Share News

వీఎంఆర్‌డీఏ భూములపై ఐటీ కంపెనీల కన్ను

ABN , Publish Date - Jul 31 , 2025 | 01:14 AM

విశాఖ మహా నగర ప్రాంత అభివృద్ధి సంస్థ (వీఎంఆర్‌డీఏ)కు చెందిన భూములపై ఐటీ సంస్థలు ఆసక్తి చూపుతున్నాయి. ఇటీవల విశాఖకు పెద్ద పెద్ద ఐటీ సంస్థలు క్యూ కడుతున్నాయి. రాష్ట్ర ప్రభుత్వం టీసీఎస్‌, కాగ్నిజెంట్‌ సంస్థలకు రుషికొండలో భూములు కేటాయించిన సంగతి తెలిసిందే. ఆనందపురం మండలం తర్లువాడలో గూగుల్‌ డేటా పార్క్‌కు 200 ఎకరాలు సిద్ధం చేస్తున్నారు. తాజాగా రాష్ట్ర మంత్రి మండలి ఏఎన్‌ఎస్‌ఆర్‌, తదితర కంపెనీలకు భూములు కేటాయించింది. వీఎంఆర్‌డీఏ ఇప్పటికే అభివృద్ధి చేసిన భూములు రుషికొండ, మధురవాడ ప్రాంతాల్లో ఉండడంతో వాటిని తమకు కేటాయించాలని ఐటీ సంస్థలు ప్రభుత్వాన్ని

వీఎంఆర్‌డీఏ భూములపై  ఐటీ కంపెనీల కన్ను

రుషికొండలో రెండు భారీ ప్రాజెక్టులకు

నగర ప్రాంత అభివృద్ధి సంస్థ ప్రణాళిక

అందులో ఒకటి...ఈస్ట్‌ కోస్ట్‌ హేబిటేట్‌ సెంటర్‌

మరొకటి...‘వైజాగ్‌ ఎక్స్‌పీరియన్స్‌ అండ్‌ వర్చువల్‌ రియాల్టీ ఎరీనా

ఇప్పటికే ఆసక్తి వ్యక్తీకరణ ప్రకటన విడుదలు

ఆ భూములు తమకు కేటాయించాల్సిందిగా

ప్రభుత్వాన్ని కోరుతున్న ఐటీ సంస్థలు

(విశాఖపట్నం-ఆంధ్రజ్యోతి)

విశాఖ మహా నగర ప్రాంత అభివృద్ధి సంస్థ (వీఎంఆర్‌డీఏ)కు చెందిన భూములపై ఐటీ సంస్థలు ఆసక్తి చూపుతున్నాయి. ఇటీవల విశాఖకు పెద్ద పెద్ద ఐటీ సంస్థలు క్యూ కడుతున్నాయి. రాష్ట్ర ప్రభుత్వం టీసీఎస్‌, కాగ్నిజెంట్‌ సంస్థలకు రుషికొండలో భూములు కేటాయించిన సంగతి తెలిసిందే. ఆనందపురం మండలం తర్లువాడలో గూగుల్‌ డేటా పార్క్‌కు 200 ఎకరాలు సిద్ధం చేస్తున్నారు. తాజాగా రాష్ట్ర మంత్రి మండలి ఏఎన్‌ఎస్‌ఆర్‌, తదితర కంపెనీలకు భూములు కేటాయించింది. వీఎంఆర్‌డీఏ ఇప్పటికే అభివృద్ధి చేసిన భూములు రుషికొండ, మధురవాడ ప్రాంతాల్లో ఉండడంతో వాటిని తమకు కేటాయించాలని ఐటీ సంస్థలు ప్రభుత్వాన్ని కోరుతున్నాయి.

