టీచర్లకూ పరీక్షే!
ABN , Publish Date - Aug 18 , 2025 | 12:32 AM
ఈనెల 11 నుంచి 14 వరకు నిర్వహించిన ఫార్మేటివ్ అసెస్‌మెంట్ (ఎఫ్‌ఏ)-1 పరీక్షలలో పాఠశాల విద్యాశాఖ చేసిన ప్రయోగాలపై తీవ్ర విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.
ఎఫ్‌ఏ-1లో తార్కిక ఆలోచనతో కూడిన ప్రశ్నలు
ఒకటి నుంచి ఎనిమిది తరగతుల విద్యార్థుల్లో అయోమయం
జవాబులు రాయలేక అపసోపాలు
విద్యార్థులతో పాఠశాల విద్యాశాఖ ఆటలు
విశాఖపట్నం, ఆగస్టు 17 (ఆంధ్రజ్యోతి):
ఈనెల 11 నుంచి 14 వరకు నిర్వహించిన ఫార్మేటివ్ అసెస్‌మెంట్ (ఎఫ్‌ఏ)-1 పరీక్షలలో పాఠశాల విద్యాశాఖ చేసిన ప్రయోగాలపై తీవ్ర విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. కొందరు ఉన్నతాధికారుల అనాలోచిత ఆలోచనతో రూపొందించిన ప్రశ్నపత్రాలకు అనుగుణంగా జవాబులు రాయడంతో విద్యార్థులు తెల్లమొహాలు వేశారు. జవాబుపత్రాలను మూల్యాంకనం చేసే టీచర్లకు కూడా చాలా వరకు ప్రశ్నలు అర్థంకాకపోవడంతో తలలు పట్టుకుంటున్నారు.
పరీక్షలంటే రెండు ఠావుల తెల్లకాగితాలపై జవాబులు రాసే విధానానికి స్వస్తిపలికి, బుక్‌లెట్లు ముద్రించి ఏడాది పొడవునా అన్ని పరీక్షలు అందులోనే రాసుకునేందుకు విద్యాశాఖ వీలు కల్పించింది. దీంతో టీచర్లంతా సంతోషించారు. ఏడాదిపాటు విద్యార్థి సామర్థ్యం అంచనా వేయడానికి ఇది ప్రామాణికంగా నిలుస్తుందని భావించారు. అయితే ప్రశ్నపత్రాలను పూర్తిగా మార్చేయడంతో ముఖ్యంగా ఒకటోతరగతి నుంచి ఎనిమిదోతరగతి వరకు విద్యార్థులు జవాబులు రాయడానికి ఇబ్బందిపడ్డారు. గత పాలకులు ప్రపంచ బ్యాంకుతో కుదుర్చుకున్న ఒప్పందం (సాల్ట్ ప్రొగ్రామ్) మేరకు విద్యాసంవత్సరంలో ఎఫ్‌ఏ-1,3, ఎస్‌ఏ-1 ప్రశ్నపత్రాలు రూపకల్పన బాధ్యత ప్రైవేటు రంగానికి చెందిన ప్రథమ అనే సంస్థకు అప్పగించారు.
సిలబస్‌ను కాదని...
ఇప్పటి వరకు ప్రభుత్వ పాఠశాలల్లో టీచర్లంతా సిలబస్ మేరకు పాఠాలు బోధించి, అందులోంచే ప్రశ్నపత్రం రూపొందిచేవారు. అయితే విద్యార్థుల్లో సామర్థ్య స్థాయి పెంచేదిశగా బోధన, పరీక్షల నిర్వహణ ఉంటుందని ప్రపంచబ్యాంకుతో కుదిరిన ఒప్పందంపై ప్రభుత్వం సంతకాలు చేసింది. దీనికి అనుగుణంగా ఈనెల 11 నుంచి 14వరకు జరిగిన ఎఫ్‌ఏ-1 పరీక్షల్లో బోధనకు అనుగుణంగా కాకుండా తార్కిక విధానం, అనువర్తిత (అప్లికేషన్ మెథడ్) విధానంలో ప్రశ్నపత్రాలు రూపొందించింది. తార్కిక, అనువర్తిత విధానంలోని ప్రశ్నలు కావడంతో విద్యార్థులు జవాబులు రాయలేకపోయారని టీచర్లు వ్యాఖ్యానించారు. జవాబుపత్రాల మూల్యాంకనం చేసే వారికే కొన్ని ప్రశ్నలు అర్థంకాలేదు. మూల్యాంకనంచేసే ముందు గతంలో బోధించే పాఠాలను ఒకటికి రెండుసార్లు