Share News

నెల రోజుల్లో పెండింగ్‌ టీడీఆర్‌ల జారీ

ABN , Publish Date - Mar 22 , 2025 | 01:00 AM

విశాఖపట్నంలో రహదారులు, ఇత్యాది నిర్మాణాల్లో భూములు కోల్పోయిన వారికి టీడీఆర్‌లు ఇవ్వడంలో చాలా జాప్యం జరిగిందని, నెల రోజుల్లో వాటిని క్లియర్‌ చేయాలని జిల్లా కలెక్టర్‌, ఇన్‌చార్జి జీవీఎంసీ కమిషనర్‌ హరేంధిర ప్రసాద్‌కు పురపాలక శాఖామంత్రి నారాయణ సూచించారు.

నెల రోజుల్లో పెండింగ్‌ టీడీఆర్‌ల జారీ

  • జిల్లా అధికారులకు పురపాలక శాఖా మంత్రి నారాయణ ఆదేశం

  • అమరావతిలో జిల్లా ఎమ్మెల్యేలు, కార్పొరేషన్‌ చైర్మన్‌లతో సమావేశం

  • భవిష్యత్తు అవసరాలకు అనుగుణంగా మెట్రో రైలు ప్రాజెక్టు

  • లైట్‌ మెట్రో, మోడరన్‌ ఎలక్ర్టిక్‌ బస్‌ కారిడార్‌లపై చర్చ

  • మాస్టర్‌ ప్లాన్‌ మార్పునకు ఎమ్మెల్యేల డిమాండ్‌

విశాఖపట్నం, మార్చి 21 (ఆంధ్రజ్యోతి):

విశాఖపట్నంలో రహదారులు, ఇత్యాది నిర్మాణాల్లో భూములు కోల్పోయిన వారికి టీడీఆర్‌లు ఇవ్వడంలో చాలా జాప్యం జరిగిందని, నెల రోజుల్లో వాటిని క్లియర్‌ చేయాలని జిల్లా కలెక్టర్‌, ఇన్‌చార్జి జీవీఎంసీ కమిషనర్‌ హరేంధిర ప్రసాద్‌కు పురపాలక శాఖామంత్రి నారాయణ సూచించారు. ఆయన అమరావతిలో జిల్లా ఎమ్మెల్యేలు, కార్పొరేషన్ల చైర్లన్లతో సమావేశమై, వీడియో కాన్ఫరెన్స్‌ ద్వారా కలెక్టర్‌తో మాట్లాడారు. టీడీఆర్‌ల జారీని వేగవంతం చేయాలని మంత్రి ఆదేశించారు. అలాగే విశాఖలో మెట్రో రైలు, మెట్రో లైట్‌, మోడరన్‌ ఎలక్ట్రిక్‌ బస్‌ కారిడార్లపై చర్చించారు. భవిష్యత్తు అవసరాలను దృష్టిలో ఉంచుకొని ఈ ప్రాజెక్టులను ఒక్కొక్కటిగా చేపట్టాల్సి ఉంటుందన్నారు. నిబంధనల మేరకు ముందుకు వెళ్లాలని, ఎక్కడా ఫిర్యాదులు రాకుండా జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. దీనిపై కలెక్టర్‌ హరేంధిర్‌ ప్రసాద్‌ సమాధానమిస్తూ టీడీఆర్‌ బాండ్ల అంశాన్ని లోతుగా పరిశీలించాల్సి ఉందని, మాస్టర్‌ ప్లాన్‌, తాగునీటి సదుపాయం, అంతర్గత రహదారుల అభివృద్ధి పనులు చేపడుతున్నామన్నారు. ఆక్రమణల తొలగింపులో తగిన జాగ్రత్తలు తీసుకుంటామని చెప్పారు.

మాస్టర్‌ ప్లాన్‌పై అభ్యంతరాల వెల్లువ

వైసీపీ ప్రభుత్వ హయాంలో వీఎంఆర్‌డీఏ ఖరారు చేసిన మాస్టర్‌ ప్లాన్‌ను మార్చాల్సిందేనని జిల్లా ఎమ్మెల్యేలు పట్టుబట్టారు. విశాఖ నుంచి ఆన్‌లైన్‌లో సమావేశంలో పాల్గొన్న భీమిలి ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావు మాట్లాడుతూ, తన నియోజకవర్గంలో మాజీ ఎంపీ విజయసాయిరెడ్డి వారి స్వార్థం కోసం మాస్టర్‌ ప్లాన్‌ని సంగివలస మీదుగా మళ్లించారని ఆరోపించారు. అవసరమైతే సీఆర్‌జెడ్‌ నిబంధనలు సవరించి అయినా సరే బీచ్‌ కారిడార్‌ను, మాస్టర్‌ప్లాన్‌ను సరిచేయాలని మంత్రిని కోరారు. ఈ మాస్టర్‌ ప్లాన్‌ విషయంలో స్థానిక ప్రజా ప్రతినిధుల సూచనలు పరిగణనలోకి తీసుకోవాలని వీఎంఆర్‌డీఏ కమిషనర్‌ విశ్వనాథన్‌కు మంత్రి నారాయణ సూచించారు. రహదారుల విస్తరణకు అవసరమైన మేరకే ప్రజల నుంచి భూమి తీసుకోవాలన్నారు. భోగాపురం విమానాశ్రయాన్ని అనుసంధానించే రహదారుల అభివృద్ధి పనులు తక్షణమే చేపట్టాలన్నారు. డబుల్‌ డెక్కర్‌, మెట్రో కారిడార్‌ ఆలోచన ఉందని ఈ సందర్భంగా మంత్రి వెల్లడించారు. భోగాపురం విమానాశ్రయానికి విశాఖ నుంచి వెళ్లడానికి ట్రాఫిక్‌ సమస్యలు అనేకం ఉన్నాయని, వాటికి పరిష్కారం చూపించాలని ఎమ్మెల్యేలు కోరారు. అమరావతిపై వారం వారం సమీక్షిస్తున్నట్టుగానే విశాఖ అభివృద్ధిపై వారం వారం సమీక్షించాలని గంటా శ్రీనివాసరావు ఈ సందర్భంగా కోరారు. భూముల అన్యాక్రాంతం విషయాల్లో అధికారులు కఠినంగా వ్యవహరించాలని, మోసపోయిన ప్రజలకు అండగా ఉండాలన్నారు. ఈ సమావేశంలో ఎమ్మెల్యేలు పల్లా శ్రీనివాసరావు, వెలగపూడి రామకృష్ణబాబు, గణబాబు, కొణతాల రామకృష్ణ, పంచకర్ల రమేశ్‌బాబు, విష్ణుకుమార్‌రాజు, వంశీకృష్ణ శ్రీనివాస్‌, కార్పొరేషన్‌ చైర్మన్లు పీలా గోవింద్‌, ప్రణవ్‌గోపాల్‌ ఇతర శాఖల ఉన్నతాధికారులు పాల్గొన్నారు.

Updated Date - Mar 22 , 2025 | 01:00 AM