విస్తరణలో ఐటీ కంపెనీలు
ABN , Publish Date - Dec 20 , 2025 | 01:36 AM
విశాఖపట్నం ఐటీ హబ్‌గా మారుతోంది. ఇప్పటివరకూ పెద్ద కంపెనీలు ఏమీ లేకపోవడంతో విశాఖపట్నం టేకాఫ్ కాలేదనే వాదన వినిపించేది.
ఇంకా కొత్తవి కూడా రాక
ప్లగ్ అండ్ ప్లే సౌకర్యం కలిగిన భవనాల కొరత
ఐటీ కంపెనీలకు ఉపయోగపడేలా భవనాలు నిర్మింపజేయాలని
అధికారులను కోరుతున్న పరిశ్రమ వర్గాలు
(విశాఖపట్నం-ఆంధ్రజ్యోతి)
విశాఖపట్నం ఐటీ హబ్‌గా మారుతోంది. ఇప్పటివరకూ పెద్ద కంపెనీలు ఏమీ లేకపోవడంతో విశాఖపట్నం టేకాఫ్ కాలేదనే వాదన వినిపించేది. కూటమి ప్రభుత్వం వచ్చాక ఆ మాటకు తావు లేకుండా చేసింది. ప్రపంచ ప్రసిద్ధి గాంచిన గూగుల్‌నే విశాఖపట్నం రప్పించింది. అతి పెద్ద హైపర్ స్కేల్ డేటా సెంటర్ ఏర్పాటు చేయబోతోంది. సిఫీ, అదానీ, రిలయన్స్ సంస్థలు కూడా డేటా సెంటర్ల నిర్మాణానికి ముందుకు వచ్చాయి.
ఇక ఐటీ రంగంలో కాగ్నిజెంట్ వారం రోజుల క్రితమే కార్యకలాపాలు ప్రారంభించింది. టీసీఎస్ సంక్రాంతి తరువాత ప్రారంభం కానుంది. కాండ్యుయెంట్ ఆరేళ్ల క్రితమే వచ్చింది. పెద్ద పెద్ద కంపెనీలు విశాఖలో ఏర్పాటుకావడంతో చిన్న కంపెనీలు కూడా విశాఖ వైపు చూస్తున్నాయి. అదేవిధంగా ఇప్పటికే విశాఖలో ఉన్న కంపెనీలు విస్తరణకు వెళుతున్నాయి. అయితే వీటికి అవసరమైన భవనాలు అందుబాటులో లేకపోవడం గమనార్హం. ప్రభుత్వం పెద్ద కంపెనీలకు భూములు కేటాయిస్తోంది. శాశ్వత క్యాంపస్‌ల నిర్మాణానికి సమయం పడుతుందని తాత్కాలిక అవసరాలకు వేరే భవనాలు తానే సూచిస్తోంది. అయితే చిన్న కంపెనీలకు ఆ వెసులుబాటు లేదు. విశాఖపట్నంలో ఐటీకి అవసరమైన భవనాల కొరత తీవ్రంగా ఉంది.
ఎందుకంటే..
ఐటీ సంస్థలకు అన్నిరకాల భవనాలు నప్పవు. బిల్డింగ్ ఎత్తు, లోపల మౌలిక వసతుల విషయంలో ప్రతి సంస్థ కొన్ని నిబంధనలు పెట్టుకొని అమలు చేస్తున్నాయి. వాటికి కనీసం సీలింగ్ 11 అడుగుల ఎత్తున్న భవనాలు కావు. నగరంలో అలాంటి భవనాలు చాలా తక్కువగా ఉన్నాయి. వీఎంఆర్‌డీఏ సిరిపురం జంక్షన్‌లో నిర్మించిన ‘ది డెక్’ మొత్తం ఐటీ కంపెనీలకు కేటాయించాలని ఏపీ ఐటీ అసోసియేషన్ ప్రతినిధులు ఆ సంస్థతో సంప్రతింపులు జరిపారు. ముందు అంగీకరించినా ఆ తరువాత ప్రభుత్వం టాటా ఇన్నోవేషన్ హబ్, దక్షిణ కోస్తా రైల్వే జోన్ కార్యాలయానికి అందులో అవకాశం ఇవ్వాలని సూచించడంతో ఐటీ కంపెనీలకు అవకాశం రాలేదు. ఈ విషయం తెలిసి నగరంలోని మర్రిపాలెంలో బొత్స స్క్వేర్, ఎండాడలో పనోరమ హిల్స్ ఎదురుగా మాజీ రాజ్యసభ సభ్యుడు విజయసాయిరెడ్డి నిర్మించిన భవనాలను ఐటీకి ఇస్తామని ముందుకు వచ్చారు. దీనిపై చర్చలు జరుగుతున్నాయి. ఇవి కాకుండా ఇంకా మరికొన్ని భవనాలు అవసరమని ఐటీ వర్గాలు చెబుతున్నాయి. ఈ విషయాన్ని జిల్లా అధికారులకు చెప్పి రియల్ ఎస్టేట్ సంస్థలతో చర్చించి, ఐటీకి ఉపయోగపడే భవనాలు నిర్మించాలని కోరారు. అయితే ఆయా సంస్థలతో సమావేశాలు నిర్వహించడానికి అధికారులకు తీరిక లేకుండా కార్యక్రమాలు ఉంటున్నాయి.
మౌలిక వసతుల్లో వేగం అవసరం
ఓ.నరేశ్ కుమార్, ఉపాధ్యక్షులు, రుసికొండ ఐటీ అసోసియేషన్
విశాఖపట్నానికి ఐటీ రంగంలో భారీ పెట్టుబడులు వస్తున్నాయి. అందుకు తగిన మౌలిక వసతులు సమకూర్చాల్సి ఉంది. ఐటీ పార్కులో అన్ని భవనాలు ఆపరేషన్‌లోకి వచ్చేలా చర్యలు చేపట్టాలి. అవసరమైతే ఆయా భవనాల యజమానుల నుంచి ప్రభుత్వమే లీజుకు తీసుకొని ఐటీ కంపెనీలకు కేటాయించాలి. ఐటీ హిల్స్‌లో ఉద్యోగులకు మరిన్ని వసతులు కల్పించాలి.
ఇన్ఫోసిస్, డబ్ల్యుఎన్‌ఎస్ విస్తరణ
శ్రీధర్ కొసరాజు, పూర్వ రాష్ట్ర ఐటీ అధ్యక్షులు
విశాఖపట్నంలో ఇన్ఫోసిస్‌కు 1,900 మంది ఉద్యోగులు ఉన్నారు. విస్తరణకు వెళుతోంది. అలాగే సిరిపురం జంక్షన్‌లోని డబ్ల్యుఎన్‌ఎస్ కూడా విస్తరణ చేపడుతోంది. ఈ రెండింటికి చెరో లక్ష చదరపు అడుగుల విస్తీర్ణం కలిగిన భవనాలు కావాలి. ఐటీ పార్కులో భవనానికి ఇటీవల ఎన్‌జీటీ అనుమతి వచ్చింది. అది కూడా అందుబాటులోకి వస్తే మరో రెండు కంపెనీలకు ప్లగ్ అండ్ ప్లే సౌకర్యం లభిస్తుంది.