Share News

పారిశ్రామిక రంగాన్ని ప్రోత్సహించే తీరు ఇదేనా?

ABN , Publish Date - Aug 11 , 2025 | 11:18 PM

జిల్లాలో పారిశ్రామిక రంగాన్ని ప్రోత్సహించే తీరు ఇదేనా? అని జిల్లా పరిశ్రమల శాఖాధికారులపై కలెక్టర్‌ ఏఎస్‌.దినేశ్‌కుమార్‌ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. కలెక్టరేట్‌లో సోమవారం నిర్వహించిన జిల్లా పరిశ్రమలు, ఎగుమతి కమిటీ సమావేశంలో ఆయన మాట్లాడారు.

పారిశ్రామిక రంగాన్ని ప్రోత్సహించే తీరు ఇదేనా?
వివిధ శాఖల అధికారులతో సమావేశమైన కలెక్టర్‌ ఏఎస్‌ దినేశ్‌కుమార్‌

అధికారులపై కలెక్టర్‌ ఆగ్రహం

ఔత్సాహిక పారిశ్రామిక వేత్తలను ప్రోత్సహించాలని సూచన

పాడేరు, ఆగస్టు 11(ఆంధ్రజ్యోతి): జిల్లాలో పారిశ్రామిక రంగాన్ని ప్రోత్సహించే తీరు ఇదేనా? అని జిల్లా పరిశ్రమల శాఖాధికారులపై కలెక్టర్‌ ఏఎస్‌.దినేశ్‌కుమార్‌ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. కలెక్టరేట్‌లో సోమవారం నిర్వహించిన జిల్లా పరిశ్రమలు, ఎగుమతి కమిటీ సమావేశంలో ఆయన మాట్లాడారు. ఔత్సాహిక పారిశ్రామిక వేత్తలను ప్రోత్సహించాలని, జిల్లాలో పరిశ్రమలను స్థాపించాలనే అంశాలపై కనీసం శ్రద్ధ లేని విధంగా అధికారులు వ్యవహరిస్తున్నారన్నారు. ఇటువంటి చర్యలతో జిల్లాకు నష్టం కలుగుతుందని, ప్రభుత్వానికి చెడ్డపేరు వస్తుందని మందలించారు. జిల్లా వ్యాప్తంగా వాహనాల కొనుగోలు, వివిధ పరిశ్రమలు, సేవా రంగాలను నెలకొల్పిన 160 మందికి రాయితీలు అందించాల్సి ఉండగా, ఎందుకు ఒక్కరికీ పారిశ్రామిక రాయితీ విడుదల చేయలేదని ప్రశ్నించారు. తక్షణమే అర్హులైన లబ్థిదారులను గుర్తించి రాయితీలు అందించాలన్నారు. అలాగే ప్రతి మండలంలో ఇంజనీరింగ్‌ అసిస్టెంట్లను ఇండస్ర్టియల్‌ ప్రమోషన్‌ అధికారులుగా నియమించి తగిన శిక్షణ అందించాలన్నారు. మొత్తం దరఖాస్తుల్లో కనీసం పది కూడా పరిష్కరించలేదని అసహనం వ్యక్తం చేశారు. పరిశ్రమల శాఖాధికారులు పనితీరు మార్చుకుని ఔత్సాహిక పారిశ్రామిక వేత్తలను విధిగా ప్రోత్సహించాలని అధికారులను ఆయన ఆదేశించారు. పరిశ్రమలు, క్రషర్ల నుంచి వస్తున్న కాలుష్యాలపై అధిక సంఖ్యలో ఫిర్యాదులు వస్తున్నాయన్నారు. ఆయా పరిశ్రమలు, క్రషర్లను అధికారులు తనిఖీ చేయాలని, కాలుష్య నివారణ చర్యలు చేపట్టాలని సూచించారు. ఈ సమావేశంలో పాడేరు ఐటీడీఏ పీవో డాక్టర్‌ ఎంజే.అభిషేక్‌గౌడ, కె.సింహాచలం, సబ్‌కలెక్టర్‌ శౌర్యమన్‌ పటేల్‌, జిల్లా పరిశ్రమల శాఖాధికారి జి.రవిశంకర్‌, సహాయ సంచాలకుడు ఆర్‌వీ.రమణారావు, జిల్లా గ్రామీణాభివృద్ధికి సంస్థ పీడీ వి.మురళి, కాలుష్య నియంత్ర మండలి ఎగ్జిక్యూటివ్‌ ఇంజనీర్‌ సరిత, తదితరులు పాల్గొన్నారు.

Updated Date - Aug 11 , 2025 | 11:18 PM