ఉత్పత్తి పెంచకుంటే మనుగడ కష్టం
ABN , Publish Date - Nov 29 , 2025 | 01:11 AM
స్టీల్‌ప్లాంటులో రోజుకు 19 వేల టన్నుల హాట్ మెటల్ ఉత్పత్తి తీస్తేనే మనుగడ ఉంటుందని, లేదంటే కష్టమని ఉక్కు మంత్రిత్వ శాఖ జాయింట్ సెక్రటరీలు శుక్రవారం స్పష్టంచేశారు.
రోజుకు 19 వేల టన్నుల హాట్ మెటల్ ఉత్పత్తి చేయాలి
సామర్థ్యం 92.5 శాతానికి పెరగాలి
బ్యాంకుల రుణాలతో పెరిగిన వడ్డీల భారం
ప్రతి నెలా రూ.100 కోట్ల లాభాలు రావలసిందే
ఇకపై కేంద్రం సాయం చేయడం కష్టం
ఉక్కు ఉద్యోగుల సమావేశంలో మంత్రిత్వ శాఖ
జాయింట్ సెక్రటరీల ప్రకటన
విశాఖపట్నం, నవంబరు 28 (ఆంధ్రజ్యోతి):
స్టీల్‌ప్లాంటులో రోజుకు 19 వేల టన్నుల హాట్ మెటల్ ఉత్పత్తి తీస్తేనే మనుగడ ఉంటుందని, లేదంటే కష్టమని ఉక్కు మంత్రిత్వ శాఖ జాయింట్ సెక్రటరీలు శుక్రవారం స్పష్టంచేశారు. ఢిల్లీ నుంచి జాయింట్ సెక్రటరీలు అభిజిత్ చక్రవర్తి, దయానిధన్ పాండేలు రాగా సీఎండీ ఏకే సక్సేనా దశల వారీగా ఉద్యోగులకు నాలుగు సమావేశాలు నిర్వహించారు. ఈ సందర్భంగా వారు ప్లాంటు పరిస్థితులపై పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇచ్చారు. బ్యాంకుల నుంచి రుణాలు భారీగా తీసుకున్నందున వడ్డీల భారం పెరిగిందని, ప్లాంటు ఉత్పత్తి సామర్థ్యం 92.5 శాతానికి చేరితేనే ఆర్థిక ఫలితాలు బాగుంటాయని వెల్లడించారు. లాభాలు పెంచాలని, ఇవి ప్రతి నెలా రూ.100 కోట్లు ఉంటేనే రుణాలకు తిరిగి చెల్లింపులు చేయగలుగుతామన్నారు. ప్లాంటులో ఉత్పత్తి స్థిరంగా ఉండాలని, కన్వేయర్ బెల్ట్‌ల బ్రేక్ డౌన్‌లు లేకుండా చూడాలని సూచించారు. ఆపరేషన్లలో ఇబ్బందులు లేకుండా ఉద్యోగులే బాధ్యత తీసుకోవాలన్నారు. బ్లాస్ట్ ఫర్నేస్‌లకు కోక్ సమస్య ఉందని అంగీకరించారు. అమ్మకాలు కూడా పెంచాలని, అన్ని విభాగాల్లో వ్యయాలు తగ్గించాలని సూచించారు. ఇకపై కేంద్రం నిధులు ఇచ్చే అవకాశం లేదని, ఉత్పత్తి లక్ష్యాలు సాధించకపోతే కష్టాలు తప్పవని పరోక్షంగా హెచ్చరించారు.
కన్వేయర్ బెల్ట్‌ల నిర్వాకం ఉద్యోగులదేనని సీపీకి ఫిర్యాదు
నవంబరు నెలలో కన్వేయర్ బెల్ట్‌లు మూడుసార్లు తెగిపోయాయి. దీనివల్ల ఉత్పత్తి తగ్గిపోయింది. ఉద్యోగులే కావాలని బెల్ట్‌ను కోసేస్తున్నారంటూ యాజమాన్యం పోలీస్ కమిషనర్‌కు ఫిర్యాదు చేసింది. దాంతో ఆయన శుక్రవారం ప్లాంటుకు వచ్చి అన్నీ పరిశీలించారు. అధికారులతో సమావేశమయ్యారు. ఈ సందర్భంగా ఓ మహిళా అధికారిణి మాట్లాడుతూ స్టీల్ ప్లాంటు ఉద్యోగులు ఇలాంటి తప్పుడు పనులు చేయరని, నిర్వహణ లేకే అవి తెగిపోతున్నాయని వివరించారు. యాజమాన్యం మాత్రం ఎన్నడూ లేనిది ఇప్పుడే ఎందుకు తెగుతున్నాయని వాదించింది. కాంట్రాక్టు కార్మికులను వేల సంఖ్యలో తగ్గించేసి, నిర్వహణకు నిధులు ఇవ్వడం ఆపేస్తే ఏ యంత్రాలైనా ఇలాగే అవుతాయని అధికార వర్గాలు వాదిస్తున్నాయి. ఈ సందర్భంగా జరిగిన చర్చలో అధికారుల సంఘం నాయకుడు ఒకరు బ్లాస్ట్ ఫర్నేస్‌ల సమస్యను ప్రస్తావించగా, ఇప్పుడు దానిపై చర్చ వద్దని, కేవలం కన్వేయర్ బెల్డ్‌లపైనే మాట్లాడాలంటూ సమావేశాన్ని ముగించి జాయింట్ సెక్రటరీలు వెళ్లిపోయారు. వారు వచ్చిన విషయం స్థానిక ఎంపీకి కూడా సమాచారం లేదని, యాజమాన్య ప్రతినిధులు ఉద్యోగులను దోషులుగా చిత్రీకరిస్తున్నారని, ఈ విధానం మానుకోవాలని వారు డిమాండ్ చేస్తున్నారు. అవసరమైన ముడి పదార్థాలు ఇవ్వకుండా 92.5 శాతం యుటిలైజేషన్ ఏ విధంగా సాధ్యమవుతుందో యాజమాన్యమే చెప్పాలని డిమాండ్ చేస్తున్నారు.