Share News

రైతు బజారు గతి ఇంతేనా?

ABN , Publish Date - Nov 16 , 2025 | 01:21 AM

రైతులు దళారుల చేతిలో మోసపోకుండా ఉండేందుకు, ప్రజలకు నాణ్యమైన తాజా కూరగాయలను అందించాలనే ఉద్దేశంతో ఎలమంచిలిలో నిర్మించిన రైతు బజారు సుమారు పదేళ్లుగా నిరుపయోగంగా ఉంది.

రైతు బజారు గతి ఇంతేనా?
మూసి ఉన్న రైతు బజారు

రైతులు, వినియోగదారులకు మేలు చేకూర్చేందుకు 14 ఏళ్ల క్రితం నిర్మాణం

తొలినాళ్లలో ఆదరణ.. నిర్వహణ లేక క్రమేపీ కళావిహీనం

పదేళ్ల క్రితం మూసివేత

ప్రస్తుతం ప్రాంగణమంతా పిచ్చి మొక్కలతో అధ్వానం

పట్టించుకోని ప్రజాప్రతినిధులు, అధికారులు

ఎలమంచిలి, నవంబరు 15 (ఆంధ్రజ్యోతి): రైతులు దళారుల చేతిలో మోసపోకుండా ఉండేందుకు, ప్రజలకు నాణ్యమైన తాజా కూరగాయలను అందించాలనే ఉద్దేశంతో ఎలమంచిలిలో నిర్మించిన రైతు బజారు సుమారు పదేళ్లుగా నిరుపయోగంగా ఉంది. ప్రస్తుతం రైతు బజారు ప్రాంగణం పిచ్చి మొక్కలతో అధ్వానంగా ఉంది. ప్రజాప్రతి నిధులు, అధికారులు పట్టించుకోకపోవడంతో ఈ దుస్థితి నెలకొందని వినియోగదారులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

ఎలమంచిలిలోని ఎంపీడీవో కార్యాలయం పక్కన 2011లో రైతు బజారును ప్రారంభించారు. మొదట్లో వినియోగదారులతో బజారు కళకళలాడుతుండేది. క్రమేణా దాని నిర్వహణను అధికారులు పట్టించుకోకపోవడంతో కళ తప్పింది. ఆదరణ లేదన్న సాకుతో సుమారు పదేళ్ల క్రితం రైతు బజారును మూసి వేశారు. దీంతో వినియోగదారులకు తాజా కూరగాయలు దొరక్కపోగా, బహిరంగ మార్కెట్లో అధిక ధరకు కొనుక్కోవలసి వస్తోంది. రైతు బజారు లేకపోవడంతో రైతులకు కూడా దళారుల బెడద తప్పడం లేదు. అలాగే లక్షలాది రూపాయలతో నిర్మించిన రైతు బజారు ప్రస్తుతం ఘోరంగా ఉంది. ఇప్పటికైనా ప్రజాప్రతినిధులు, అధికారులు స్పందించి రైతు బజారును పునఃప్రారంభించేలా చర్యలు తీసుకోవాలని రైతులు, వినియోగదారులు కోరుతున్నారు.

Updated Date - Nov 16 , 2025 | 01:21 AM