అంగన్‌వాడీ భవనాలకు మోక్షమెన్నడో?
ABN , Publish Date - Aug 23 , 2025 | 11:34 PM
జిల్లాలో పలు అంగన్‌వాడీ కేంద్రాలు అద్దె భవనాల్లో కొనసాగుతున్నాయి. మరిన్ని సొంత భవనాల్లో నిర్వహిస్తున్నా శిథిలావస్థలో ఉన్నాయి. జిల్లాలో అసంపూర్తి నిర్మాణాలతో ఉన్న 208 అంగన్‌వాడీ భవనాలు పూర్తయితే గానీ కొంత మేర సమస్య పరిష్కారం కాదు.
జిల్లాలో మొత్తం 1,908 కేంద్రాలు
కొన్ని శిథిలావస్థలో, మరికొన్ని అరకొర వసతులతో అద్దె భవనాల్లో..
అసంపూర్తి నిర్మాణాలతో 208
తాజా పరిస్థితులపై నివేదిక కోరిన ప్రభుత్వం
నర్సీపట్నం, ఆగస్టు 23 (ఆంధ్రజ్యోతి): జిల్లాలో పలు అంగన్‌వాడీ కేంద్రాలు అద్దె భవనాల్లో కొనసాగుతున్నాయి. మరిన్ని సొంత భవనాల్లో నిర్వహిస్తున్నా శిథిలావస్థలో ఉన్నాయి. జిల్లాలో అసంపూర్తి నిర్మాణాలతో ఉన్న 208 అంగన్‌వాడీ భవనాలు పూర్తయితే గానీ కొంత మేర సమస్య పరిష్కారం కాదు. కూటమి ప్రభుత్వం వచ్చాక వీటిపై నివేదిక కోరింది. దీంతో వీటికి మోక్షం కలుగుతుందని పలువురు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు.
జిల్లాలో 1,908 అంగన్‌వాడీ కేంద్రాలు ఉన్నాయి. వాటిలో సొంత భవనాల్లో నడుపుతున్నవి 892 ఉన్నాయి. అద్దె లేకుండా పాఠశాలల భవనాల్లో నిర్వహిస్తున్నవి 396 ఉన్నాయి. అద్దె భవనాలలో నిర్వహిస్తున్న అంగన్‌వాడీ కేంద్రాలు 620 ఉన్నాయి. ప్రభుత్వం పట్టణ ప్రాంతాలలో రూ.6000, రూరల్ ప్రాంతంలో రూ.2 వేలు చొప్పున అద్దె చెల్లిస్తున్నారు. అద్దె భవనాల్లో సరైన సౌకర్యాలు, ఆట స్థలాలు ఉండడం లేదు.
శిథిలావస్థలో కొన్ని కేంద్రాలు
నర్సీపట్నం మండలం మొండికండి, బుచ్చన్నపాలెం శిథిలావస్థకు చేరుకోవడంతో అద్దె భవనంలోకి మార్చారు. లింగాలపాలెం, కృష్ణాపురం, దుగ్గాడ, చిన్నఉప్పర గూడెం, బంగారిపేట, కశిరెడ్డిపాలెం, కె.అగ్రహారం, అంగన్‌వాడీ భవనాలు శిథిలావస్థలో ఉన్నాయి. గురందొరపాలెం, నగరం, అప్పన్నపాలెం కేంద్రాలు పాడైపోయిన భవనాల్లో నిర్వహిస్తున్నారు. మాకవరపాలెం-2భవనం శిథిలావస్థకు చేరుకోవడంతో తారా స్వచ్ఛంద సేవా సంస్థ భవనంలో ఒక గదిలో నిర్వహిస్తున్నారు. జెడ్ గంగవరం, కొండల అగ్రహారం భవనాలు అద్దె భవనాలలో నిర్వహిస్తున్నారు. రోలుగుంట మండలం అడ్డసార , రోలుగుంట-3 అంగన్‌వాడీ కేంద్రాలు సామాజిక భవనాలలో నడుపుతున్నారు. గొలుగొండ మండలం చోద్యంలో అంగన్‌వాడీ కేంద్రం పనులు ఆగిపోయి అసంపూర్తిగా ఉంది. చాలా చోట్ల అంగన్‌వాడీ కేంద్రాల నిర్మాణానికి అవసరమైన స్థలాలు మంజూరు చేయకపోవడంతో సమస్య ఎదురవుతోంది.
కేంద్రాల్లో ప్రధాన సమస్యలు ఇవీ...
అంగన్‌వాడీ కేంద్రాలకు సొంత భవనాలు లేక సమీపంలోని పాఠశాల గదుల్లోనో, గ్రామాల్లో ఉన్న సామాజిక భవనాల్లోనో నడుతున్నారు. సామాజిక భవనాల్లో అంగన్‌వాడీ కేంద్రాలు నిర్వహించడం వలన ఎన్నో సమస్యలు ఉత్పన్నమవుతున్నాయి. ముఖ్యంగా పౌష్టికాహారం వండించడం, సరుకులు నిల్వ చేసుకోవడానికి ఇబ్బందులు ఎదురవుతున్నాయి. మరుగుదొడ్లు, తాగునీటి సమస్యలు ఉత్పన్నమవుతున్నాయి.