ఐటీడీఏ పీవో శ్రీపూజ విస్తృత పర్యటన
ABN , Publish Date - Sep 21 , 2025 | 12:06 AM
ఐటీడీఏ పీవో టి.శ్రీపూజ శనివారం విస్తృతంగా పర్యటించారు. ఐటీడీఏ నిర్వహణలో ఉన్న పర్యాటక ప్రాంతాలు, కాటేజీలను ఐటీడీఏ ఏపీవో వెంకటేశ్వరరావుతో కలిసి పరిశీలించారు.
పర్యాటక ప్రాంతాలు, కాటేజీల పరిశీలన
పద్మాపురం గార్డెన్‌లో హాట్ ఎయిర్ బెలూన్ ప్రారంభం
అరకులోయ, సెప్టెంబరు 20 (ఆంధ్రజ్యోతి): ఐటీడీఏ పీవో టి.శ్రీపూజ శనివారం విస్తృతంగా పర్యటించారు. ఐటీడీఏ నిర్వహణలో ఉన్న పర్యాటక ప్రాంతాలు, కాటేజీలను ఐటీడీఏ ఏపీవో వెంకటేశ్వరరావుతో కలిసి పరిశీలించారు. ముందుగా పెదలబుడు ఎకో టూరిజం కాటేజీలను, పక్కనే ఉన్న గిరి గ్రామదర్శినిని పరిశీలించారు. గ్రామ దర్శిని ప్రాముఖ్యతను ఆమెకు పెదలబుడు సర్పంచ్ పెట్టెలి దాసుబాబు వివరించారు. గిరిజనులు చేసుకునే పండుగలను గ్రామ దర్శినిలో నిర్వహిస్తే పర్యాటకులు అధిక సంఖ్యలో వచ్చే అవకాశం ఉంటుందని, తద్వారా నిరుద్యోగ యువతకు ఉపాధి దొరుకుతుందని అధికారులకు ఆమె సూచించారు. అనంతరం అరకులోయ పట్టణంలోని గిరిజన మ్యూజియం, గిరిజన బజార్, కాఫీ హౌస్‌ను ఆమె సందర్శించారు. కాఫీ హౌస్‌లో కాఫీ ఫ్లేవర్ ఉన్న ఐస్‌క్రీమ్‌ను రుచి చూశారు. మంచిగా పర్యాటకులకు అరకుకాఫీతో పాటు ఐస్‌క్రీమ్‌లు రుచులు చూపించాలన్నారు. పద్మాపురం గార్డెన్‌ను సందర్శించారు. గార్డెన్ విశిష్టతను మేనేజర్ బొంజిబాబు వివరించారు. గార్డెన్‌లో హాట్ ఎయిర్ బెలూన్‌ను పీవో ప్రారంభించారు. అధికారులతో కలిసి హాట్ ఎయిర్ బెలూన్‌లో కొంతసేపు ప్రయాణించారు. చాలా అద్భుతంగా ఉందని, పర్యాటకులకు హాట్ ఎయిర్ బెలూన్ ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తుందన్నారు. ఆమె తిరుగు ప్రయాణంలో కొర్రాయి గ్రామం వద్ద నాలుగు లారీల్లో అక్రమంగా తరలిస్తున్న 117 పశువులను పట్టుకుని డుంబ్రిగుడ తహశీల్దార్‌కు, ఎస్‌ఐకు అప్పగించారు.
గిరిజన మహిళ వేషధారణలో..
గిరి గ్రామదర్శినిని సందర్శించిన ఐటీడీఏ పీవో శ్రీపూజ గిరిజన మహిళ వేషధారణతో అందరినీ అలరించారు. గిరిజన మహిళ వేషధారణతో పాటు వారి ఆచార వ్యవహారాల్లో పాల్గొనడం ఆనందంగా ఉందని, ఇది తీపి గుర్తుగా మిగిలిపోతుందని ఆమె ఆనందం వ్యక్తం చేశారు.