Share News

ఇదేం తీరువా?

ABN , Publish Date - Nov 23 , 2025 | 12:40 AM

డివిజన్‌ నీటి తీరువా బకాయిలు కొండలా పేరుకుపోయాయి. రైతుల నుంచి నీటి తీరువా ద్వారా వసూలు చేసిన నిధులు సాగునీటి ప్రాజెక్టులు, కాలువల అభివృద్ధికి, మరమ్మతులకు ఉపయోగిస్తారు. అయితే 2007 నుంచి నీటి పన్ను వసూళ్లలో ప్రభుత్వాలు నిర్లక్ష్యం చేశాయి. దీంతో రూ.17 కోట్ల బకాయిలు పేరుకుపోయాయి. రైతులు చెల్లించాల్సిన అసలు, వడ్డీ కలిపి పన్ను బకాయిలు భారీగా పెరిగాయి.

ఇదేం తీరువా?
తాండవ మేజర్‌ ప్రాజెక్టు

- డివిజన్‌లో నీటి తీరువా బకాయిలు రూ.15 కోట్లు

- మొత్తం 2,01,493 ఖాతాలు

- సచివాలయాల్లో ఆన్‌లైన్‌లో చెల్లింపులు

- వసూళ్లు చేయాల్సింది కొండంత, చేసింది చీమంత

- రైతుల నుంచి సాగునీటి పన్ను వసూళ్లలో నిర్లక్ష్యం

- కొండలా పేరుకుపోయిన బకాయిలు

నర్సీపట్నం, నవంబరు 22 (ఆంధ్రజ్యోతి): డివిజన్‌ నీటి తీరువా బకాయిలు కొండలా పేరుకుపోయాయి. రైతుల నుంచి నీటి తీరువా ద్వారా వసూలు చేసిన నిధులు సాగునీటి ప్రాజెక్టులు, కాలువల అభివృద్ధికి, మరమ్మతులకు ఉపయోగిస్తారు. అయితే 2007 నుంచి నీటి పన్ను వసూళ్లలో ప్రభుత్వాలు నిర్లక్ష్యం చేశాయి. దీంతో రూ.17 కోట్ల బకాయిలు పేరుకుపోయాయి. రైతులు చెల్లించాల్సిన అసలు, వడ్డీ కలిపి పన్ను బకాయిలు భారీగా పెరిగాయి.

ప్రభుత్వం వ్యవసాయ భూములకు సాగునీటి పథకాల ద్వారా నీరు అందించినందుకు రైతుల నుంచి సంవత్సరానికి ఒకసారి నీటి తీరువా (వాటర్‌ ట్యాక్స్‌) వసూలు చేస్తుంది. మైనర్‌ ప్రాజెక్టుల కింద వ్యవసాయ భూములకు ఎకరాకి రూ.100లు, మేజర్‌ ప్రాజెక్టుల కింద భూములకు రూ.200 చొప్పున రైతులు ప్రభుత్వానికి పన్ను చెల్లించాలి. ఒక ఏడాది నీటి పన్ను చెల్లించకపోతే రైతుపై 6 శాతం వడ్డీ పడుతుంది. ఏడాదికి ఒకసారి నీటి తీరువా చెల్లించడం రైతులకు పెద్ద కష్టం కాదు. కానీ అధికారులు ఏళ్ల తరబడి పన్ను అడగడం మానేశారు. పూర్వం వీఆర్‌వోలు వసూళ్లు చేసేవారు. గత మూడేళ్లుగా సచివాయాలలో ఆన్‌లైన్‌లో చెల్లిస్తే రశీదు ఇస్తున్నారు. సంవత్సరం మొత్తం వసూలు చేసిన నీటి తీరువా నగదు మండల తహశీల్దార్లు కాడా ( కమాండ్‌ ఏరియా డెవలప్‌మెంట్‌ అథారటీ) కమిషనర్‌ ఖాతాకి బదిలీ చేసి ప్రొసీడింగ్స్‌ పంపుతారు. జలవనరుల శాఖ అధికారులు సాగునీటి పథకాల మరమ్మతులు, అబివృద్ధి పనులకు ప్రభుత్వానికి ప్రతిపాదనలు పెట్టినప్పుడు తహశీల్దార్లు పంపిన ప్రొసీడింగ్స్‌ పత్రాలు జత చేస్తారు. 2007 నుంచి నీటి తీరువా వసూళ్లపై ప్రభుత్వాలు నిరక్ష్యం చేశాయి. దీని వలన సాగునీటి పథకాల మరమ్మతులకు ప్రభుత్వం నిధులు విడుదల చేసే వరకు ఆగాల్సి వస్తుంది. దీని వలన పంట కాలువలు, ఆనకట్ట మరమ్మతులు చేపట్టడంతో జాప్యం జరుగుతుంది. పంట కాలువలో పూడిక తొలగించడం లేదు. దీని వలన సాగు నీరు చివరి ఆయకట్టు వరకు అందక రైతులు ఇబ్బంది పడుతున్నారు.

