నిధుల సమాచారం ఇవ్వకపోవడం తప్పే..
ABN , Publish Date - Jul 14 , 2025 | 12:34 AM
కేంద్ర ప్రభుత్వం మంజూరు చేసిన 15వ ఆర్థిక సంఘం నిధులను మండలాలకు కేటాయించే సమాచారం జడ్పీటీసీ సభ్యులకు ఎప్పటికప్పుడు చెప్పకపోవడం పొరపాటేనని జిల్లా పరిషత్తు చైర్‌పర్సన్ జల్లిపల్లి సుభద్ర అంగీకరించారు.
బిల్లుల పెండింగ్‌తో జడ్పీటీసీ సభుల్లో కొంత అసంతృప్తి
ఆర్థిక సంఘం నిధుల గురించి సమావేశంలో కాకుండా నేరుగా అడిగితే బాగుండేది
ఇకపై ఒకేరోజు సాధారణ, స్టాండింగ్ సమావేశాలను నిర్వహించం
తనపై అవిశ్వాసం పెడతారన్నది అవాస్తవం
జిల్లా పరిషత్ చైర్‌పర్సన్ జల్లిపల్లి సుభద్ర
విశాఖపట్నం, జూలై 13 (ఆంధ్రజ్యోతి):
కేంద్ర ప్రభుత్వం మంజూరు చేసిన 15వ ఆర్థిక సంఘం నిధులను మండలాలకు కేటాయించే సమాచారం జడ్పీటీసీ సభ్యులకు ఎప్పటికప్పుడు చెప్పకపోవడం పొరపాటేనని జిల్లా పరిషత్తు చైర్‌పర్సన్ జల్లిపల్లి సుభద్ర అంగీకరించారు. అలాగే సాధారణ నిధులతో చేపట్టిన పనులకు సుమారు రూ.8 కోట్ల వరకు వరకు బిల్లులు పెండింగ్‌లో ఉండడంతో జడ్పీటీసీ సభ్యుల్లో కొంతవరకు అసంతృప్తి నెలకొందన్నారు. అంతకుమించి జడ్పీటీసీ సభ్యుల మధ్య భేదాభిప్రాయాలు లేవని ఆమె స్పష్టం చేశారు. ఆదివారం తన బంగ్లాలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో సుభద్ర మాట్లాడుతూ తనకు, జడ్పీటీసీ సభ్యులకు మధ్య వివాదం పట్ల కొందరు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారని, 20 మంది వరకు సభ్యులు తనను వ్యతిరేకిస్తున్నారంటూ వస్తున్న ప్రచారంలో వాస్తవం లేదన్నారు. అయితే జడ్పీకి సంబంధించి నిధుల కేటాయింపు, ఇతర అంశాలపై సభ్యులకు సమాచారం ఇవ్వడంలో కొంత గ్యాప్ చోటుచేసుకుందన్నారు.
ఏటా ఆర్థిక సంఘం నిధుల నుంచి ప్రతి జడ్పీటీసీ సభ్యులు, ఎమ్మెల్యేలకు రూ.20 లక్షల నిధులను కేటాయిస్తున్నామన్నారు. అయితే ఇంకా మిగిలిన నిధులు మండలాల్లో పలు అభివృద్ధి పనులకు కేటాయించేటప్పుడు సంబంధిత మండల జడ్పీటీసీ సభ్యులకు సమాచారం ఇవ్వని విషయం వాస్తవమేన్నారు. దీనిపై సభ్యులు జడ్పీ సమావేశంలో కాకుండా తనను కలిసినప్పుడు అడిగితే బాగుండేదని అభిప్రాయపడ్డారు. జడ్పీ సాధారణ సమావేశం, స్టాండింగ్ కమిటీ సమావేశం ఒకేరోజు ఏర్పాటు చేయడంపై కొందరు సభ్యులు వ్యతిరేకించారని, ఈ కారణంతోనే ఈ నెల 9న జరిగిన రెండు సమావేశాలను బాయ్‌కాట్ చేస్తున్నట్టు సభ్యులు తనకు ముందే చెప్పారన్నారు. భవిష్యత్తులో ఇక రెండు సమావేశాలు ఒకేరోజు నిర్వహించబోమని సుభద్ర స్పష్టం చేశారు. తనపై అవిశ్వాసం ప్రవేశపెడతారన్న వస్తున్న వదంతుల్లో వాస్తవం లేదన్నారు. గత ఏడాది మార్చి నుంచి ఇప్పటివరకు సాధారణ నిధులతో చేపట్టిన పనులకు సంబంధించి బిల్లులు సీఎఫ్‌ఎంఎస్‌లో పెండింగ్‌లో ఉన్నాయని, ఇదికూడా సభ్యుల్లో అసంతృప్తికి ఒక కారణమన్నారు. జడ్పీటీసీ సభ్యులు, ఎంపీపీలు, ఎంపీటీసీలు, సర్పంచ్‌లకు 16 నెలలుగా గౌరవ వేతనాలు బకాయి ఉందని తెలిపారు.