Share News

అసంపూర్తి భవనాలకు మోక్షమెన్నడో?

ABN , Publish Date - May 19 , 2025 | 11:29 PM

మండలంలోని పలు ప్రభుత్వ శాఖల భవనాలు అసంపూర్తిగా దర్శనమిస్తున్నాయి. గత వైసీపీ ప్రభుత్వంలో సక్రమంగా బిల్లులు మంజూరు చేయకపోవడంతో కాంట్రాక్టర్లు పనులను నిలిపివేయడంతో ఈ పరిస్థితి నెలకొంది. దీంతో ఉద్యోగులు పరాయి పంచన అరకొర వసతుల నడుమ విధులు నిర్వహిస్తున్నారు.

అసంపూర్తి భవనాలకు మోక్షమెన్నడో?
అసంపూర్తిగా ఉన్న తహసీల్దార్‌ కార్యాలయ భవనం

గత వైసీపీ ప్రభుత్వంలో నిలిచిపోయిన నిర్మాణ పనులు

మొండి గోడలతో సచివాలయ, ఆర్‌బీకే భవనాలు

పూర్తికాని తహసీల్దార్‌ కార్యాలయ భవనం

ఉద్యోగులకు తప్పని ఇబ్బందులు

డుంబ్రిగుడ, మే 19 (ఆంధ్రజ్యోతి): మండలంలోని పలు ప్రభుత్వ శాఖల భవనాలు అసంపూర్తిగా దర్శనమిస్తున్నాయి. గత వైసీపీ ప్రభుత్వంలో సక్రమంగా బిల్లులు మంజూరు చేయకపోవడంతో కాంట్రాక్టర్లు పనులను నిలిపివేయడంతో ఈ పరిస్థితి నెలకొంది. దీంతో ఉద్యోగులు పరాయి పంచన అరకొర వసతుల నడుమ విధులు నిర్వహిస్తున్నారు. వివిధ సేవల నిమిత్తం కార్యాలయాలకు వచ్చే గిరిజనులు కూడా ఇబ్బందులు పడుతున్నారు.

మండల కేంద్రంలోని తహసీల్దార్‌ కార్యాలయ నూతన భవన నిర్మాణ పనులు నిలిచిపోవడంతో అసంపూర్తిగా దర్శనమిస్తోంది. దీంతో పాత భవనంలోనే ఉద్యోగులు విధులు నిర్వహిస్తున్నారు. ప్రస్తుతం కురుస్తున్న వర్షాలకు ఈ భవనంలోకి నీరు చేరుతుండడంతో ఉద్యోగులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. భవనం పెచ్చులు ఊడిపోతూ ఏ క్షణంలో కూలిపోతుందోనని ఉద్యోగులు ఆందోళన వ్యక్తంచేస్తున్నారు. నూతన భవన నిర్మాణానికి పదేళ్ల క్రితం ఉన్నతాధికారులు, ప్రజా ప్రతినిధులు అట్టహాసంగా శంకుస్థాపన చేశారు. అనంతరం కాంట్రాక్టర్‌ పనులు ప్రారంభించినా, బిల్లులు మంజూరుకాకపోవడంతో మధ్యలోనే నిర్మాణ పనులు నిలిపివేశారు. దీంతో అసంపూర్తిగా భవనం మిగిలిపోయింది.

సచివాలయ భవనాలు

మండల వ్యాప్తంగా 18 పంచాయతీలున్నాయి. గత వైసీపీ ప్రభుత్వ హయాంలో 2019లో 16 సచివాలయాల భవన నిర్మాణాలు ప్రారంభించింది. ఇందులో కురిడి, గుంటసీమ సచివాలయాలు పూర్తయి అందుబాటులోకి రాగా, మిగతా 14 సచివాలయాల భవనాలు అసంపూర్తిగా దర్శనమిస్తున్నాయి. కొర్రా, కించుమండ, కితలంగి, అరకు, పోతంగి, అరమ, గేదెలబంద, గుంటగన్నెల, సొవ్వా, గసబ, కొర్రాయి, బోసువలస, సాగర, కండ్రుం సచివాలయాల భవనాలు శ్లాబ్‌ దశలోనే ఉన్నాయి. దీంతో ఆయా సచివాలయాల సిబ్బంది రేకుల ఇళ్లల్లో విధులు నిర్వహిస్తున్నారు.

పూర్తికాని ఆర్‌బీకేలు

మండలంలోని గిరిజన వ్యవసాయ రైతులకు చేయూతనందించే రైతు భరోసా కేంద్రాలకు భవనాలు లేకపోవడంతో సిబ్బందితోపాటు రైతులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. మండలంలో రైతు భరోసా కేంద్రాలు 12 మంజూరయ్యాయి. వీటిలో అరమ, కొర్రాయి, సాగర మాత్రమే పూర్తయ్యాయి. మిగతా తొమ్మిది ఆర్‌బీకే కేంద్రాలు వివిధ దశల్లో అసంపూర్తిగా ఉన్నాయి. ఇవి ఎప్పటికి పూర్తవుతాయో అర్థంకాని పరిస్థితి ఉంది. ఇప్పటికైనా అధికారులు స్పందించి ఈ నిర్మాణాలను పూర్తి చేయాలని పలువురు కోరుతున్నారు.

Updated Date - May 19 , 2025 | 11:29 PM