రుషికొండ ప్రాంతంలో వీఎంఆర్‌డీఏ రెండు కీలకమైన ఐకానిక్‌ ప్రాజెక్టులకు ప్రణాళిక రూపొందించింది. లా కాలేజీకి వెళ్లే మార్గంలో పనోరమ హిల్స్‌ వద్ద సుమారు 8.82 ఎకరాల విస్తీర్ణంలో ఢిల్లీ తరహాలో ఈస్ట్‌ కోస్ట్‌ హేబిటేట్‌ సెంటర్‌ నిర్మాణానికి ఆసక్తి వ్యక్తీకరణ ప్రకటన ఈ ఏడాది మార్చిలో చేసింది. ఆఫీస్‌ స్పేస్‌, బిజినెస్‌ సెంటర్‌, ఆడిటోరియం, ఎగ్జిబిషన్‌ హాల్‌, బొటిక్‌, హోటల్‌, సర్వీస్‌ అపార్ట్‌మెంట్‌, ప్రీమియం క్లబ్‌, ఈవెంట్‌/పార్టీ లాన్స్‌, ఫైన్‌ డైన్‌ రెస్టారెంట్లు, స్పోర్ట్స్‌ సెంటర్‌, సూపర్‌ మార్కెట్‌ అందులో ఉంటాయి. ఈ ప్రాజెక్టుకు సుమారుగా రూ.460 కోట్ల వరకు వ్యయం అవుతుందని అంచనా. 33 ఏళ్ల లీజుకు ఇస్తారు. అదేవిధంగా విశాఖపట్నం పర్యాటక కేంద్రంగా మరింత అభివృద్ధి సాధించడానికి ‘వైజాగ్‌ ఎక్స్‌పీరియన్స్‌ అండ్‌ వర్చువల్‌ రియాల్టీ ఎరీనా అండ్‌ 3 స్టార్‌ హోటల్‌’ నిర్మాణానికి ప్రణాళిక రూపొందించారు. ఇది కూడా లా కాలేజీ మార్గంలో ఐకానికా గ్రాండ్‌ సమీపాన 2.82 ఎకరాల్లో వస్తుంది. 360 డిగ్రీల ఇమ్మెన్సివ్‌ థియేటర్‌, మిక్స్‌డ్‌ రియాల్టీ ఎస్కేప్‌ రూమ్‌, యానిమేషన్‌ షో, వీఆర్‌ గేమింగ్‌ జోన్‌, అక్వేరియం వంటి ఉంటాయి. డ్రైవ్‌-ఇన్‌ ఫుడ్‌ జోన్‌, 24/7 కేఫ్‌లు, 3 స్టార్‌ హోటల్‌ నిర్మిస్తారు.

మధురవాడ పరిసర ప్రాంతాల్లోని ఐటీ కంపెనీలు, అందులో పనిచేసే ఉద్యోగుల కుటుంబాల అవసరాల కోసం దీనిని డిజైన్‌ చేశారు. అయితే వీటికి ఆసక్తి వ్యక్తీకరణ ప్రకటన చేస్తే...పలు సంస్థలు తాము ఐటీ కంపెనీలు పెట్టుకుంటామని, ఆయా భూములు తమకు ఇవ్వాలని రాష్ట్ర ప్రభుత్వం వద్దకు వెళ్లాయి. వీఎంఆర్‌డీఏ మాత్రం తమ వద్ద ఇంకా అనేక భూములు అదే ప్రాంతంలో ఉన్నాయని, వాటిని ఐటీ సంస్థలకు ఇస్తామని, వీటిలో మాత్రం ముందుగా పేర్కొన్న ప్రాజెక్టులనే చేపడతామని స్పష్టం చేసినట్టు తెలిసింది. అలా చేస్తేనే కొత్త ఐటీ కంపెనీలకు కూడా ఉపయోగకరంగా ఉంటుందని, ఆ ప్రాంతం మరింత అభివృద్ధి సాధిస్తుందని వీఎంఆర్‌డీఏ ప్రతినిధులు అమరావతి అధికారులకు చెప్పినట్టు సమాచారం.

Updated Date - Jul 31 , 2025 | 01:14 AM