నర్సీపట్నం జల వనరుల శాఖ ఈఈ పరిధిలో నర్సీపట్నం, పాయకరావుపేట, ఎలమంచిలి నియోజకవర్గాల్లోని 12 మండలాలతో పాటు రోలుగుంట మండలం, రావికమతం మండలంలో కొంత భాగం ఉంది. జలవనరుల శాఖ డివిజన్‌లోని 137 మైనర్‌ ఇరిగేషన్‌ పథకాల పరిధిలో 83,715 ఎకరాల ఆయకట్టు ఉంది. మేజర్‌ ఇరిగేషన్‌ ప్రాజెక్ట్‌ తాండవ ఒక్కటే ఉంది. ప్రాజెక్ట్‌ కమిటీ ఒకటి, డిస్ట్రిబ్యూషన్‌ కమిటీలు ఐదు, నీటి సంఘాలు 27 ఉన్నాయి. తాండవ పరిధిలో 53,415 ఎకరాల ఆయకట్టు ఉంది.

నీటి తీరువా బకాయిలు రూ.15 కోట్లు

నర్సీపట్నం రెవెన్యూ డివిజన్‌ పరిధిలో 3,53,872 ఎకరాలు వ్యవసాయ భూములకు సంబంధించి 2,01,493 ఖాతాలు ఉన్నారు. రైతుల నుంచి వసూలు చేయాల్సింది రూ.16,67,,41,893లు ఉండగా, అక్టోబరు నెలాఖరుకి రూ.1,69,93,418లు మాత్రమే వసూలు అయింది. ఇంకా రూ.15 కోట్లు బకాయిలు వసూలు కావలసి ఉంది.

నీటి పన్ను బకాయిలు వసూలు చేయాల్సిందే...

గత నెలలో అనకాపల్లిలో కలెక్టర్‌ విజయ్‌కృష్ణన్‌ ఆధ్వర్యంలో సాగునీటి పారుదల సలహా మండలి సమావేశం జరిగింది. జాయింట్‌ కలెక్టర్‌, నర్సీపట్నం ఆర్డీవో వీవీ రమణ, ఇరిగేషన్‌ ఎస్‌ఈ, డిస్ట్రిబ్యూషన్‌ కమిటీ చైర్మన్లు, వైస్‌ చైర్మన్లు, ప్రాజెక్ట్‌ కమిటీ చైర్మన్లు, వైస్‌ చైర్మన్లు, కొంత మంది నీటి సంఘాల అధ్యక్షులు ఈ సమావేశంలో పాల్గొన్నారు. రైతుల నుంచి నీటి తీరువా బకాయిల వసూళ్లపై చర్చించారు. జిల్లాలో సాగునీటి పథకాల నిర్వహణ అధ్వానంగా ఉందని తెలిపారు. సాగునీటి పథకాల మరమ్మతులు, కాలువలో పూడిక సమస్యలు ఉన్నాయని ప్రాజెక్ట్‌ చైర్మన్లు సమస్యను లేవనెత్తారు. నీటి తీరువాల బకాయిలు వసూళ్లపై దృష్టి పెట్టాలని సూచించారు. పంట కాలువల ఆక్రమణలపై చర్యలు తీసుకోవాలని కోరారు.

Updated Date - Nov 23 , 2025 | 12:40 AM