చదువుకోవాల్సి వచ్చిందని, గత 20 ఏళ్లుగా పదోతరగతి పబ్లిక్ పరీక్షలకు ప్రశ్నపత్రాలు తయారుచేసే సీనియర్ టీచర్ ఒకరు వ్యాఖ్యానించారు. తొమ్మిది, పదోతరగతి విద్యార్థులకు ఇచ్చే ప్రశ్నపత్రాలు యథావిధిగా ఉన్నాయని, ఒకటి నుంచి ఎనిమిదోతరగతి విద్యార్థులకు ఇచ్చే ప్రశ్నపత్రాలతోనే తంటా వచ్చిందని మరో టీచర్ అభిప్రాయపడ్డారు. ముఖ్యంగా ఒకటోతరగతిలో చేరే పిల్లలు ఇప్పుడిప్పుడే పాఠశాలలకు అలవాటుపడుతున్నారు. కొందరు ఆంగ్లం, తెలుగు అక్షరాలు గుర్తుపట్టడంలేదు. వారికి ఇంగ్లీష్‌లో పేరాగ్రాఫ్ ఇచ్చి దానికి ఇంగ్లీష్‌లోనే జవాబులు రాయాలని ప్రశ్నపత్రం ఇచ్చారు. మూడోతరగతి విద్యార్థులకు తెలుగులో పుస్తక సమీక్షచేసి దానిని విశ్లేషణ చేయాలి.. అప్పుడే మార్కులు వేయాలని నిబంధన పెట్టారు. మూడో తరగతి ఆంగ్ల పరీక్షకు నాలుగో తరగతిలోని పాఠాల నుంచి ప్రశ్నలు ఇచ్చారు. గత విధానాన్ని మార్చి బుక్‌లెట్‌లు సరఫరా చేయడంతో వాటిని మూల్యాంకనం చేసేందుకు టీచర్లు అష్టకష్టాలు పడుతున్నారు. ఈ నేపథ్యంలో గోనె సంచుల్లో వాటిని కట్టలుగా కట్టి, ఇంటికి తీసుకువెళ్లి పని పూర్తిచేయాల్సిన పరిస్థితి నెలకొంది.
అనాలోచిత నిర్ణయాలు
ప్రశ్నపత్రాలు రూపొందించే ముందు విద్యార్థుల ప్రతిభ, సామర్థ్యం అంచనావేయకపోవడంపై విమర్శలు వ్యక్తమవుతున్నాయి. ఎస్‌సీఈఆర్టీ విభాగం నిర్వాకంతోనే ఎఫ్‌ఎ పరీక్షలు విమర్శలకు తావిచ్చిందని టీచర్లు వ్యాఖ్యానిస్తున్నారు. గత ప్రభుత్వాన్ని తప్పుదోవ పట్టించిన అధికారులు చాలా వరకు పాఠశాల విద్యాశాఖలో తిష్ఠ వేసి చక్రం తిప్పుతున్నారని, వారి ప్రయోగాలతో కూటమి ప్రభుత్వాన్ని ఇరకాటంలో పెడుతున్నారని విమర్శించారు. ‘హోటల్ యజమాని మారినా, వంటవాడు అక్కడే ఉండడంతో మంచి వంటకం’ ఎలా సాధ్యమని వ్యంగ్యంగా ప్రశ్నిస్తున్నారు.
డిగ్రీ ప్రవేశాలకు ఎదురుచూపులు
ఆగస్టు మూడో వారమైనా విడుదల కాని షెడ్యూల్
గత ఏడాది జూలైలోనే షెడ్యూల్ విడుదల
ఈ ఏడాది ఇప్పటికీ పట్టించుకోని విద్యాశాఖ
ఇప్పటికే ప్రత్యామ్నాయ కోర్సుల వైపు లువురి దృష్టి
అడ్మిషన్లు తగ్గుతాయని కాలేజీ యాజమాన్యాల ఆందోళన
విశాఖపట్నం, ఆగస్టు 17 (ఆంధ్రజ్యోతి):
డిగ్రీ కోర్సుల్లో ప్రవేశాల కోసం వేలాది మంది ఎదురుచూస్తున్నారు. ఇంటర్మీడియట్ ఫలితాలు వెలువడి మూడు నెలలు దాటుతున్నా ఉన్నత విద్యా శాఖ ఇప్పటి వరకూ డిగ్రీ అడ్మిషన్‌లకు సంబంధించిన షెడ్యూల్‌ను విడుదల చేయలేదు. సాధారణంగా ఇంటర్ ఫలితాలు వెలువడిన నెల రోజుల్లో షెడ్యూల్‌ను విడుదల చేస్తుం టారు. ఈ ఏడాది మాత్రం ఇప్పటికీ విడుదల కాకపోవ డంతో అడ్మిషన్స్‌పై ప్రభావం పడుతుందని కాలేజీల యాజమాన్యాలు ఆందోళన వ్యక్తంచేస్తున్నాయి.
