ఐటీ సేవలు మరింత విస్తృతం
ABN , Publish Date - Sep 23 , 2025 | 01:30 AM
ఆంధ్రప్రదేశ్‌లో ఐటీ సేవలు మరింత విస్తృతం చేస్తామని, పరిపాలన సంస్కరణలు అమలు చేస్తామని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పేర్కొన్నారు.
పాలనలో సంస్కరణలు అమలుచేస్తాం
ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు
ఈ-గవర్నెన్స్ సదస్సులో పాల్గొన్న అనంతరం కేంద్ర అధికారులతో భేటీ
ఆర్‌టీజీఎస్ అమలు, ఇంకా తీసుకోవలసిన చర్యలపై చర్చ
విశాఖపట్నం, సెప్టెంబరు 22 (ఆంధ్రజ్యోతి):
ఆంధ్రప్రదేశ్‌లో ఐటీ సేవలు మరింత విస్తృతం చేస్తామని, పరిపాలన సంస్కరణలు అమలు చేస్తామని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పేర్కొన్నారు. నోవాటెల్ హోటల్‌లో సోమవారం ప్రారంభమైన 28వ జాతీయ ఈ-గవర్నెన్స్ సదస్సులో పాల్గొన్న ఆయన ఆ తరువాత కేంద్ర కార్యదర్శులు, వివిధ రాష్ట్రాల ఉన్నతాధికారులతో ప్రత్యేకంగా భేటీ అయ్యారు. పరిపాలనా సంస్కరణల్లో వినూత్న విధానాలు అనుసరిస్తున్న రాష్ట్రాలకు ఈ సదస్సులో కేంద్ర మంత్రి జితేంద్రసింగ్ అవార్డులు ఇచ్చిన విషయాన్ని ప్రస్తావిస్తూ, ఏపీలో ఆర్‌టీజీఎస్ అమలు చేస్తున్నామని, అందులో లోపాలు, ఇంకా తీసుకోవలసిన చర్యలు ఏమైనా సూచించాలని వారిని కోరారు. ఆయా రాష్ట్రాల్లో అనుసరిస్తున్న విధానాలు, వాటిని ఏపీలో అమలు చేయడానికి గల అవకాశాలపై చర్చించారు. విజయవంతమైన మోడళ్లను ఏపీలో ప్రవేశపెడతామని, వాటికి సంబంఽధించిన అంశాలను విజయవాడకు వచ్చి తమకు వివరించాలని కోరారు. రాష్ట్రంలో చేపడుతున్న వివిధ ప్రాజెక్టులు వివరించి సూచనలు కోరారు.
ఆపరేషన్ లంగ్స్‌పై చర్చ
ఈ సమావేశంలో పాల్గొన్న విశాఖపట్నం ఎంపీ శ్రీభరత్ నగరంలో రహదారులను ఆక్రమించి వ్యాపారాలు నిర్వహిస్తున్న వారిని తొలగించామని, ఆపరేషన్ లంగ్స్ పేరుతో నిర్వహించిన ఈ కార్యక్రమాన్ని చాలామంది హర్షిస్తున్నారని ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు దృష్టికి తీసుకువెళ్లారు. మంచి పనులు చేసేటపుడు కొన్ని ఇబ్బందులు వస్తాయని, వాటిని అధిగమించాలని సీఎం సూచించారు. నష్టపోయిన వారికి ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చూడాలని, ఆక్రమణలు తొలగించిన స్థానంలో మళ్లీ వ్యాపారాలు చేయకుండా బాధ్యత తీసుకోవాలని సీఎం ఆదేశించారు. ఆయా ప్రాంతాల్లో పనిచేసే టౌన్‌ప్లానింగ్ సిబ్బందిని ఈ ఆక్రమణల పట్ల అప్రమత్తం చేయాలని చెప్పారు. వీటిని ఎవరు ప్రోత్సహించవద్దని, సిబ్బంది సహకరిస్తే వారిపై కఠిన చర్యలు తీసుకోవాలన్నారు. ప్రజా ప్రతినిధులు ఇలాంటి అంశాల జోలికి పోకుండా తాను సూచనలు చేస్తానని హామీ ఇచ్చారు.