Share News

అసంపూర్తి భవనాలకు మోక్షమెన్నడో?

ABN , Publish Date - Jun 05 , 2025 | 11:12 PM

మండలంలో ప్రభుత్వ కార్యాలయాల కోసం చేపట్టిన భవనాల నిర్మాణాలు అసంపూర్తిగా దర్శనమిస్తున్నాయి. మండలంలోని కంఠారం, మంప పంచాయతీల్లో సుమారు రూ.కోటి వ్యయంతో చేపట్టిన భవనాల నిర్మాణాలు ఐదేళ్లుగా ఎక్కడ వేసిన గొంగలి అక్కడే అనే చందంగా ఉన్నాయి.

అసంపూర్తి భవనాలకు మోక్షమెన్నడో?
అసంపూర్తిగా ఉన్న మంపలోని పంచాయతీ కార్యాలయ భవనం

గత వైసీపీ ప్రభుత్వంలో నిలిచిపోయిన పనులు

తుది దశకు చేరిన వాటికి కూడా నిధుల కేటాయింపులు శూన్యం

కొయ్యూరు, జూన్‌ 5(ఆంధ్రజ్యోతి): మండలంలో ప్రభుత్వ కార్యాలయాల కోసం చేపట్టిన భవనాల నిర్మాణాలు అసంపూర్తిగా దర్శనమిస్తున్నాయి. మండలంలోని కంఠారం, మంప పంచాయతీల్లో సుమారు రూ.కోటి వ్యయంతో చేపట్టిన భవనాల నిర్మాణాలు ఐదేళ్లుగా ఎక్కడ వేసిన గొంగలి అక్కడే అనే చందంగా ఉన్నాయి.

కంఠారంలో 2018లో టీడీపీ ప్రభుత్వ హయాంలో పంచాయతీ కార్యాలయ నిర్వహణకు ఎంజీఎన్‌ఆర్‌ఈజీఎస్‌ నిధులు రూ.20 లక్షలు మంజారు చేశారు. ఈ నిధులతో భవన నిర్మాణం దాదాపు పూర్తయింది. దీనికి తుది మెరుగులు దిద్దాల్సి ఉంది. ఈ భవనం అందుబాటులోకి వచ్చేలోపే ప్రభుత్వం మారింది. వైసీపీ ప్రభుత్వం వచ్చాక సచివాలయ వ్యవస్థను తీసుకొచ్చి వాటికి నిధులు కేటాయించింది. కొంచెం నిధులు ఇస్తే పూర్తయ్యే పంచాయతీ కార్యాలయ భవనాన్ని గాలికొదిలేసింది. అలాగే మంపలో గత ప్రభుత్వ హయాంలో మంజూరు చేసిన పంచాయతీ కార్యాలయ భవన నిర్మాణాలు తుది దశకు చేరాయి. అయితే కాంట్రాక్టర్‌కు బిల్లులు చెల్లించకపోవడంతో పనులు నిలిచిపోయాయి. కంఠారం గ్రామంలో పీహెచ్‌సీ వెనుక ఐటీడీఏ నిధులు రూ.20 లక్షలు వెచ్చించి ఏఎన్‌ఎం సబ్‌ సెంటర్‌తోపాటు అంగన్‌వాడీ కేంద్రం నిర్వహణకు 2015లో నిధులు మంజూరు చేయగా, 2016లో గిరిజన సంక్షేమ ఇంజనీరింగ్‌ విభాగం పర్యవేక్షణలో పనులు ప్రారంభించారు. 2020 నవంబరు నాటికి అన్ని హంగులతో భవనాన్ని పూర్తి చేసి పీహెచ్‌సీ వైద్యాధికారికి అప్పగించారు. అయితే గ్రామంలో అప్పటికే అంగన్‌వాడీ భవనం, సబ్‌ సెంటర్‌ భవనాలు ఉండడంతో నాటి నుంచి ఈ భవనాన్ని వినియోగించిన దాఖలాలు లేవు. దీంతో ఈ భవనం చుట్టూ తుప్పలు పెరిగిపోయి రాత్రి వేళల్లో అసాంఘిక కార్యకలాపాలకు నిలయంగా మారింది. ఈ భవనాన్ని బర్త్‌ వెయిటింగ్‌ హాల్‌గా మార్పు చేసి వినియోగంలోకి తేవాలని పీహెచ్‌సీని సందర్శించిన పలువురు ఉన్నతాధికారులు వైద్యాధికారిని ఆదేశించినా, ఆ దిశగా చర్యలు చేపట్టలేదు. కాగా ప్రతీ పంచాయతీలోనూ అప్పటి తెలుగుదేశం పార్టీ హయాంలో నిధులు మంజూరు చేసి ప్రభుత్వం మార్పు అనంతరం బిల్లులు చెల్లించకపోవడంతో చాలా భవనాలు అసంపూర్తిగా దర్శనమిస్తున్నాయి. ఇప్పటికైనా ప్రజాప్రతినిధులు, అధికారులు స్పందించి అసంపూర్తి భవనాలను పూర్తి చేసి అందుబాటులోకి తేవాలని పలువురు కోరుతున్నారు.

Updated Date - Jun 05 , 2025 | 11:12 PM