డిగ్రీలో చేరుతున్న విద్యార్థుల సంఖ్య గత కొన్నాళ్లుగా తగ్గుతోంది. ప్రవేశాల ప్రక్రియ ఆలస్యమైతే మరింత తగ్గే అవకాశం ఉందన్న ఆందోళన యాజమాన్యాల్లో వ్యక్తమవు తోంది. కరోనా తరువాత డిగ్రీతోపాటు ఇతర ఉన్నత విద్యా కోర్సుల్లో ప్రవేశాల ప్రక్రియ ఆలస్యమవుతోంది. గత ఏడాది కూటమి ప్రభుత్వం ప్రత్యేకంగా దృష్టిసారించి ఇంజనీరింగ్, డిగ్రీ వంటి కోర్సుల్లో ప్రవేశాల షెడ్యూల్‌ను వేగంగా విడుదల చేసింది. కానీ, ఈ ఏడాది ఆగసు మూడో వారం వచ్చినప్పటికీ షెడ్యూల్ విడుదల కాలేదు. దీనికి ఇద్దరు ఉన్నతాధికారుల మధ్య నెలకొన్న విభేదాలే కారణంగా చెబుతున్నారు.
నూతన విద్యా విధానంలో భాగంగా డిగ్రీలో సింగిల్ మేజర్, డబుల్ మేజర్ సబ్జెక్టులను తీసుకురావాలని ప్రభుత్వం భావించింది. అయితే, ఉన్నత విద్యాశాఖలో పనిచేసే ఇద్దరు ఉన్నతాధికారుల్లో ఒకరు సింగిల్ మేజర్ సబ్జెక్టు తీసుకురావాలని, మరో అధికారి డబుల్ మేజర్ సబ్జెక్టులు తీసుకురావాలని పట్టుబడడంతో షెడ్యూల్ విడుదల కావడంలో జాప్యం ఏర్పడింది. ఎట్టకేలకు సింగిల్ మేజర్ సబ్జెక్టును తీసుకురావాలన్న నిర్ణయానికి వచ్చినట్టు తెలుస్తోంది. దీనిపై స్పష్టత రావడంతో కొద్దిరో జుల్లో షెడ్యూల్ వెలువడే అవకాశం ఉందని చెబుతున్నారు.
30 వేల మంది నిరీక్షణ
ఆంధ్ర విశ్వవిద్యాలయం పరిధిలో సుమారు 191 డిగ్రీ కాలేజీలున్నాయి. వీటిలో ఏటా 30 నుంచి 35 వేల మంది వివిధ కోర్సుల్లో చేరుతుంటారు. వైసీపీ ప్రభుత్వ హయాంలో కొన్నిసార్లు జాప్యం జరిగినప్పుడు అడ్మిషన్లు 28 వేలకు పడిపోయాయి. గత ఏడాది వేగంగా నిర్వహించడంతో సుమారు 33 వేల మంది డిగ్రీ కోర్సుల్లో చేరారు. ఈ ఏడాది ప్రక్రియ ఆలస్యం కావడంతో అడ్మిషన్లపై ప్రభావం పడుతుందని యాజమాన్యాలు అంటున్నాయి.
ఇంజనీరింగ్‌కు డిమాండ్
విద్యార్థులు, వారి తల్లిదండ్రులు ఇంజనీరింగ్ కోర్సుల వైపు ఆసక్తి చూపించడం డిగ్రీ కోర్సుల్లో ప్రవేశాలు తగ్గుముఖం పట్టడానికి ప్రధాన కారణంగా భావిస్తున్నారు. గ్రామీణ ప్రాంత విద్యార్థులు మాత్రమే డిగ్రీ కోర్సుల వైపు ఆసక్తి చూపిస్తున్నారు. ఇంజనీరింగ్ కాలేజీలకు ఇష్టం వచ్చినట్టు సెక్షన్స్ పెంచుకునేందుకు అనుమతిం చడం, డిగ్రీ అడ్మిషన్స్‌కు సకాలంలో షెడ్యూల్ విడుదల చేయకపోవడం, డిగ్రీ తరువాత పీజీ కోర్సులు చేసేందుకు ప్రభుత్వం ఫీజు రీయింబర్స్‌మెంట్‌ను వర్తింపజేయకపో వడం వంటి కారణాలతో డిగ్రీ కోర్సులకు డిమాండ్ తగ్గుతోందని కళాశాలల యాజమాన్యాలు చెబుతున్నాయి. కర్ణుడి చావుకు వంద కారణాలన్న చందంగా. .డిగ్రీ కాలేజీలు అంపశయ్యపైకి చేరుకునేందుకు అనేక అంశాలు దోహదం చేస్తున్నాయని ఎంవీపీ కాలనీలోని ఒక కాలేజీ ప్రిన్సిపాల్ నిట్టూర్చారు.