సచివాలయ భవనాలకు మోక్షమెన్నడో?
ABN , Publish Date - Jul 23 , 2025 | 11:20 PM
మన్యంలో అసంపూర్తిగా ఉన్న సచివాలయ భవనాలకు ఎప్పుడు మోక్షం కలుగుతుందోనని మన్యంవాసులు ఎదురు చూస్తున్నారు. గత వైసీపీ ప్రభుత్వం ప్రాధాన్యతా భవనాలుగా పేర్కొన్నప్పటికీ వాటి నిర్మాణానికి నిధులు సక్రమంగా విడుదల చేయకపోవడంతో ఎక్కడికక్కడ భవన నిర్మాణాలు నిలిచిపోయాయి.
ఐదేళ్ల వైసీపీ పాలనలో మొక్కుబడిగా భవన నిర్మాణాలు
ఏజెన్సీలో మొత్తం 212 భవనాలు... వాటిలో అసంపూర్తిగా వున్నవి 125
పరాయి పంచన సచివాలయాల నిర్వహణ
అవస్థలు పడుతున్న సిబ్బంది
(పాడేరు- ఆంధ్రజ్యోతి)
మన్యంలో అసంపూర్తిగా ఉన్న సచివాలయ భవనాలకు ఎప్పుడు మోక్షం కలుగుతుందోనని మన్యంవాసులు ఎదురు చూస్తున్నారు. గత వైసీపీ ప్రభుత్వం ప్రాధాన్యతా భవనాలుగా పేర్కొన్నప్పటికీ వాటి నిర్మాణానికి నిధులు సక్రమంగా విడుదల చేయకపోవడంతో ఎక్కడికక్కడ భవన నిర్మాణాలు నిలిచిపోయాయి. దీంతో మూడొంతుల భవనాలు అసంపూర్తిగానే ఉన్నాయి. అలాగే కూటమి ప్రభుత్వం వచ్చి ఏడాదవుతున్నా వాటిపై దృష్టిపెట్టని పరిస్థితి నెలకొంది. దీంతో చిన్న చిన్న భవనాల్లో సచివాలయాలను నిర్వహిస్తూ సిబ్బంది ఇబ్బందులు పడుతున్నారు.
ఏజెన్సీ పదకొండు మండలాల పరిధిలో 212 గ్రామ సచివాలయాలను ఏర్పాటు చేశారు. 2020లో వాటికి శాశ్వత భవనాలు నిర్మించాలని భావించి, జాతీయ ఉపాధి హామీ పథకంలో రూ.40 లక్షల అంచనా వ్యయంతో రెండంతస్థుల భవనాలను ఒక్కో సచివాలయానికి నిర్మించేందుకు ప్రభుత్వం నిర్ణయించింది. ఇందులో భాగంగా ఏజెన్సీ వ్యాప్తంగా 212 గ్రామ సచివాలయాలకు భవనాలను నిర్మించేందుకు రూ.84.8 కోట్లు ప్రభుత్వం మంజూరు చేసింది. కానీ ఆయా భవన నిర్మాణాలకు ప్రభుత్వం సక్రమంగా నిధులను విడుదల చేయలేదు. దీంతో 2020, 2021 రెండేళ్లు భవనాల నిర్మాణాలు నత్తనడకన సాగాయి. ఆఖరుకు 2022లో కొంత మేరకు నిధులు విడుదల కావడంతో అరకొరగా భవన నిర్మాణ పనులు జరిగాయి. ఏజెన్సీలో మొత్తం 212 గ్రామ సచివాలయాల్లో ప్రస్తుతం 87 భవనాలు మాత్రమే పూర్తిగా అందుబాటులోకి రాగా, 20 పూర్తయ్యే స్థాయిలో, 65 తుది దశలో, 28 రెండు శ్లాబుల స్థాయిలో, 10 తొలి శ్లాబ్ వేయగా, 2 రూఫ్‌లెవల్‌లో ఉన్నాయి.
భవనాల అప్పగింతకు అవస్థలెన్నో...
ఏజెన్సీలో గ్రామ సచివాలయ భవనాల నిర్మాణాలు చేపట్టిన కాంట్రాక్టర్లకు రూ.లక్షల్లో బిల్లులను ప్రభుత్వం బకాయిపడింది. వాస్తవానికి సచివాలయ భవనాలు నిర్మించిన కాంట్రాక్టర్లు తీవ్రంగా నష్టపోయారు. వాళ్లు అప్పులు చేసి నిర్మాణాలు చేపట్టినప్పటికీ, అందుకు తగ్గట్టుగా వైసీపీ ప్రభుత్వం నిధులు విడుదల చేయలేదు. దీంతో వివిధ దశల్లో అసంపూర్తిగా ఉన్న భవనాలను సైతం కాంట్రాక్టర్ల నుంచి స్వాధీనం చేసుకోలేని దుస్థితి నెలకొంది. సదరు కాంట్రాక్టర్లకు బకాయిపడ్డ సొమ్మును ఇచ్చిన తరువాత మాత్రమే వాటిని ప్రభుత్వం స్వాధీనం చేసుకోవాల్సిన పరిస్థితి. అయితే ఆ విధంగా చర్యలు చేపట్టేందుకు కోట్లాది రూపాయలు అవసరం కావడంతో ఆ దిశగా కూటమి ప్రభుత్వం చర్యలు చేపట్టడం లేదని పలువురు అంటున్నారు.
మన్యంలో గ్రామ సచివాలయ భవన నిర్మాణ వివరాలు....
మండలం భవనాలు పూర్తయినవి అసంపూర్తిగా ఉన్నవి
అనంతగిరి 21 13 7
అరకులోయ 18 5 13
డుంబ్రిగుడ 16 1 15
హుకుంపేట 26 8 18
పెదబయలు 16 1 15
ముంచంగిపుట్టు 18 0 18
పాడేరు 16 13 3
జి.మాడుగుల 18 11 7
చింతపల్లి 22 10 12
జీకేవీధి 18 9 9
కొయ్యూరు 23 16 7
--------------------------------------------------------------------------
మొత్తం 212 87 125
--------------------------------------------------------------------------